ETV Bharat / state

ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు.. విపక్షాల ఆందోళన

author img

By

Published : Sep 21, 2022, 4:12 PM IST

ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు.. విపక్షాల ఆందోళన
ఎన్టీఆర్‌ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు.. విపక్షాల ఆందోళన

NTR HEALTH UNIVERSITY : ఎన్టీఆర్​ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆయన​ పేరును తొలగిస్తూ వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పేరు పెట్టడాన్ని ఆంధ్రప్రదేశ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. హెల్త్​ యూనివర్సిటీకి, వైఎస్సార్​కి సంబంధం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

SOMU ON NTR HELATH UNIVERSITY : ఎన్టీఆర్​ పేరు మార్పుతో హెల్త్ యూనివర్శీటి ఎమెండ్‌మెంట్‌ బిల్లును ప్రవేశపెట్టడం అంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని ఏపీ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం దురుద్దేశంతో కేవలం సింగిల్ లైన్‌తో ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టిందని ఆక్షేపించారు.

కుట్రపూరితంగా ఎన్టీఆర్‌కు ద్రోహం చేసేలా వైకాపా వ్యవహరిస్తోందన్నారు. నందమూరి తారక రామారావు పేరు కాదని.. వైఎస్సార్ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి ఎప్పుడు వచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్​ను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే.. వైకాపా మాత్రం ఆయన పేరును రాష్ట్రమంతా పెట్టేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్ పేరు మార్పును భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

BJP BHANU PRAKSAH : ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పేరు మార్చడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని.. భాజపా నేత భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానికి పేర్లపై ఉన్న శ్రద్ధ.. రాష్ట్ర అభివృద్ధిపై లేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు.

BJP KANNA : ఎన్నో ఏళ్లుగా ఉన్న ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటి పేరును మార్చడం దుర్మార్గం అని భాజపా నేత లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారిస్తే ఎలా అని ప్రశ్నించారు.

MP SUJANA CHOWDARY: ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు సరికాదని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. పేరు మార్చడం అనైతిక, అనారోగ్య రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. తండ్రిపై ప్రేమ ఉంటే కొత్త సంస్థ స్థాపించి పేరు పెట్టుకోండని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని హితవు పలికారు. నిర్ణయం మార్చుకోకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

CPI RAMAKRISHNA : ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు అనేది.. జగన్‌ తుగ్లక్‌ నిర్ణయాల్లో మరొకటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా చేశారు . నందమూరి తారక రామారావు పేరు మార్పును విజ్ఞులెవరూ అంగీకరించరని అన్నారు. ఒక్క వైద్యకళాశాల కూడా కట్టలేని జగన్..పేర్లు మార్చుకుంటూ పోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు.

TULASI REDDY : ఎన్టీఆర్‌ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఇప్పటికే వైఎస్సార్‌ పేరు మీద చాలా ఉన్నాయని.. కావాలంటే కొత్తవాటికి వైఎస్సార్‌ పేరు పెట్టుకోవచ్చన్నారు. ప్రస్తుత నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.