ETV Bharat / state

తెలంగాణలో 91,295 ఎకరాల అడవి దగ్ధం

author img

By

Published : Feb 16, 2020, 9:26 AM IST

తెలంగాణలో అడవి ఆహుతైపోతోంది. నల్లమల అడవిలో మంటలు చేలరేగితే.. అటవీశాఖ సిబ్బంది ఈత కొమ్మలను చిన్నచిన్న కట్టలుగా చేసి, వాటితో ఆర్పే యత్నం చేస్తున్నారు. అగ్నిని నియంత్రించే పరికరాలు లేకపోవడమే దీనికి కారణం. చిన్న చిన్న మంటలకే ఈ చిట్కా.. అదే పెద్దవైతే అంతే సంగతులు. ఈ మధ్య ఆస్ట్రేలియా అడవుల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించి అడవులు ఆహుతైపోవడం చూశాం. అత్యాధునిక పరిజ్ఞానం ఉన్నా, అక్కడ దావానలాన్ని ఆర్పలేని స్థితి.

91295-acres-of-forest-fire-in-telangana
తెలంగాణలో 91,295 ఎకరాల అడవి దగ్ధం

రాష్ట్ర అడవుల్లో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉష్ణోగ్రత కారణామా లేక మానవ తప్పిదమా అంటూ ఈనాడు ప్రత్యేక ప్రతినిధులు ఇటీవల అమ్రాబాద్‌ పులుల అభయారణ్యం నుంచి పర్యటించారు. అప్పడు పలు ఆసక్తికర అంశాలు తెలిశాయి. ఆకులు రాలే కాలానికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు తోడవడం వల్ల తెలంగాణ అటవీ ప్రాంతాలు భగ్గుమంటున్నాయి. ఒక్క శనివారం రోజే రాష్ట్రవ్యాప్తంగా అటవీప్రాంతాల్లో 24 చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరంలో ఒకే రోజు ఇన్ని ప్రమాదాలు సంభవించడం ఇదే తొలిసారి. జగిత్యాల జిల్లాలో 4, నాగర్‌కర్నూల్‌లో 3, పెద్దపల్లిలో 3, సిరిసిల్లలో 2, కొత్తగూడెంలో 2, మెదక్‌లో 2, ములుగులో 2, మహబూబాబాద్‌లో 2, వికారాబాద్‌లో 2, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి చొప్పున ప్రమాదాలు జరిగాయి. ఎస్‌ఎన్‌పీపీ, మోదీస్‌ ఉపగ్రహాల ద్వారా ఈ ప్రమాదాల సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అప్రమత్తమై వెంటనే మంటల్ని ఆర్పేందుకు సిబ్బందిని రంగంలోకి దింపింది.

మరికొన్ని మంటలు చేలరేగిన ఘటనలు

  • శ్రీశైలం రహదారి వెంట కిలోమీటర్ల మేర అడవి కాలిపోయింది.
  • మన్ననూరు నుంచి దోమలపెంట వరకు 55 కి.మీ. పొడవునా అగ్ని ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి.
  • నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం ఉరుమండ సమీపంలో ఈనెల 4న, గతంలో మూడు రోజుల ముందు ఎర్రకురువలో రెండు భారీ అగ్నిప్రమాదాలు జరిగాయి.
  • వటవార్లపల్లి-దోమలపెంట వరకు రహదారికి ఇరువైపులా అనేకచోట్ల అడవి కాలిపోయింది. అదె బీట్‌లో రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. 12వ తేదీన కూడా మరో ప్రమాదం కూడా జరిగింది.

మంటల్లో జంతువులు..

అగ్నిప్రమాదాల్లో కొన్ని రకాల జంతువులు మంటల కారణంగా మరణిస్తున్నాయి. కాలిన ప్రాంతంలో మొలిచే పిచ్చి గడ్డిని జింకలు, మనుబోతులు, కుందేళ్ల వంటివి తినలేక ఆహారం కోసం వలస పోతున్నాయి. వీటిని వేటాడి బతికే తోడేళ్లు, రేసుకుక్కలు, చిరుతలు, పులుల వంటివి కూడా అడవిని వీడిపోతున్నాయి. పెద్దపులులు సంచరించే కవ్వాల్‌, అమ్రాబాద్‌ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా అమ్రాబాద్‌ అభయారణ్యంలో పెద్దపులుల సంఖ్య 20కి మించకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం.

మానవ తప్పిదమేనా?

డిసెంబరు నెలాఖరు నుంచి ఆకులు రాలే కాలం. జనవరిలో మొదలైన.. ఈ ప్రమాదాలు ఫిబ్రవరిలో పెరిగాయి. ఏటా జరిగే ప్రమాదాల్లో 50 శాతం మార్చిలోనే ఉంటున్నాయి. గొర్రెల కాపరులు, అటవీ మార్గంలో ప్రయాణించేవారు సిగరెట్లు తాగి, వంటలు చేసుకుని నిప్పును ఆర్పకపోవడం వంటివి ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

అటవీశాఖ చర్యలు

అడవి పరిసరాల్లోని ప్రజలకు అటవీశాఖ అవగాహన కల్పిస్తోంది. ఫైర్‌లైన్లు, తక్షణ స్పందన బృందాలను ఏర్పాటు చేసింది. అధికారులు, ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు సహా దాదాపు 13 వేల మంది ఫోన్‌ నెంబర్లను అటవీశాఖ రిజిస్టర్‌ చేసి, ఉపగ్రహాల నుంచి వచ్చే అగ్ని ప్రమాదాల సమాచారం వీరందరికీ ఎప్పటికప్పుడు అందిస్తోంది.

రాష్ట్రంలో 91,295 ఎకరాలు దగ్ధం

మొక్కలు నాటడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పార్లమెంటులో కేంద్రం ప్రశంసించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో రూ.3836 కోట్లతో 177 కోట్ల మొక్కలు నాటింది. మరోవైపు ఏటా వేలాది ఎకరాల్లో అడవి ఆహుతి అవుతోంది. గత రెండేళ్లుగా రాష్ట్రంలో 91,295 ఎకరాల (36,946 హెక్టార్లు) అడవి దగ్ధమైంది. అగ్నిప్రమాదాల వల్ల అడవి నల్లగా మాడిపోతోంది. తెలంగాణలో 4.71 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న నల్లమలలో కంటికి కనిపించే మంటలను మాత్రమే సిబ్బంది ఆర్పగలుగుతున్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితి.

రక్షిత అటవీ ప్రాంతాల్లో ప్రయాణం నిషేధం

వరుస ప్రమాదాల నేపథ్యంలో అటవీశాఖ నివారణ చర్యలు చేపడుతోంది. అటవీ ప్రాంతాల్లో వంటలు చేయడం, నిప్పు రాజేయడంపై నిషేధం విధించింది. నల్లమల మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు అడవిలో నిర్దేశిత ప్రాంతాలు, రోడ్ల మీదుగానే ప్రయాణించాలని సూచించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విరామ ప్రాంతాల్లో సేద తీరేందుకు అనుమతి ఉందని.. అక్కడ తాగునీటి సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు పేర్కొంది. అటవీమార్గాల్లో, కాలిబాటల్లో ప్రయాణంపై నిషేధం ఉందని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల జరిగిన మూడు ప్రధాన అగ్ని ప్రమాదాలకు మానవ నిర్లక్ష్యమే కారణమని విచారణలో తేలినట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి : కారు-లారీ ఢీకొని ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.