'బీఆర్​ఎస్​ను సాగనంపడమే మన ధ్యేయం.. కష్టపడితే మనదే అధికారం'

author img

By

Published : Jan 25, 2023, 8:53 AM IST

Updated : Jan 25, 2023, 9:14 AM IST

bjp

BJP Strategies For Power In Telangana: తెలంగాణలో కేసీఆర్‌ పని అయిపోయిందని, బీఆర్​ఎస్​ సహా కేసీఆర్‌ పదవీ విరమణ పొందే సమయం ఆసన్నమైందని.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మహబూబ్ నగర్​లో జరిగిన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో.. తరుణ్‌ చుగ్‌ ముగింపు ఉపన్యాసం చేశారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో.. కేంద్రం చేసే పనులను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా.. అన్నివర్గాలకు వివరించనునట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. జీ 20 సమావేశాల ప్రాధాన్యతను.. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ వివరించారు.

బీఆర్​ఎస్​ను సాగనంపడమే మన ధ్యేయం

BJP Executive Meeting Concluded In Mahbubnagar: తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని, టీఆర్​ఎస్​ నుంచి బీఆర్​ఎస్​గా మారిన టీఆర్​ఎస్​ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం దగ్గర పడిందని.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా.. ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్​పై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత, అసహ్యం, ద్వేషం ఉన్నాయనన్నారు. రాష్ట్రంలో రైతులు, మహిళలు, యువకులు, దళితులు, ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో రోడ్డెక్కుతున్నారన్నారు. 60 మందికి పైగా సర్పంచ్‌లు ఆత్మహత్య చేసుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాంత్రిక పాలన సాగుతోందని.. పార్టీ పేరు మార్చాలని ఎవరో సూచిస్తే కేసీఆర్ టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా చేశారన్నారు.

కాంగ్రెస్​లో యువరాజు.. బీఆర్​ఎస్​లో.. కాంగ్రెస్‌లో యువరాజు ఉంటే.. కేసీఆర్ కుటుంబంలో యువరాజుతోపాటు యువరాణి ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కుమారుడు, కుమార్తె, బంధువులు ఎక్కడ ఉన్నారని తరుణ్‌ చుగ్‌ ప్రశ్నించారు. దోచుకోవడమే వారి పనని.. మద్యం కుంభకోణంలో ఇరుక్కున్న వాళ్లు.. హోటల్‌కు ఎందుకు వెళ్లారో, మొబైళ్లు ఎందుకు ధ్వంసం చేశారో చెప్పాలని నిలదీశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్‌పై ఉందని, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ నిత్యం ఎవరో ఒకరు పార్టీని వీడుతూనే ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు ప్రతి బీజేపీ కార్యకర్త కృషి చేయాలని తరుణ్‌ చుగ్‌ పిలుపు నిచ్చారు.

కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో ఆరోజు చెప్పుతాము: జీ20 సమావేశాలపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడారు. జీ20 దేశాలకు మోదీ నాయకత్వం వహించడం గొప్ప విషయమన్నారు. జీ20 సమావేశాల్లో మహిళలు సహా అన్నివర్గాలను భాగస్వామ్యం చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే అంశంపై పూర్తి గణాంకాలతో నివేదిక సిద్ధం చేస్తున్నామని.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. విమర్శకులు, వామపక్ష భావజాల మేధావులు అందరినీ ఆహ్వానించి కేంద్రం ఏం చేసిందో చెప్తామని, అందుకు రాష్ట్రం సహకరించకుండా.. ఎలా అడ్డుకుంటుందో కూడా వివరిస్తామని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే ఉపకార వేతనాలు జమ చేసేందుకు వివరాలు అడిగితే ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. సైన్స్ సిటీకి భూమి ఇవ్వడం లేదని, ఎమ్​ఎమ్​టీఎస్​ రెండో దశ విస్తరణకు నిధులు ఇవ్వడం లేదని.. కిషన్‌ రెడ్డి ఆరోపించారు. రాజకీయ ఎత్తుగడల్లో పార్టీ నేతలు దూకుడు పెంచాలని.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సూచించినట్లు సమాచారం.

