ETV Bharat / state

BRS Ministers : '125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. దేశానికే గర్వకారణం'

author img

By

Published : Apr 14, 2023, 2:06 PM IST

Ambedkar Jayanti 2023 : రాష్ట్రమంతా అంబేడ్కర్ జయంత్యోత్సవాల్లో మునిగిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అంబేడ్కర్ ​ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. రాజ్యాంగా నిర్మాత గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు.

Ambedkar
Ambedkar

Ambedkar125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. దేశానికే గర్వకారణం

Ambedkar Jayanti 2023 : రాష్ట్రంలో అంబేడ్కర్‌ జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్‌ సేవలను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ చూపిన బాటలో నేటి తరం నడవాలని సూచించారు. ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. మహనీయుడి జన్మదినం రోజున రాజకీయాలు తగదని హితవు పలికారు.

Gutta Sukhender on Ambedkar : అంబేడ్కర్‌ స్ఫూర్తితో రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన సాగిస్తున్నందునే తెలంగాణ నేడు అగ్రస్థానంలో నిలుస్తుందని శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నాటి నుంచి నేటి వరకు మతాలకు అతీతంగా అందరూ పవిత్రంగా భావించేది అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అని తెలిపారు. రాజ్యాంగంలో అంబేడ్కర్‌ చేర్చిన నిబంధన వల్లే మనం తెలంగాణ సాధించుకోగలిగామని గుర్తు చేశారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో 125 అడుగుల విగ్రహం నిర్మించుకున్నామని.. ఇది దేశానికి గర్వకారణమని వివరించారు.

'దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు సహా అనేక పథకాలు అమలు చేస్తూ.. దళితుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దళితుల అభ్యున్నతిని ఓర్వలేక కుట్రలు, కుతంత్రాలతో కొందరు నీచమైన రాజకీయాలు చేస్తున్నారు. పార్లమెంట్​కు అంబేడ్కర్ పేరు పెట్టమంటే కేంద్రం నుంచి స్పందన లేదు. రిజర్వేషన్లు కూడా ఎత్తివేయాలన్న ఆలోచన చేస్తున్నారు.' - మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి

ఆయన బాటాలోనే సీఎం కేసీఆర్: భారతరత్న డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ ఆశయాల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ 132వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్​బండ్‌పై ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాల‌ను అమలు చేస్తున్నారని తెలిపారు.

ఆయన వల్లనే రాష్ట్రం ఏర్పడింది: స్వతంత్రం సిద్ధించి ఇన్నేళ్లు గడిచినా దళితుల పట్ల వివక్ష, ఆర్దిక అసమానతలు దేశంలో ఇంకా కొనసాగుతున్నాయని వాటిని రూపు మాపేందుకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ జయంతి సందర్బంగా మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.