ETV Bharat / state

బీటెక్​లో హైటెక్ దందా... పైసలిస్తే!

author img

By

Published : Mar 10, 2020, 2:06 PM IST

హైదరాబాద్​ అమీర్​పేట, చైతన్యపురి ప్రాంతాల్లో విచ్చలవిడిగా బీటెక్‌ ప్రాజెక్టుల అమ్మకాలు కొసాగుతున్నాయి. విక్రయదారులు బెంగళూరు, చెన్నై నుంచి ప్రాజెక్టులను తెచ్చి రూ.5 వేల నుంచి రూ.10 వేల చొప్పున అమ్మకానికి పెడుతున్నారు. కష్టపడకుండా సులువైన మార్గాల ద్వారా మార్కులు సాధించాలని చూస్తున్న విద్యార్థులకు ఈ ప్రాజెక్టులు తక్కువ ధరకే లభ్యమవుతుండడం వల్ల వీటిపై మక్కువ చూపుతుండడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

B Tech Student Projects Sales in Hyderabad
బీటెక్​ ప్రాజెక్టుల దందా.. నైపుణ్యం అంగట్లో అమ్మకం

బీటెక్‌లో అసలైన ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను పెంచే ప్రాజెక్టులను విద్యార్థులు సొంతంగా చేయాల్సిన అవసరం లేకుండా మార్కెట్లో ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు. హైదరాబాద్‌ నగరంలో ఇదో పెద్ద వ్యాపారంగా మారింది. విశ్వవిద్యాలయం పట్టించుకోకపోవడం వల్ల కళాశాలల్లో అధ్యాపకులే వాటిని విక్రయించే సంస్థల చిరునామా చెప్పి మరీ విద్యార్థులను పంపిస్తున్నారు.

ఒక ప్రాజెక్టులో నలుగురు వరకు ఉండటం... దాని ఖరీదు రూ.5 వేల నుంచి రూ.10 వేలలోపే ఉండటం వల్ల కూరగాయలు కొన్నంత సులభంగా ప్రాజెక్టులను కొని కళాశాలల్లో సమర్పిస్తున్నారు.

బీటెక్‌ చివరి సంవత్సరం ఆఖరి సెమిస్టర్‌లో విద్యార్థులు అప్పటివరకు నేర్చుకున్న సబ్జెక్టు పరిజ్ఞానంతో ఒక అంశాన్ని ఎంచుకుని ప్రాజెక్టు రూపొందించాలి. దీన్ని సొంతంగా చేస్తే చాలావరకు తమ కోర్సుకు తగిన నైపుణ్యాలను సంపాదించినట్లేనని పలువురు చెబుతున్నారు.

2016-17లో బీటెక్‌లో చేరిన వారికి చివరి సెమిస్టర్‌కు 24 క్రెడిట్లు ఉంటే.. అందులో ప్రాజెక్టు ఒక్క దానికే 15 క్రెడిట్లు కేటాయించారు. దాన్ని బట్టి ప్రాజెక్టు ఎంత కీలకమో అర్థమవుతోంది. వాటిని సొంతంగా చేయడానికి బదులు అధిక శాతం మంది విద్యార్థులు మార్కెట్లో కొంటున్నారు.

ఏటా రూ.కోట్ల వ్యాపారం

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో ఐటీ శిక్షణ ఇచ్చే పలు కేంద్రాలు ప్రాజెక్టుల విక్రయాన్ని వ్యాపారంగా మార్చుకున్నాయి. రోడ్ల వెంట భారీ ప్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసి లైవ్‌ ప్రాజెక్టులు, పరిశోధనలకు శిక్షణ ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నాయి.

బెంగళూరు, చెన్నై నుంచి తక్కువ ఖరీదుతో ప్రాజెక్టులకు సంబంధించిన సీడీలను తెస్తారు. వాటిని ఇక్కడ విద్యార్థులు, కళాశాలల పేర్లు మార్చి విక్రయిస్తారు. బీటెక్‌ చివరి సెమిస్టర్‌ నడుస్తుండటం.. ప్రాజెక్టులు సమర్పించాల్సి ఉండటం వల్ల ఇతర జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు సైతం హైదరాబాద్‌ వస్తున్నారు. ఏటా రాష్ట్రంలో 70 వేల మంది వరకు బీటెక్‌లో చేరుతున్నారు.

చివరి ఏడాదికి వచ్చేసరికి ఆ సంఖ్య 55 వేల నుంచి 60 వేలకు తగ్గుతుంది. వారిలో దాదాపు 30 వేల మందికి పైగా ప్రాజెక్టులను కొనుగోలు చేస్తారని అంచనా. ఒక్కో ప్రాజెక్టులో ఒకరి నుంచి నలుగురు వరకు ఉండొచ్చు. ఎక్కువగా ఇద్దరుంటారు. ఒక్కోదానికి కనీసం రూ.5 వేలు అనుకున్నా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వ్యాపారం (20 వేల ప్రాజెక్టులు) జరుగుతోంది. హైదరాబాద్‌ చైతన్యపురిలోని ఓ సంస్థ వద్ద ఈ దందాను ‘ఈటీవీ భారత్​ పరిశీలించింది. ఖమ్మం, హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని కళాశాల విద్యార్థులు పదుల మంది ప్రాజెక్టుల కోసం అక్కడుకు వచ్చారు.

అధ్యాపకులకూ కమీషన్లు?

పలు కళాశాలల్లోని విభాగాధిపతులే హైదరాబాద్‌లో ప్రాజెక్టులు విక్రయించే సంస్థల పేరు చెప్పి పంపిస్తున్నారు. ఈ సీజన్‌ ప్రారంభమయ్యే ముందే కమీషన్‌కు సంబంధించిన ఒప్పందాలు జరుగుతాయి. ఎంటెక్‌, పీహెచ్‌డీ తరహాలో సమాచారాన్ని కాపీ చేస్తే సాఫ్ట్‌వేర్‌ సహాయంతో తనిఖీ చేసేలా ఫ్లాగరిజం లేకపోవడం వల్ల అంతా నడిచిపోతోంది.

జేఎన్‌టీయూహెచ్‌ సైతం ప్రాజెక్టుల తయారీ విధానాన్ని తేలిగ్గా తీసుకుంటోంది. ‘హైదరాబాద్‌లో ప్రాజెక్టుల అమ్మకాలు పెద్ద వ్యాపారంగా మారిన మాట వాస్తవమే’ అని పాలనాపరమైన కీలక పదవిలో ఉన్న జేఎన్‌టీయూహెచ్‌ ఆచార్యుడు ఒకరు అంగీకరించారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలోకి కరోనా రానివ్వం: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.