ETV Bharat / state

అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లల దైన్యస్థితి.. 10 శాతం మందిలో పౌష్టికాహార లోపం!

author img

By

Published : Jan 3, 2022, 7:05 AM IST

Malnutrition in Children, Children Malnutrition
పౌష్టికాహార లోపం

Malnutrition in Children: వయసుకు తగిన ఎత్తు, ఎత్తుకు తగిన బరువు లేక చిన్నారులు బలహీనమవుతున్నారు. తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన పిల్లల్లో పది శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అంగన్‌వాడీల్లోని అయిదేళ్లలోపు చిన్నారుల ఎదుగుదలపై అక్కడి సిబ్బంది ప్రతినెలా సమీకరిస్తున్న గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. లోపాన్ని అధిగమించేందుకు పిల్లలందరికీ రోజూ గుడ్డు, పాలు అందించాలని ప్రతిపాదించినా.. ఆమోదం మాత్రం లభించలేదు.

Malnutrition in Children in Telangana: తెలంగాణలో చిన్నారులు బక్కచిక్కిపోతున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీల్లో అయిదేళ్లలోపు చిన్నారులు 12.60 లక్షల మంది ఉన్నారు. మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం, వారానికి నాలుగు గుడ్లు, చిరుతిళ్లు(స్నాక్స్‌) ఇస్తున్నారు. 3-6 ఏళ్లలోపు బాలలకు ఆహారంతో పాటు వారానికి నాలుగు గుడ్లు, స్నాక్స్‌ అందిస్తున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచి 1000 రోజుల వరకు సరైన పౌష్టికాహారాన్ని అందించాలని, వీరి ఎదుగుదలను ప్రతినెలా అంగన్‌వాడీ సిబ్బంది ‘పోషణ్‌ అభియాన్‌’ యాప్‌లో నమోదు చేయాలని కేంద్రం సూచించింది. ప్రతినెలా 80శాతం మంది పిల్లల వివరాలను నమోదు చేసిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. అంగన్‌వాడీ సిబ్బంది ఆరోగ్య కార్యకర్త సమక్షంలో వాటిని నమోదు చేస్తున్న క్రమంలో పిల్లల్లో 17 శాతం మంది వయసుకు తగిన ఎత్తు లేరని వెల్లడైంది. 18.65 శాతం మంది పిల్లలు మధ్యస్తంగా, 20 శాతం మంది సాధారణ బరువుకన్నా తక్కువగా ఉన్నట్లు తేలింది.

చిన్నారుల్లో ఇదీ పరిస్థితి

అదనపు పౌష్టికాహారమేదీ?

బాల్యవివాహాలు, పేదరికం, తల్లుల్లో రక్తహీనత కారణంగా పిల్లలు బలహీనంగా ఉంటున్నారు. అందుకే కౌమారదశ బాలికలకు ప్రత్యేక పౌష్టికాహారం ఇవ్వాలని మహిళా శిశు సంక్షేమశాఖ ప్రతిపాదించింది. రోజూ గుడ్డు, ఇతర పౌష్టికాహారం, విటమిన్‌ మాత్రలు అందించాలని ప్రతిపాదించినా అమలుకు నోచలేదు. రాష్ట్రంలోని అయిదేళ్లలోపు చిన్నారుల్లో 10శాతం మందిలో పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉంది. వీరిలో 5 శాతం మందిలో అది తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. వారికి రోజూ గుడ్డు, 200మి.లీ. పాలు ప్రత్యేకంగా ఇవ్వాలని నిర్ణయించినా, విధాన నిర్ణయం వెలువడలేదు. తీవ్ర పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలల పరంగా ములుగు జిల్లా రాష్ట్రంలోనే తొలిస్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి నూరుగురు బాలల్లో 15శాతం మంది ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్‌ (9.34 శాతం), ఆదిలాబాద్‌ (8.04 శాతం) జిల్లాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి.

కేటాయింపులకే అంటకత్తెర!

గ్రామం, నివాస సముదాయాల స్థాయిలో మాతాశిశు ఆరోగ్యం, పౌష్టికాహార బాధ్యతల్ని పూర్తిగా అంగన్‌వాడీ కేంద్రాలకే దఖలు పరచాలని, అక్కడే వైద్యుల సేవలూ అందుబాటులోకి రావాలని ఆ మధ్య నీతి ఆయోగ్‌ కార్యాచరణ వ్యూహాన్ని సూచించడం తెలిసిందే. అంగన్‌వాడీ కేంద్రాలన్నింటా తగినంతమంది సహాయకుల నియామకాలు చేపట్టాలని, కార్యకర్తలకు ఎప్పటికప్పుడు మెరుగైన శిక్షణ అందుతుండాలనీ అప్పట్లో గిరిగీసింది. మహిళ గర్భం దాల్చింది మొదలు వెయ్యి రోజుల వ్యవధిలో శిశువుల మెదడు 90 శాతం దాకా వికాసానికి నోచుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ స్పృహతో, వాస్తవికావసరాలకు అనుగుణంగా నిధుల లభ్యత పెంపొందించాల్సిన దశలో- పెంపుదల మాట అలా ఉంచి, ఉన్న కేటాయింపులకే అంటకత్తెర వేయడమేమిటి? ప్రాథమ్యాలు గాడి తప్పిన దుస్థితి ఆరోగ్యం, పోషకాహారం, ఆహార హక్కుల నిపుణులనే కాదు- బాలభారతం దయనీయావస్థ గురించి కనీస అవగాహన కలిగిన ప్రతి ఒక్కరినీ విస్మయపరుస్తోంది!

ఇదీ చూడండి: '33 లక్షల మంది చిన్నారుల్లో తీవ్ర పౌష్టికాహార లోపం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.