ETV Bharat / state

Govt Loans: రుణాలకు అనుమతివ్వని కేంద్రం.. సందేహాల నివృత్తిలో రాష్ట్ర సర్కార్

author img

By

Published : May 8, 2022, 5:05 AM IST

Govt Loans: అప్పులపై కేంద్రం సందేహాలను నివృత్తి చేయడంతోపాటు... రాష్ట్ర వాదనను బలంగా వినిపించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రెండ్రోజులుగా కసరత్తు జరుగుతోంది. రేపు కేంద్ర ఆర్థికశాఖ నిర్వహించనున్న దృశ్యమాధ్యమ సమీక్షలో అన్ని అంశాలను అధికారులు వివరించనున్నారు.

Telangana
Telangana


Govt Loans: ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో రుణాలకు కేంద్రం ఇంకా అనుమతివ్వకపోవడం... రాష్ట్ర సర్కార్‌కు ఇబ్బందిగా మారింది. పన్నులు, ఇతర రూపాల్లో వస్తున్న సొంత ఆదాయంతోపాటు... కేంద్రం నుంచి వస్తున్న నిధులనే అన్నింటికీ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు కూడా ఆలస్యమవుతున్నాయి. పెన్షన్ల చెల్లింపులకు కాస్త సమయం పడుతుండగా... వడ్డీ చెల్లింపులు మాత్రం నిర్దేశిత గడువుకు అనుగుణంగా చేస్తున్నారు. బిల్లుల చెల్లింపులను దాదాపుగా పక్కన పెట్టేశారనే చెప్పుకోవచ్చు.

బడ్జెట్‌లో ప్రతిపాదించిన రుణాలకు కేంద్రం నుంచి అనుమతులు రానందున... పన్నులు, ఇతర రూపాల్లో వస్తున్న ఆదాయాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటున్నారు. అప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం, వివరాలతోపాటు... కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమాధానమిచ్చింది. వాటికి సంబంధించి మరికొన్ని వివరణలు, సమాచారాన్ని కేంద్రసర్కార్‌ కోరినట్లు తెలిసింది. అందుకనుగుణంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులుగా కసరత్తు చేస్తోంది. సీఎస్ సోమేశ్ కుమార్ సహా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరులు, అవసరాలు, రుణాలు చెల్లింపు ప్రణాళిక తదితర అంశాలను కేంద్రానికి వివరించాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎఫ్​ఆర్​బీఎంకు లోబడే రుణాలు తీసుకుంటున్నామని, చెల్లింపులకు సంబంధించి ఎక్కడా ఇబ్బందులు లేవని వివరించాలని చెప్పినట్లు సమాచారం. ప్రతిపాదిత మొత్తాన్ని భారీగా తగ్గించి ఏపీ సహా కొన్ని రాష్ట్రాల రుణాలకు... కేంద్రం రెండ్రోజుల క్రితం అనుమతిచ్చింది.

ఆ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితులు భిన్నంగా ఉన్న దృష్ట్యా... తగ్గింపు అవసరం లేదని అంటున్నారు. అన్ని అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రుణాలకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఆర్థికశాఖ రేపు దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. సమీక్ష సందర్భంగా అధికారులు రాష్ట్ర ప్రభుత్వ వాదనను వినిపించనున్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర సంపదనంతా ఒక కుటుంబం దోచుకుంటోంది: రాహుల్‌గాంధీ

డ్రైవర్​ను వరించిన అదృష్టం.. రాత్రికి రాత్రే రూ.2కోట్ల జాక్​పాట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.