ETV Bharat / state

CM KCR: మహిళా ఆర్థిక, రాజకీయ సాధికారతే లక్ష్యం

author img

By

Published : Mar 8, 2022, 4:29 AM IST

CM KCR: మహిళకు సామాజిక ఆర్థిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారతను కట్టుబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని, త్యాగపూరితమైందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళాభ్యుదయానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు.

CM KCR: మహిళా ఆర్థిక, రాజకీయ సాధికారతే లక్ష్యం
CM KCR: మహిళా ఆర్థిక, రాజకీయ సాధికారతే లక్ష్యం

CM KCR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోషిస్తున్నారని సీఎం అన్నారు. కుటుంబ అభివృద్ధిలో గృహిణిగా స్త్రీ పాత్ర ఎంతో గొప్పదని త్యాగపూరితమైందని సీఎం అన్నారు. అన్నీతానై కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ అందరి ఆలనా పాలనా చూసే ఒక తల్లి కనబరిచే ప్రాపంచిక దృక్పథాన్ని, దార్శనికతను, మానవీయ కోణాన్ని.. తమ పాలన లో అన్వయించుకుని తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం స్పష్టం చేశారు.

మానవ జాతికి మహిళ ఒక వరం అని తెలిపిన సీఎం.. మహిళాభ్యుదయానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్దితో శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. దళిత, బడుగు బలహీన వెనకబడిన వర్గాలు, రైతుల ఆత్మబంధువుగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సీఎం అన్నారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పలు పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మహిళాబంధుగా ఆదరణ పొందుతుండడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పాటైన నాటినుంచి నేటివరకు 10 లక్షల మంది ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా తనవంతుగా ఆర్థికంగా ఆదుకుంటూ.. 10 లక్షల మంది తల్లులకు కేసీఆర్ కిట్స్ అందించి ప్రభుత్వం ఆర్థికంగా ఆలంబననిస్తోందన్నారు. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి వంటి పథకాలతో పాటు, వితంతువులు, వృద్ధ మహిళలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలా నెలా సకాలంలో పింఛన్లు అందజేస్తూ, షీ టీమ్స్ ద్వారా రక్షణ కల్పిస్తూ.. అంగన్​వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు జీతాల పెంచడంతో పాటు ఇంకా అనేక పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

నేడు ఉద్యోగినులకు ప్రత్యేక సాధారణ సెలవు

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మహిళాభ్యుదయ కార్యాచరణ, మహిళకు ఆర్థిక సామాజిక సమానత్వంతో పాటు రాష్ట్రం లో స్త్రీ, పురుష నిష్పత్తిలో సమానత్వం దిశగా మెరుగైన ఫలితాలు సాధించిందన్నారు. దేశంలోనే ప్రప్రథమంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్స్ అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టిందన్నారు. మహిళకు సామాజిక ఆర్థిక సాధికారతతో పాటు రాజకీయ సాధికారతను కట్టబెట్టడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు ప్రకటించిందన్నారు. తద్వారా మహిళను తెలంగాణ ప్రభుత్వం సమున్నతంగా గౌరవించుకుంటున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.