ANNADANAM: గణేశ్​ నిమజ్జనోత్సవంలో 11 ఏళ్లుగా అన్నదానం చేస్తున్న వ్యాపారి

author img

By

Published : Sep 19, 2021, 4:42 PM IST

ANNADANAM

తన ఆకలి తీరడం కంటే ఎదుటి వారి ఆకలిని గ్రహించి వారికి కడుపు నిండా భోజనం పెట్టడమే మానవత్వానికి నిదర్శనం. ఎన్ని కోట్లు సంపాదించాం అనే దాని కంటే ఎంత పుణ్యం, ఎదుటివారి ఆశీస్సులు ఎంత పొందాం అనేదే ఆ మనిషి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఒకానొక సందర్భంలో ఆకలి విలువ తెలిసిన ఓ వ్యక్తి.. మరెవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఏడాదికోసారి దాదాపు లక్ష మందికి సొంత ఖర్చులతో అన్నదానం(ANNADANAM) చేస్తున్నారు. ఆకలి తీరిన వారి నుంచి అన్నదాత సుఖీభవ అనే ఆశీర్వచనం పొందుతున్నారు.

హైదరాబాద్​ మహానగరంలో ప్రతి యేటా గణేశ్​ నిమజ్జనోత్సవంలో సందడి వాతావరణం నెలకొంటుంది. నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరం నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారు. దీంతో రహదారిపై ఓ వైపు వినాయకుడి విగ్రహాలు, మరో వైపు వాహనాల రద్దీనే కాకుండా భక్తుల కోలాహలం. వీటన్నింటి నడుమ ఆ నిమజ్జనాన్ని చూసి తిరుగు ప్రయాణమయ్యేసరికి ఎంత సమయం అవుతుందో చెప్పలేం. ఆ సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎంతో మంది స్వచ్ఛందంగా వారి దాహార్తి తీరుస్తుంటారు. మరికొందరు ప్రసాదాన్ని పంచుతుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యాపార వేత్త పదకొండేళ్లుగా నిమజ్జనోత్సవంలో అన్నదాన(ANNADANAM) కార్యక్రమం చేపడుతున్నారు.

annadanam
భోజనం కోసం లైన్లలో వేచి ఉన్న జనం

గణేశ్​ నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఆకలి ఓ వ్యాపారవేత్త. పాతబస్తీకి చెందిన వ్యాపారి శ్రీధర్.. గత 11ఏళ్లుగా బషీర్ బాగ్ నిజాం కళాశాల పక్కన అన్నదానం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలివస్తుంటారు. క్యూలో నిలబడి అన్నదానం స్వీకరిస్తున్నారు. 50మంది పనిమనుషులతో శ్రీధర్​ అక్కడే వంటలు చేయించి... అక్కడికి వచ్చిన వారికి కడుపు నిండా భోజనం పెడుతున్నారు.

annadanam
అన్నదానం కార్యక్రమంలో నెలకొన్న రద్దీ

తాను కుటుంబంతో కలిసి నిమజ్జనానికి వచ్చినపుడు ఆకలి వేసిందని... మరెవరూ ఆ పరిస్థితితో బాధపడకూడదని భావించినట్లు శ్రీధర్​ పేర్కొన్నారు. అందుకే 11ఏళ్లుగా అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 2 గం. వరకు సుమారు లక్షమంది భక్తులకు భోజనం ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీధర్​ వివరించారు.

annadanam
భోజనం వడ్డిస్తున్న సిబ్బంది

ఇదీ చదవండి: Khairatabad Ganesh: జలప్రవేశం చేసిన ఖైరతాబాద్‌ మహారుద్ర గణపతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.