ETV Bharat / state

Recruitment Process: ఊపందుకోనున్న నియామకాల ప్రక్రియ... ఒకటి, రెండు నోటిఫికేషన్లు జారీ!

author img

By

Published : Mar 22, 2022, 5:25 AM IST

Recruitment Process: ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఈ వారం ఊపందుకోనుంది. వీలైనంత త్వరగా ఒకటి, రెండు నోటిఫికేషన్లు జారీ చేయాలనే యోచనలో ఉన్న ప్రభుత్వం... న్యాయపరంగా, ఇతర రకాలుగా ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒకటి, రెండు రోజుల్లో కొన్ని పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదంతోపాటు టెట్ పరీక్ష నిర్వహణకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Recruitment
Recruitment

Recruitment Process: 80 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం... అందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. నియామక ప్రక్రియను పూర్తిస్థాయిలో పర్యవేక్షించి... త్వరగా చేపట్టే బాధ్యతను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘానికి అప్పగించారు. ఖాళీల సమాచారంపై ఇప్పటికే ఆర్థికశాఖ ఆయా శాఖలతో సంప్రదింపులు జరిపింది. హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం... సోమవారం సమావేశమై నియామక ప్రక్రియ పురోగతిని సమీక్షించింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సీఎం ప్రకటన అనంతరం ఇప్పటివరకు జరిగిన పురోగతిని మంత్రులు సమీక్షించారు. కొన్ని శాఖలు, కొన్ని పోస్టుల భర్తీ కోసం... తమ వద్దకు ప్రతిపాదనలు వచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు తెలిపారు. అన్నింటినీ పరిశీలించి పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు.

రెండురోజుల్లో ఉత్తర్వులు...

కొత్త జోనల్ విధానం, కేడర్‌లో మార్పుల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. న్యాయపరమైన అంశాలను ప్రతి దశలోనూ పరిశీలించాలని... న్యాయశాఖ కార్యదర్శిని ఎప్పటికప్పుడు సమప్రదించడంతోపాటు లీగల్ వెట్టింగ్ పక్కాగా జరిగేలా చూడాలని తెలిపింది. ముందస్తు ప్రక్రియ, పరిశీలన పూర్తయిన పోస్టుల భర్తీకి వెంటనే అనుమతి ఇవ్వాలని మంత్రులు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఒకటి, రెండు రోజుల్లో ఆర్థికశాఖ ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉంది. పోలీసు, వైద్య-ఆరోగ్య శాఖలోని పోస్టుల భర్తీ ప్రక్రియ మొదట ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అటు ఉపాధ్యాయ అర్హతా పరీక్ష- టెట్ నిర్వహణకు ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. మొత్తానికి ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఈ వారంలో ప్రారంభమై... వేగవంతం కానుంది.


ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.