ETV Bharat / state

'ఎంత ఖర్చయినా భరిస్తాం... తడిసిన ధాన్యంతో సహా చివరి గింజ వరకు కొంటాం'

author img

By

Published : May 18, 2022, 3:29 PM IST

Updated : May 18, 2022, 8:54 PM IST

Cm Kcr Review
Cm Kcr Review

Cm Kcr Review On Paddy: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అన్నదాతలు అధైర్య పడొద్దని... ఎంత ఖర్చైనా చివరిగింజ వరకు సేకరిస్తామని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ, దళితబంధు సహా వివిధ అంశాలపై సమీక్షించిన సీఎం... ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దళితబంధు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.

Cm KCR Review On Paddy: ప్రగతిభవన్‌ వేదికగా ధాన్యం సేకరణ, క్రీడాభివృద్ధి, దళితబంధు అమలుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ జరగుతున్న తీరుపై ఆరా తీశారు. ధాన్యం తూకం, గన్నీ బ్యాగులు, రవాణా, మిల్లుల్లో దిగుమతి తదితరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 56 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని... ఇప్పటి వరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించినట్లు అధికారులు సీఎంకు వివరించారు.

వర్షాకాలం సమీపిస్తుండటంతో ధాన్య సేకరణ వేగవంతం చేయాలని ఆదేశించిన ముఖ్యమంత్రి... అకాల వర్షాలకు తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని... ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. వానలకు పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం కొన్నా- కొనకున్నా ఖర్చుకు వెనకాడకుండా బాయిల్డ్‌ రైస్‌ను... రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.

Cm Kcr Review
సమీక్షలో పాల్గొన్న అధికారులు

రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. భవిష్యత్ తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 వేల గ్రామాలు, 5 వేల వార్డుల్లో... మొత్తం 24 వేల గ్రామీణ క్రీడా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమిటీలు పనిచేస్తాయని తెలిపారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా... ఎంపిక చేసిన కొన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

దళితబంధు అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన సీఎం సీఎం... ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో 1,500 మందికి దళితబంధు అందించాలన్నారు. లబ్దిదారులను ఎంపిక చేసే ప్రక్రియను కొనసాగించాలని... వేగంగా గుర్తించాలని సీఎం పేర్కొన్నారు. ఎంపిక పూర్తయిన తర్వాత దశలవారీగా పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి:

Last Updated :May 18, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.