బీఆర్​ఎస్​ నాయకులు తమ ఆస్తులను ప్రకటించాలి: అంతకుముందు రెండో రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో.. జాతీయ కార్యవర్గ సమావేశాల వివరాలను నేతలు సభ్యులకు వివరించారు. తెలంగాణ సహా 9రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ఏం చేయాలనే అంశంపై.. మోదీ, నడ్డా ఇచ్చిన దిశానిర్దేశం, కార్యాచరణపై చర్చించారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు రాష్ట్రంలోని 9వేల శక్తి కేంద్రాల్లో నిర్వహించే కూడలి సమావేశాల్ని నిర్వహించడంపై చర్చించారు. 27న జరిగే పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవవర్గంలో 5 పాఠశాల్లో విజయవంతం చేయాలని నిర్ణయించారు. సరళ్ యాప్ ఉద్దేశం, పార్టీ బలోపేతానికి యాప్ ఏవిధంగా ఉపయోగపడుతుంది.. ప్రతి ఒక్క కార్యకర్త సరళ్ యాప్‌ను ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశంపై సమావేశం చర్చించింది.

తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలు.. దేశానికి మోదీ, తెలంగాణకు కేంద్రం చేస్తున్న మేలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. వివిధ అంశాలపై తీర్మానాలు చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రం దివాళా తీసిన పరిస్థితులు, అవినీతి, కుటుంబ పాలన, అసమర్థ నిర్ణయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టంపై.. రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా అంతా మద్దతు పలికారు. సీఎం, ఆయన కుటుంబ సభ్యులు సహా.. బీఆర్​ఎస్​ నాయకులంతా వారి ఆస్తులను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రైతుల గురించి చర్చ: వ్యవసాయ రంగంలో తెలంగాణ రైతుల గోసపై రూపొందించిన ముసాయిదా తీర్మానాన్ని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి ప్రవేశపెట్టగా.. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మద్దతిస్తూ ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉందని, అందుకే అబ్ కీ బార్ కేసీఆర్ ముక్త్ సర్కార్ నినాదంతో.. ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి కమీషన్ల కోసం కక్కుర్తిపడి రీడిజైన్ చేసి అంచనాలు పెంచారని ఆరోపించారు. జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడారు. ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోయిన రైతుల్ని పరిహారమిచ్చి రాష్ట్రప్రభుత్వం ఆదుకోలేదని, నరేగా నిధులతో నిర్మించిన పంచాయతీ భవనాలు, రైతు వేదికలు ఉపయోగంలోకి తీసుకురాలేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన నష్టంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. కామారెడ్డి, వరంగల్ మాస్టర్ ప్లాన్ సహా అసైన్డ్ భూములను ప్రభుత్వం గుంజుకోకుండా తీర్మానం చేయాలని సూచించారు. తెలంగాణకు ప్రత్యేక నిధులిస్తూ అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రధానమంత్రి మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ.. రాష్ట్ర కార్యవర్గం ప్రకటన చేసింది. పార్లమెంటరీ ప్రవాసీ యోజన పురోగతి వివరాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వివరించారు. దురదృష్టవశాత్తు మరణించిన బీజేపీ నాయకులకు సమావేశం సంతాపం ప్రకటించింది.

"అవినీతి సొమ్ముతో తెలంగాణలోని ప్రజలను కొనాలని చూస్తున్నారు. కానీ కేసీఆర్‌ను సాగనంపాలని.. తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. రాబోయే 9 నెలలు ప్రతి భాజపా కార్యకర్త విశ్రమించేది లేదు. ప్రతి నిమిషం, క్షణాన్ని ఉపయోగించి.. అవినీతి, కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పిస్తాం." - తరుణ్‌ చుగ్‌, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌

ఇవీ చదవండి:

Last Updated :Jan 25, 2023, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.