ETV Bharat / state

Rayalaseema Lift irrigation: ప్రవాహ, లీకేజీ నష్టాలు తగ్గించేందుకే పనులు

author img

By

Published : Jul 3, 2021, 10:02 AM IST

రోజురోజుకి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల మంజూరు అంశాన్ని గత నెలలో కేంద్ర పర్యావరణశాఖ వాయిదా వేసింది. ఆ పరిధిలోని నిపుణుల మదింపు కమిటీ పలు అంశాల గురించి సమాచారం ఇవ్వాలని కోరగా.. ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు వివరాలను వారికి తెలియజేసింది. ప్రవాహ సామర్థ్యాన్ని మాత్రమే పెంచుతున్నామని.. కాలువలను వెడల్పు చేయట్లేదని వివరణ ఇచ్చింది.

Rayalaseema Lift irrigation
రాయలసీమ ఎత్తిపోతల పథకం

రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema lift irrigation project)లో భాగంగా ఎక్కడా కాలువలను వెడల్పు చేయట్లేదని ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ అధికారులు కేంద్ర పర్యావరణ మదింపు కమిటీకి తెలియజేశారు. కొత్తగా కాలువలు తవ్వట్లేదని, కొత్తగా మళ్లింపు ఏమీ లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న కాలువల సామర్థ్యాన్ని, స్థిరత్వాన్ని మెరుగుపరుస్తున్నామని వివరించారు. కాలువలకు లైనింగు పనులు చేసి ప్రవాహ నష్టాలను, లీకేజీ నష్టాలను తగ్గించేందుకే ఆ పనులు చేపడుతున్నామన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అవసరమైన పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు దిల్లీలో జూన్‌ 17న పర్యావరణ మదింపు కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి జలవనరులశాఖ చీఫ్‌ ఇంజినీరు మురళీనాథ్‌రెడ్డి హాజరయ్యారు. ఆ సమావేశంలో వారు అడిగిన ప్రశ్నలకు సీఈ సమాధానాలిచ్చారు. తర్వాత సమావేశపు మినిట్సు విడుదల చేస్తూ వివిధ అంశాల వారీగా మరింత సమాచారం కావాలని ఆ కమిటీ కోరింది. ఈ మేరకు సంబంధిత సమాచారాన్ని మురళీనాథ్‌రెడ్డి మదింపు కమిటీకి సమర్పించారు. వారి వాదనకు అనువుగా కొన్ని డాక్యుమెంట్లనూ సమర్పించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ లేవనెత్తిన అంశాలనూ పర్యావరణ మదింపు కమిటీ ప్రస్తావించడంతో వాటిపైనా వివరణ ఇచ్చారు.

కమిటీ అడిగిన ప్రశ్నలకు సీఈ ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి...

  • శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కన్నా దిగువ నుంచి నీటిని ఎత్తిపోయడం వల్ల ఎదురయ్యే ప్రభావం ఏమిటని కమిటీ ప్రశ్నించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో చెరో ఎత్తిపోతల పథకం ఉన్నాయని, వాటి నుంచి 800 అడుగుల కన్నా దిగువ నుంచే నీటిని ఎత్తిపోస్తున్నామని తెలియజేశారు. 2004-05 నుంచి 2019-20 వరకు 854 కన్నా దిగువ నుంచి ఎన్నిసార్లు నీటిని ఎత్తిపోశారో ఆ పట్టిక రూపొందించి సమర్పించారు. ఇప్పటికే ఉన్న పథకాలు, విద్యుత్తు కేంద్రాలు, కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో ఏ స్థాయి నుంచి నీటిని ఎత్తిపోస్తున్నదీ, ఎత్తిపోయనున్నదీ వివరించారు. ఏళ్ల తరబడి 800 అడుగుల దిగువ నుంచి నీటిని ఎత్తిపోస్తున్నా ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని గుర్తించలేదని తేల్చిచెప్పారు.
  • జియలాజికల్‌గా ఎలాంటి ప్రభావమూ ఉండబోదని జీఎస్‌ఐ శాస్త్రవేత్త నివేదించారు. అనేక ఏళ్ల నుంచి ఈ పథకాల కింద జలాశయాలు, కాలువలు ఉన్నాయి. భూభౌతిక పరిస్థితుల్లో వీటి వల్ల ఎలాంటి మార్పులూ గుర్తించలేదు.
  • రాయలసీమ ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ ఎలాంటి వన్యప్రాణి అభయారణ్యం పరిధిలోనూ లేదు. సమీపంలో లేదా, ఈ నిర్మాణ ప్రాంతాల్లో ఎక్కడా జీవావరణం పరంగా సున్నితమైన ప్రాంతాలు ఏవీ లేవు.
  • రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రస్తుతం ఉన్న ఏ పథకాలకు లబ్ధి చేకూరుతుందో ఆ తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, గాలేరు-నగరి ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతులు మంజూరై పనులు కూడా జరిగాయి.

రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema lift irrigation project)

కర్నూలు జిల్లాలోని గాలేరు-నగరి సుజలస్రవంతి ప్రాజెక్టు, శ్రీశైలం కుడిగట్టు కాలువ, తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి రోజుకు 3 టీఎంసీల నీరు ఎత్తి పోసేందుకు వీలుగా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం పెట్టుకున్న దరఖాస్తుపై ఈ కమిటీ కూలంకషంగా చర్చించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పైన పేర్కొన్న మూడు ప్రాజెక్టుల్లో అంతర్భాగంగా చేరుస్తూ శ్రీశైలం కుడిగట్టు కాలువకు 1988 సెప్టెంబరు 19న కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతులను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

సవరణలు

రాష్ట్ర విభజన తర్వాత కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల నీటిలో 101 టీఎంసీలు ప్రస్తుతం రాయలసీమలోని పథకాలకు ఉపయోగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ఈ నీటిని రోజుకు 3 టీఎంసీల చొప్పున తరలించడానికి రూ.3,825 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఇందులో ఫోర్‌బే, పంప్‌హౌస్‌, పైప్‌లైన్‌, అప్రోచ్‌ ఛానల్‌ ఉంటాయని తెలిపింది. ఈ ప్రాజెక్టు తొలి ప్రతిపాదనల్లో కొన్ని మార్పులు చేసినందున ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరమైనట్లు పేర్కొంది. ఈ పథకం కొత్తదేమీ కాదని, శ్రీశైలం రిజర్వాయరులో నీటిమట్టం 854 అడుగుల కంటే తగ్గినప్పుడు ఇప్పటికే ఉన్న పథకాలకు నీరు అందించడానికి ఉద్దేశించినట్లు తెలిపింది. శ్రీశైలం, తెలుగుగంగ, గాలేరు-నగరి ప్రాజెక్టులకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు తీసుకున్నందున వాటిలో సవరణలు చేస్తే సరిపోతుందని విజ్ఞప్తి చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ 2020 అక్టోబరు 29న ఈ ప్రాజెక్టు విషయంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ జారీచేసిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొంది.

ఇదీ చూడండి: TS - AP Water Disputes: సీమ కష్టాలు తెలుసని గతంలో కేసీఆర్ చెప్పారు: సజ్జల

JALA VIVADAM: జలజగడం.. జూరాల నుంచి పులిచింతల వరకు ప్రాజెక్టులపై పహారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.