ETV Bharat / state

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కాంగ్రెస్‌ పోరాడితే మేం మద్దతు ఇస్తాం: కవిత

author img

By

Published : Mar 15, 2023, 10:43 PM IST

MLC Kavitha on Women Reservation Bill : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం మరింత పోరాడతామని బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టాలన్న ఆమె... మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కాంగ్రెస్‌ పోరాడితే మద్దతు ఇస్తామని తెలిపారు. మరోవైపు రేపు ఉదయం ఈడీ విచారణకు హాజరుకానున్నారు. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

kAVITHA
kAVITHA

MLC Kavitha on Women Reservation Bill : చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై దిల్లీలోని లే మెరిడియన్ హోటల్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించగా... సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, వామపక్షాలు, శివసేన, ఆప్‌ సహా 13 విపక్ష పార్టీల ఎంపీలు, ప్రజా సంఘాల నాయకులు హాజరై... తమ అభిప్రాయాలు తెలియజేశారు.

ఇటీవల జంతర్ మంతర్ వద్ద దీక్షకు కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత... పార్లమెంటులో ప్రైవేటు మెంబర్‌ బిల్లులు పెట్టి... కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టాలన్న ఆమె... మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కాంగ్రెస్‌ పోరాడితే మద్దతు ఇస్తామని తెలిపారు. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే తమ లక్ష్యమని కవిత మరోసారి స్పష్టం చేశారు.

'చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పార్లమెంటులో కాంగ్రెస్‌ పార్టీ ప్రైవేటు మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టాలి. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కాంగ్రెస్‌ పోరాడితే మేం మద్దతు ఇస్తాం. కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే మా లక్ష్యం.'-కవిత, బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ

దిల్లీ ప్రభుత్వం రూపొందించిన మద్యం విధానాన్ని అనుకూలంగా చేసుకొని అనుచిత లబ్ధి పొందారనే ఆరోపణలపై ఈడీ.. పలువురు నిందితులు, సాక్షులను ఇప్పటికే అరెస్టు చేసి ప్రశ్నించింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపిన ఈడీ అధికారులు మార్చి 12న దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన విషయం తెలిసిందే. అనంతరం మరోసారి ఈ నెల 16న హాజరుకావాలని ఆదేశించారు. దాంతో గురువారం ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. దీనిపై రాజకీయవర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ మరోసారి దిల్లీ బయలుదేరి వెళ్లారు. గురువారం కవిత ఈడీ విచారణ నేపథ్యంలోనే ఆయన దిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కేటీఆర్​తో పాటు మంత్రులు హరీశ్​ రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాఠోడ్ హస్తినకు వెళ్లారు. రేపు ఉదయం మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా దిల్లీ వెళ్లనున్నారు. కవిత ఈడీ విచారణ, మంత్రుల దిల్లీ పర్యటనతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు దిల్లీ మద్యం కేసులో ఈడీ తనకు నోటీసులు జారీ చేయడంపై.. బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒక మహిళను... ఈడీ కార్యాలయంలో విచారణకు పిలవడాన్ని కవిత తన పిటిషన్ లో సవాలు చేశారు. సీఆర్​పీసీ సెక్షన్ 160 ప్రకారం... ఒక మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా... ఈడీ కార్యాలయానికి పిలవడంపై... సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు.

తమకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పిన ఈడీ.. అలా చేయలేదని కోర్టుకు వివరించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే... మొబైల్ ఫోన్లు సీజ్ చేశారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు... తక్షణమే విచారణ జరిపేందుకు నిరాకరించింది. ఈనెల 24న విచారణ చేపడతామన్న కోర్టు..ఈనెల 16న విచారణకు హాజరు కావడంపై... ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.