ETV Bharat / state

cm kcr: 'ప్రజా రక్షణకు అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి'

author img

By

Published : Jul 23, 2021, 4:53 AM IST

'ప్రజా రక్షణకు అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి'
'ప్రజా రక్షణకు అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలి'

వచ్చే నెల 10 వరకు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజారక్షణకు అన్ని శాఖలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో.. వరద ఉద్ధృతి దృష్ట్యా.. యుద్ధ ప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని.. మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లను రాష్ట్రానికి రప్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇక నుంచి కరవు పరిస్థితులు ఉండబోవన్న కేసీఆర్.. వరద పరిస్థితులను ఎదుర్కొనేలా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని.. వివిధ విభాగాల అధికారులతో వరద నిర్వహణా బృందాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఎగువ రాష్ట్రాలతో పాటు.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులు, వాతావరణశాఖ సంచాలకులు, ఎన్డీఆర్ఎఫ్, సైనికాధికారులతో సమావేశమైన సీఎం.. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇప్పటికే చేపట్టిన, ఇంకా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షపాతం నమోదు తీరు.. ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి, స్వర్ణ, కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో వరద పరిస్థితిని... కృష్ణానదికి సంబంధించి ఎగువన పరిస్థితిని అధికారులు వివరించారు. గోదావరి నదికి వరద పెరుగుతున్న తరుణంలో సీఎస్ సహా ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల మంత్రులు, కలెక్టర్లకు సీఎం పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగూడెం, ఏటూరు నాగారం, మంగపేట ప్రాంతాల్లో.. పర్యవేక్షణకు సీనియర్ అధికారులకు ఆర్మీ హెలీకాప్టర్​లో తక్షణమే పంపాలని తెలిపారు. ఆర్మూర్, నిర్మల్, భైంసా ప్రాంతాలకు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించాలన్న కేసీఆర్... లోతట్టు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. నిరాశ్రయులకు వసతి, బట్టలు, భోజన వసతులు కల్పించాలని సూచించారు. రాష్ట్రానికి మరిన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లను తెప్పించాలని అధికారులకు తెలిపారు.

తక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలి..

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో విపరీతంగా వానలు కురిశాయని... మహాబళేశ్వరంలో 70 సెంటీమీటర్ల అత్యంత భారీ వర్షపాతం నమోదైందని సీఎం చెప్పారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వరద పెరిగితే తక్షణమే రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని... నాగార్జున సాగర్ కేంద్రంగా ఉన్నతాధికారులను పంపించాలని ఆదేశించారు. గతంలో వరద పరిస్థితులను ఎదుర్కొన్న అధికారుల సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ఇవాళ, రేపు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఎదుర్కొనేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి.. నీటి పారుదల, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. ప్రాజెక్టులు, జలాశయాల నుంచి నీటిని నెమ్మదిగా వదలాలని చెప్పారు.

అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి..

మూసీ నది వరద గురించి ఆరా తీసిన కేసీఆర్.. వరద ఉద్ధృతి పెరిగే పరిస్థితి ఉంటే లోతట్టు ప్రాంతాల ప్రజల రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. హైదరాబాద్​లోని లోతట్టు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఇళ్ల నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని... హెచ్​ఎండీఏ, జీహెచ్​ఎంసీ అధికారులకు స్పష్టం చేశారు. డ్రైనేజీ పరిస్థితుల మీద ఆరా తీసిన ముఖ్యమంత్రి... తక్షణమే అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆగస్టు పదో తేదీ వరకు వర్షాలు కొనసాగే పరిస్థితి ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. రహదారులు, వంతెనల పరిస్థితులను ముందుగానే అంచనా వేసి ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు.

ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..

రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని... మంత్రులు, ఎమ్మెల్యేలు సహా గ్రామస్థాయి నుంచి అందరు ప్రజాప్రతినిధులను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... స్వీయ నియంత్రణ పాటిస్తూ వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాగులు, వంకలు, చెరువులు, కుంటల వైపు సంచరించొద్దన్న కేసీఆర్... వరదల్లో చిక్కుకోకుండా ఉండాలని అన్నారు. వరద ఉద్ధృతిలో వాగులు, వంకలు దాటేందుకు సాహసాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పారు. పిల్లా, పాపలను కనిపెట్టుకుంటూ ఉండాలని... ప్రజలకు సూచించారు.

ఇక నుంచి కరవు పరిస్థితులు ఉండవు..

మారిన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇక నుంచి కరవు పరిస్థితులు ఉండవన్న ముఖ్యమంత్రి.. వరద పరిస్థితులు ఎదుర్కొనే పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. నీటిపారుదల, పంచాయతీరాజ్, పురపాలక, ఆర్ అండ్ బీ.. రెవెన్యూ, వైద్య-ఆరోగ్య, సాధారణ పరిపాలనశాఖల నుంచి అనుభవం కలిగిన అధికారులతో వరదనిర్వహణ బృందాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. వరదలు ఉత్పన్నమైన సందర్భాల్లో.. యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించబడిన అధికారులను అందులో నియమించాలని... సీఎస్కు చెప్పారు. వివిధ శాఖలను అప్రమత్తం చేసి, సమన్వయం చేయడంతో పాటు... పునరావాస శిబిరాలు నిర్వహించే అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి ఏడాది వరదల రికార్డును పాటించాలన్న ముఖ్యమంత్రి.... పాత రికార్డు అనుసరించి ఆయా వరద సమయాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

ఇదీ చూడండి: KCR REVIEW: 'ఉద్ధృతంగా ఉన్న వాగులు దాటే సాహసం చేయొద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.