ETV Bharat / state

DK Aruna: 'వాస్తవాలు చెబితే కాంగ్రెస్​ నేతలకు అంత రోషమెందుకు..?'

author img

By

Published : Apr 22, 2023, 4:33 PM IST

Updated : Apr 22, 2023, 5:33 PM IST

DK Aruna on Revanth Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డిపై చేసిన ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్​ టాపిక్​గా మారాయి. ఈ విషయంపై తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ స్పందించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. రెండు పార్టీలూ ఒకటేనన్న ఆమె.. కాంగ్రెస్‌ పార్టీ నాయకుడిపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎందుకు స్పందించారని ప్రశ్నించారు.

BJP National Vice President DK Aruna
బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై ఆరోపణలు చేసిన డీకే అరుణ

DK Aruna on Revanth Reddy: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు నగదు తీసుకున్నారని ప్రజలు అనుకుంటున్నారని.. ఈటల చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు ఒకటే అని ఎన్నోసార్లు రుజువైందని, అది ప్రజలకు బహిరంగంగా ఈటల రాజేందర్ చెబితే అంత రోషం ఎందుకన్నారు.

గల్లీలోనే కాదు.. దిల్లీలోనూ కాంగ్రెస్ లేదు: తెలంగాణ ఉద్యమకారుడు, బడుగు బలహీనవర్గాల నాయకుడిని విమర్శిస్తే బీజేపీ చూస్తూ ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒప్పందం చేసుకున్నాయన్న విషయం గతంలో రుజువైందని తెలిపారు. అందుకు హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప ఎన్నికలే దానికి నిదర్శనమని చెప్పారు. గల్లీలోనే కాదు.. దిల్లీలోనూ లేని పార్టీ కాంగ్రెస్ అని ఘాటుగా స్పందించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎందుకు స్పందించారు: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈటల రాజేందర్‌పై చేస్తున్న ఆరోపణలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన స్క్రిప్టేనని అరుణ ఆరోపించారు. ఈటల రాజేందర్‌, కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. ఇది సరిపోతుంది కదా ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పడానికని అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తున్న రేవంత్ రెడ్డి.. తనకు ఓటుకు నోటు కేసులో ఎటువంటి సంబంధం లేదని.. ఆ కేసుకు సంబంధించిన వీడియోలో ఉన్నది తాను కాదని ప్రమాణం చేయగలరా అంటూ సవాల్ విసిరారు.

"బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒకటే. బీఆర్‌ఎస్‌ నుంచి రేవంత్‌ రెడ్డి డబ్బులు తీసుకున్నారు. ఈ విషయం ప్రజలు అనుకుంటున్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికలు పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈటల రాజేందర్‌ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ ఎందుకు స్పందిస్తున్నారు? ఇలాంటివి గమనిస్తే రెండు పార్టీలు ఒకటేనని అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నారు. ఈ విషయంలో అమ్మవారిపై ప్రమాణం చేయగలరా?" - డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు

అసలు వివాదం ఏంటంటే..? బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ నుంచి రూ.25 కోట్లు తీసుకున్నారని ఆరోపణలు చేశారు. దీనికి రేవంత్‌ రెడ్డి స్పందించి ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఉప ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు అంతా కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిందేనని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 22, 2023, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.