జాతీయ రాజకీయాల్లో కేసీఆర్​ కీలకపాత్ర పోషించాలి: ఆర్జేడీ అగ్ర నేతలు

author img

By

Published : Jan 11, 2022, 5:08 PM IST

Updated : Jan 11, 2022, 7:56 PM IST

RJD Leaders meet kcr

RJD Leaders meet kcr: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​తో.. బిహార్​ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్​ భేటీ అయ్యారు. భాజపాపై వ్యతిరేక పోరాటం, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్​ను తేజస్వీ యాదవ్​ కోరారు. ఇందుకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్ధతు ఉంటుందన్నారు.

భాజపా అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని తెరాస, ఆర్జేడీ అగ్రనేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్నివర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న భాజపాను గద్దె దింపే వరకు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా త్వరలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. భాజపాపై వ్యతిరేక పోరాటం, జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ను లాలూ ప్రసాద్​, తేజస్వీ యాదవ్​లు కోరారు. ఇందుకు ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్ధతు ఉంటుందన్నారు.

RJD Leaders meet kcr
RJD Leaders meet kcr

ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన నలుగురు సభ్యుల బృందం... ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. సుమారు 2 గంటలకు పైగా వీరి మధ్య సమావేశం జరిగింది.

RJD Leaders meet kcr
సీఎం కేసీఆర్​తో భేటీ అయిన తేజస్వీ యాదవ్​

ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేసే దిశగా...

భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సమావేశమైన సీఎం కేసీఆర్... భాజపా ముక్త్ భారత్ గురించి చర్చించారు. ఇందుకు కొనసాగింపుగా లౌకికవాద ప్రజాస్వామిక శక్తులను ఐక్యం చేసే దిశగా దేశంలో రాజకీయ పోరాటాన్ని ఉద్ధృతం చేయాలన్న అభిప్రాయంపై తేజస్వీ యాదవ్​తో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. భాజపా విచ్చిన్నకర, అప్రజాస్వామిక విధానాలను తిప్పికొట్టేందుకు ప్రజాస్వామిక, లౌకిక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం కేసీఆర్, తేజస్వీ భేటీ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు సహా అన్ని వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న భాజపాను గద్దె దించేంత వరకు పోరాల్సిన అవసరం ఉందని... అందుకు సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో నిర్ణయించుకోవాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

RJD Leaders meet kcr
సీఎం కేసీఆర్​తో తేజస్వీ యాదవ్​

లాలూ ప్రసాద్​కు కేసీఆర్​ ఫోన్​..

బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్​తో ఫోన్లో మాట్లాడిన సీఎం కేసీఆర్... ఆయన ఆరోగ్య, క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. తమ పార్టీ -ఆర్జేడీ.... తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిందన్న విషయాన్ని లాలూ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ముందుకు రావాలని... కేసీఆర్​ను లాలూప్రసాద్​ యాదవ్​ ఆహ్వానించిట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి, సాధించి, దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నారని.. అన్ని వర్గాలకు అనుకూలంగా ఉన్న పాలనానుభవం దేశానికి అవసరం ఉందని లాలూ అన్నట్లు తెలిసింది. దేశంలో లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని కాపాడుకోవాలని, భాజపా అరాచక పాలన నుంచి దేశాన్ని రక్షించేందుకు లౌకికవాద శక్తులన్నీ ఏకం కావాలని లాలూ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దేశాన్ని నాశనం కానివ్వద్దని.. అందుకు కేసీఆర్ ముందుకు రావాలని కోరినట్లు తెలిసింది.

తెరాసకు ఆర్జేడీ మద్దతు..

తెలంగాణలో జరుగుతున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ, సాగునీటి రంగం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తేజస్వీ యాదవ్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. దేశ సమగ్రతను కాపాడే దిశగా జాతీయ రాజకీయాలను బలోపేతం చేయాలని, అందు కోసం సాగే భాజపా వ్యతిరేక పోరాటంలో కలిసి సాగుదామని ఆర్జేడీ నేతలు చెప్పినట్లు తెలిసింది. అందుకు సీఎం కేసీఆర్ ప్రధానపాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అన్నట్లు సమాచారం. లౌకికవాద, ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు... తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని తేజస్వీ యాదవ్ బృందం స్పష్టం చేసినట్లు తెలిసింది.

యూపీ రాజకీయాలపై..

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై ఇరు పార్టీల నేతలు చర్చించినట్లు సమాచారం. ఏకంగా కేబినెట్ మంత్రి... పదవి, పార్టీ నుంచి తప్పుకోవడంతో పాటు ఎమ్మెల్యేలు భాజపాను వీడడం ఆ పార్టీ పతనానికి నాందిగా ఇరువురు నేతలు విశ్లేషించినట్లు తెలిసింది. రానున్న యూపీ ఎన్నికల్లో అఖిలేశ్​యాదవ్​కు.. ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మద్దతు ప్రకటించడం గొప్ప పరిణామమని వారు అన్నట్లు సమాచారం.

ఇదీచూడండి: Kerala cm meet KCR: దేశానికి భాజపా ప్రమాదకరం.. భావసారూప్యత కలిగిన పార్టీలతో త్వరలో సమావేశం

Last Updated :Jan 11, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.