ఎమ్మెల్యేలకు ఎర కేసు.. బీఎల్​ సంతోష్​ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Dec 29, 2022, 6:24 PM IST

Updated : Dec 30, 2022, 7:00 AM IST

BL Santosh
BL Santosh ()

18:21 December 29

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై స్పందించిన బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌

BL Santosh Responded To MLAs Poaching Case: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, కష్టపడి పనిచేస్తే అధికారంలోకి వస్తామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్‌ సంతోష్‌ పార్టీ నేతలతో అన్నారు. రాష్ట్రంలో 90 అసెంబ్లీ సీట్లు గెలవాలన్న లక్ష్యంతో ‘మిషన్‌ 90’ పేరుతో శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌లో గురువారం జరిగిన భాజపా అసెంబ్లీ విస్తారక్‌లు, ప్రభారీలు, పాలక్‌లు, కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడే జరిగిన లోక్‌సభ నియోజకవర్గ విస్తారక్‌ల రెండోరోజు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

మిషన్‌ 90 సమావేశంలో ఎమ్మెల్యేలకు ఎర కేసుపై, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. ఆరు గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో సంతోష్‌ ముగింపు ప్రసంగం చేశారు. ‘సాధారణ ప్రజలకు అంతగా తెలియని నా పేరును ఇక్కడి ప్రభుత్వం ప్రతి ఓటరుకూ తెలిసేలా చేసింది. నాపై చేసిన ఆరోపణలకు సరైన సమయంలో సమాధానం చెబుతా’ అని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గతంలో తాను హైదరాబాద్‌కు వచ్చినప్పుడు స్వాగతం పలకడానికి ఒకరిద్దరు పార్టీ కార్యకర్తలు మాత్రమే వచ్చేవారని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన పని కారణంగా ఈరోజు వందలాది మంది వచ్చారని అన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ‘‘రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణ తల్లికి ద్రోహం చేస్తోంది. ఇక్కడి డబ్బును ఇతర రాష్ట్రాల్లోని పార్టీలకు తీసుకెళ్తున్నారు. ఏ రాష్ట్రంలో, ఏ పార్టీకి ఎంతెంత ఇచ్చింది మాకు తెలుసు. ఇక్కణ్నుంచి ఇతర పార్టీలకు డబ్బులు పంపిన వారి విషయాన్ని అవసరం వచ్చినప్పుడు బహిర్గతం చేస్తాం.

...

కాంగ్రెస్‌ పార్టీలో నిరంతరం అంతర్గత కలహాలు... తెలంగాణకు అన్యాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ప్రత్యామ్నాయంగా మన వైపు చూస్తున్నారు. వారిలో మన పట్ల మరింత విశ్వాసం కలిగేలా గట్టి కృషి అవసరం. తెలంగాణలో భాజపా విజయం సాధించాలన్నది అధికారంలోకి రావాలన్న లక్ష్యం కోసం కాదు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి. ఇక్కడ మన బలం పెరిగింది..పెరిగింది అంటున్నారు. 25-30 సీట్లు వచ్చి ఆగితే ఎవరికి లాభం? ప్రజలకు మేలు జరగాలంటే భాజపాకు వచ్చే సీట్లు కచ్చితంగా 60 దాటాల్సిందే’’ అంటూ పార్టీ నేతలకు బీఎల్‌ సంతోష్‌ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ‘కాంగ్రెస్‌ పార్టీలో నిరంతరం అంతర్గత కలహాలు ఉంటాయి. ఇక్కడున్న పలువురు నేతలు కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి వచ్చారంటే ఆ పార్టీకి భవిష్యత్తు లేదనే కదా’ అని అన్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 శాసనసభ నియోజకవర్గాలకు పాలక్‌లను ఈ సమావేశంలో నియమించారు.

అధికారంలోకి వస్తాం: నేతలు.. మిషన్‌ 90 సమావేశంలో నేతలు బండి సంజయ్‌, తరుణ్‌ఛుగ్‌, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, మర్రి శశిధర్‌రెడ్డి, చాడ సురేష్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్‌, గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, విజయశాంతి సహా పలువురు మాట్లాడుతూ తెలంగాణలో భాజపా జెండా ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి అరవింద్‌ మీనన్‌తో పాటు ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, విజయ రామారావు, చంద్రశేఖర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గంగిడి మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కోర్‌కమిటీ నేతలతో సంతోష్‌ గురువారం రాత్రి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై చేయాల్సిన పోరాటాలపై చర్చించినట్లు సమాచారం.

భాజపాయే ప్రత్యామ్నాయం: సంజయ్‌ సమావేశం అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, భాజపాయే ప్రత్యామ్నాయం అని అన్నారు. భారాస టికెట్‌పై పోటీకి ఆ పార్టీ ఎమ్మెల్యేలే సిద్ధంగా లేరన్నారు. ఫిబ్రవరిలో పోలింగ్‌బూత్‌ కమిటీల సమ్మేళనం నిర్వహిస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానిస్తామని చెప్పారు. నాలుగు అంచెల వ్యూహంతో భాజపా ముందుకెళుతుందన్నారు.

ఇవీ చదవండి: రాష్ట్రాన్ని ఆర్థికంగా కేంద్రం ఇబ్బంది పెడుతోంది: హరీశ్‌రావు

జవాన్ల కోసం 3డీ ప్రింటెడ్ ఇళ్లు.. భూకంపం వచ్చినా సేఫ్.. 'ఆత్మనిర్భర్​ భారత్'​లో భాగంగా..

Last Updated :Dec 30, 2022, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.