ETV Bharat / state

Annual crime rate in Hyderabad: ఈ ఏడాది హైదరాబాద్​లో తగ్గిన నేరాలు.. పెరిగిన సైబర్ మోసాలు

author img

By

Published : Dec 23, 2021, 3:17 AM IST

Annual crime rate in Hyderabad: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాల శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దోపిడి, ఇళ్లల్లో చోరీలు, గొలుసు దొంగతనాలు, ప్రాపర్టీ నేరాలు.. గతేడాదితో పోలిస్తే చాలా వరకు తగ్గాయి. సైబర్ నేరాలు మాత్రం ఏటా పెరుగుతూనే ఉన్నాయి. క్యూఆర్ కోడ్, ఓటీపీ, నకిలీ కస్టమర్ కేర్ నంబర్ల వల్ల అమాయకులు మోసపోతున్నారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లపై కేసులు నమోదు చేసి న్యాయస్థానాల్లో హాజరు పరుస్తున్నారు. వాహనదారులకు జైలు శిక్ష పడటంతో పాటు డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్దవుతున్నాయి.

Annual crime rate in Hyderabad
హైదరాబాద్​లో తగ్గిన నేరాలు

Annual crime rate in Hyderabad: ఈ ఏడాది జరిగిన నేరాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వార్షిక నివేదిక విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నేరాలు 21 శాతం తగ్గాయి. 2020లో ప్రజలందరూ కరోనా లాక్​డౌన్ వల్ల దాదాపు ఆర్నెళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. కాబట్టి ఆ ఏడాదిలో నేరాల శాతం తక్కువగా ఉంది. దీంతో పోలీసులు 2019లోని నేరాల శాతాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. 2019లో 25,187 కేసులు ఉంటే 2021లో 20,012 కేసులు నమోదయ్యాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే కేసులు 4 శాతం, ఆస్తులకు సంబంధించిన నేరాలు 10 శాతం, మహిళలపై నేరాలు 2 శాతం తగ్గగా.. చిన్నారులపై నేరాలు మాత్రం 5 శాతం పెరిగాయి. 2019లో 339 ఉండగా 2021లో 357 కేసులు నమోదయ్యాయి.

Crimes in hyderabad: ఈ ఏడాదిలో కుట్రపూరిత నేరాలు 47 శాతం, హత్యాయత్నం 11 శాతం, అపహరణ 40 శాతం, రెండు వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించినవి 74 శాతం, మోసాలకు సంబంధించి 8 శాతం, వరకట్నం కోసం మహిళల హత్య 67 శాతం మేర కేసులు తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. మర్డర్ ఫర్ గెయిన్ కేసులు రెట్టింపు కాగా.. దోపిడీ కేసులు 15 శాతం, ఇళ్లల్లో దొంగతనాలు 28 శాతం, గొలుగు దొంగతనాలు 8 శాతం, నకిలీ పోలీస్ పేరుతో మోసాలకు సంబంధించిన కేసులు 29 శాతం తగ్గగా.. దృష్టి మరల్చి చేసే దొంగతనాలు 3 శాతం, వాహనాల దొంగతనాలు 16 శాతం, పనిమనిషుల పేరుతో ఇళ్లల్లో దొంగతనాల కేసులు 3 శాతం, అత్యాచారం కేసులు పెరిగాయి. అయితే ఇందులో కొత్త వ్యక్తుల ద్వారా అత్యాచారాలు జరిగిన కేసులు 3 ఉన్నాయి. మిగతావి ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం, తెలిసిన వ్యక్తులే అత్యాచారానికి పాల్పడిన కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు.

శిక్ష పడటంలో పోలీసులు సఫలీకృతం...

crime cases in Hyderabad: నిందితులకు శిక్ష పడటంలో పోలీసులు 81 శాతం సఫలీకృతమయ్యారు. న్యాయస్థానాల్లో పూర్తి సాక్ష్యాధారాలు సమర్పించడం వల్ల కోర్టులు నిందితులకు శిక్షలు విధించాయి. గంజాయిని నిరోధించడానికి పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 2వేల కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకుని 600మందిని అరెస్ట్ చేశారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న 210 మంది పీడీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దక్షిణాదిలో బెంగళూరు, చెన్నెతో పోల్చినా హైదరాబాద్ లో నేరాల శాతం తక్కువగా ఉందని పోలీస్ వార్షిక నివేదిక చెబుతోంది. నేరాల శాతం హైదరాబాద్​లో 233 ఉండగా.. బెంగళూరులో 401, చెన్నైలో 1937 పాయింట్లు ఉన్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదికలో పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక చర్యలు

మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేశంలోని 19 నగరాలతో పోలిస్తే మహిళలపై నేరాల్లో హైదరాబాద్ 8వ స్థానంలో ఉంది. మహిళలు, చిన్నారులపై నేరాల్లో 75 శాతం మంది తెలిసిన వ్యక్తులే చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సైబర్ నేరాలు మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నివారణ కోసం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరాలు పెరుగుతుండటం పోలీసుల్లో ఆందోళన కలిగిస్తోంది. 2019లో 1379 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 5648 కేసులకు పెరిగాయి.

