ETV Bharat / state

రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్​

author img

By

Published : May 28, 2020, 7:00 PM IST

Updated : May 28, 2020, 8:19 PM IST

కరోనా భయంతో భయాందోళన చెందుతున్న రాష్ట్రానికి ఇప్పుడు మిడతల టెన్షన్‌ పట్టుకుంది. ఈ రాకాసి దండు రాష్ట్రంలోకి దూసుకురాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. మిడతల దండు తెలంగాణ వైపు వస్తే ఎలా వ్యవహరించాలనే అంశంపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్​లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

cm-kcr-said-special-committee-to-prevent-locust-in-telangana
రాష్ట్రంలోకి మిడతలు రాకుండా ప్రత్యేక కమిటీ: సీఎం కేసీఆర్​

మిడతల దండుతో రాష్ట్రంలో నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజస్థాన్, గుజరాత్​లో జరిగిన నష్టాన్ని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారులను అప్రమత్తం చేశారు. ప్రగతి భవన్​లో మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి, శాస్త్రవేత్తలు, నిపుణులతో సమావేశమైన సీఎం సంబంధిత అంశాలపై చర్చించారు.

అడ్డుకునేందుకు సర్వం సిద్ధం..

ఈ రాకాసి దండు రాష్ట్రంలోకి రాకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశామని... ఫైర్ ఇంజన్లు, జెట్టింగ్ యంత్రాలు, ఫెస్టిసైడ్లను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. మిడతల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవి రాష్ట్రంలోకి ప్రవేశించకుండా చూసే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించినట్లు చెప్పారు.

ప్రయాణం, ప్రభావం అంశాలపై..

రాష్ట్ర సరిహద్దుల్లోకి మిడతలు వచ్చే పరిస్థితి ఉంటే పెద్దఎత్తున పురుగుల మందు పిచికారీ చేసి సంహరించాలని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు. దేశంలో మిడతల దండు ప్రవేశం, ప్రయాణం, ప్రభావం తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. రాబోయే రోజుల్లో అవి ఎటువైపు వెళ్లే అవకాశం ఉందనే విషయమై ఆరా తీశారు. రాజస్థాన్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించిన మిడతల దండు ప్రస్తుతం మహారాష్ట్రలోని భండార, గోండియా మీదుగా మధ్యప్రదేశ్​లోని బాలాఘాట్ వైపు వెళ్తున్నట్లు సమాచారం ఉందని అధికారులు చెప్పారు. అక్కడి నుంచి ఉత్తర భారతం వైపు ప్రయాణించి పంజాబ్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

దండును సంహరించేందుకు...

గాలివాటం ప్రకారం ప్రయాణించే అలవాటున్న మిడతల దండు, ఒకవేళ గాలి దక్షిణం వైపు మళ్లితే చత్తీస్​గఢ్ మీదుగా తెలంగాణ వైపు వచ్చే అవకాశాలు కొన్ని ఉన్నాయని తేల్చారు. తక్కువ అవకాశాలున్నప్పటికీ రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మిడతల దండును సంహరించేందుకు గోండియా ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని, అక్కడ కోట్ల సంఖ్యలో మిడతలను చంపగలిగారని సీఎం అన్నారు. మిడతల దండు తెలంగాణ వైపు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని... మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ సరిహద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. సరిహద్దుల్లోనే వాటిని పెద్ద ఎత్తున పురుగుల మందు పిచికారి చేసి సంహరించాలని ముఖ్యమంత్రి తెలిపారు.

ఐదుగురు సభ్యులతో కమిటీ..

మిడతల దండు ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవి రాకుండా అడ్డుకునే చర్యలను పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. సీఐపీఎం ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.సునీత, వ్యవసాయ విశ్వవిద్యాలయ ముఖ్యశాస్త్రవేత్త డాక్టర్ ఎస్.జె.రెహమాన్, వరంగల్ అటవీ కన్జర్వేటర్ అక్బర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల కలెక్టర్ భారతి సభ్యులుగా కమిటీని నియమించారు. కమిటీ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రామగుండంలోనే మకాం వేయనుంది. హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు గోదావరి వెంట పరిస్థితిని గమనిస్తూ మిడతల దండు సమీపంలోకి వస్తే వాటిని సంహరించే చర్యలను కమటీ సభ్యులు పర్యవేక్షిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. మిడతల దండు కదలికలను గమనిస్తూ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని వారికి స్పష్టం చేశారు.

ఎప్పటికప్పుడు పరిశీలన

మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో 15 వేల లీటర్ల మాలాతియాన్, క్లోరోఫైరిపాస్, లామ్డా సైలోత్రిన్ ద్రావణాలను సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. 12 అగ్నిమాపక యంత్రాలు, 12 జెట్టింగ్ మిషన్లను కూడా సిద్ధంగా పెట్టుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, విపత్తు నిర్వహణ, వ్యవసాయశాఖల కార్యదర్శులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి హైదరాబాద్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఎం ఆదేశించారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా జిల్లాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితికి అనుగుణంగా పనిచేయాలని సీఎం ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : వెలికి తీస్తానన్న నల్లధనం ఎక్కడ: ఎంపీ రేవంత్​

Last Updated :May 28, 2020, 8:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.