పెరుగుతున్న సైబర్​ నేరాలు

cyber crimes in TS: సైబర్ మోసాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల నేరగాళ్ల చేతిలో అమాయకులు మోసపోతున్నారు. సైబర్ మోసాలు క్రమంగా పెరుగుతుండటంతో అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ నేరాలను దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరాల దర్యాప్తునకు ప్రతి పోలీస్ స్టేషన్​లోనూ పోలీసులకు శిక్షణ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ఏర్పాటుచేసిన 155260 టోల్ ఫ్రీ నెంబరును ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. సైబర్ నేరాల ఫిర్యాదుకు ఏర్పాటు చేసిన పోర్టల్ ద్వారా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు 2743 ఫిర్యాదులు అందాయి. దాదాపు కోటికి పైగా నగదును సైబర్ నేరగాళ్లకు చెందిన బ్యాంకు ఖాతాల్లో స్తంభింపజేశారు. సైబర్ నేరాలలో ఎక్కువగా 45 శాతం క్యూఆర్ కోడ్ స్కానింగ్ మోసాలు, 15 శాతం మోసాలు ఓటీపీ, గూగుల్​లో నకిలీ కస్టమర్ కేర్ నెంబర్ల ద్వారా, ఆన్ లైన్ గేమింగ్, రుణ్ యాప్​లపై సైబర్ క్రైం పోలీసులు పలు కేసులు నమోదు చేశారు.

పెట్టుబడుల పేరుతో మోసాలు

financial frauds: పెట్టుబడుల పేరుతో మోసాలకు సంబంధించి 162 కేసులు నమోదు కాగా.. రూ.7.48 కోట్లను కొల్లగొట్టారు. ఈ కేసుల్లో 18 మందిని అరెస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో జరిగిన మోసాలకు సంబంధించి 16 కేసులు నమోదయ్యాయి. రుణ యాప్​లో వేధింపులు మళ్లీ మొదలయ్యాయి. గత 15 రోజుల్లో 46 రుణ అప్లికేషన్లకు సంబంధించి ప్రతినిధుల నుంచి వేధింపులు వస్తున్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారని నేర విభాగం అదనపు డీజీ శిఖా గోయల్ తెలిపారు.

ట్రాఫిక్​ ఉల్లంఘనులకు చలానాలు

traffic rules violation: హైదరాబాద్​లో క్రమంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ అదనపు సీపీ విజయ్ కుమార్ తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాళ్లపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మోటారు వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించిన 70 లక్షల మంది వాహనదారులపై చలానా విధించారు. శిరస్త్రాణం ధరించని 53 లక్షల మంది ద్విచక్ర వాహనదారులకు చలానా విధించారు. అధిగ వేగంతో వెళ్తున్న 90 వేల మంది వాహనదారులపైనా కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడం, పరిమితికి మించిన వేగంతో వెళ్లడం, సైలెన్సర్లను మార్చడం వంటివి చేసిన వాళ్లపైనా ట్రాఫిక్ పోలీసులు చలానా విధించారు.

డ్రంక్​ అండ్ డ్రైవ్ కేసులు​

drunk and drive cases:మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 25,453 మంది పోలీసులకు దొరికిపోయారు. వీరిలో 10 వేల మందిపై నేరాభియోగపత్రాలను కోర్టుల్లో దాఖలు చేశారు. 206 మందికి జైలు శిక్ష పడింది. రూ.10 కోట్లకు పైగా జరిమానాను కోర్టు విధించింది. వారిలో 25 మంది లైసెన్సులు కూడా రద్దయ్యాయి. హైదరాబాద్​లో జరిగిన ప్రమాదాల వల్ల 278 మంది వాహనదారులు చనిపోగా... 77మంది పాదచారులు మృతి చెందారు.

వచ్చే ఏడాది సమాజ అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. దీనికోసం ప్రతి పీఎస్​లో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ప్రజల అవసరాలను తెలుసుకోనున్నారు. ప్రొఫెషనర్ హెల్ప్, హెల్ప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. దీంట్లో పీఎస్​ల వారీగా అవసరాలు వేరుగా ఉంటాయి. దానికి అనుగుణంగా పోలీసు బృందాలను తీర్చిదిద్దనున్నారు.

ఈ ఏడాది జరిగిన నేరాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వార్షిక నివేదిక విడుదల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.