ETV Bharat / state

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో CISF కీలక పాత్ర: అమిత్​ షా

author img

By

Published : Mar 12, 2023, 12:52 PM IST

Updated : Mar 12, 2023, 1:44 PM IST

amith shah
amith shah

CISF 54th Foundation Day at Hakimpet: హైదరాబాద్​లో సీఐఎస్​ఎఫ్ 54వ​ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హాజరయ్యారు. పటిష్ఠమైన భద్రతతో దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అమిత్‌షా తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో CISF కీలక పాత్ర: అమిత్​ షా

CISF 54th Foundation Day at Hakimpet: ఉగ్రవాదం, వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణచివేసే వైఖరిని రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. పటిష్ఠమైన భద్రతతో దేశ ఆర్థిక ప్రగతిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. హైదరాబాద్‌ హకీంపేట్‌లోని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం.. 54వ వ్యవస్థాపక దినోత్సవం అట్టహాసంగా జరిగింది. 'రైజింగ్ డే' వేడుకలను తొలిసారి దిల్లీ వెలుపల హకీంపేట్‌లోని సీఐఎస్​ఎఫ్​ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై, డీజీపీ అంజనీకుమార్‌ పాల్గొన్నారు. ముందుగా గౌరవవందనం స్వీకరించిన అమిత్‌షా.. దేశవ్యాప్తంగా సీఐఎస్​ఎఫ్​ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులకు రివార్డులు అందజేశారు. అనంతరం 'రైజింగ్‌ డే' వేడుకల సందర్భంగా సీఐఎస్​ఎఫ్​ సత్తాను కళ్లకు కట్టేలా నిర్వహించిన కవాతులు, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో కేంద్ర పారిశ్రామిక దళానిది కీలకపాత్ర అని అమిత్‌ షా స్పష్టం చేశారు. 1969 మార్చి 10న 3వేల సిబ్బందితో ప్రారంభమై.. లక్షా 80 వేల మందికి చేరుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, పవర్ ప్లాంట్స్, జాతీయ పారిశ్రామిక భవనాలకు భద్రత కల్పిస్తోందని వివరించారు. ఉగ్రవాదం, వేర్పాటువాదంపై 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి ప్రజల్లో విశ్వాసం నింపిందని అమిత్‌షా తెలిపారు.

''కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, వామపక్ష ప్రభావిత ప్రాంతాలు ఈ మూడింటిలోనూ హింస గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. ఉగ్రవాదులు, వేర్పాటువాదుల సంఖ్య తగ్గడమే కాదు.. లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. మోదీ సర్కార్‌ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న కఠిన వైఖరి రానున్న రోజుల్లోనూ కొనసాగుతుందని ప్రజలకు స్పష్టం చేస్తున్నాం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉగ్రవాదం, వేర్పాటువాదం, దేశ వ్యతిరేక కార్యకలాపాలు ఉంటే కఠినంగా అణచి వేస్తాం. ఇందులో సీఐఎస్‌ఎఫ్‌, రాష్ట్ర పోలీసులది కీలకపాత్ర. ఇదే గత 9 ఏళ్లుగా చేసి చూపించాం.'' -అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

వాషింగ్‌ పౌడర్‌ 'నిర్మా.. వెల్‌కమ్‌ అమిత్‌ షా' ఫ్లెక్సీల కలకలం: హైదరాబాద్‌లో అమిత్‌షా పర్యటన వేళ వాషింగ్‌ పౌడర్‌ 'నిర్మా.. వెల్‌కమ్‌ అమిత్‌ షా' అంటూ ఫ్లెక్సీలు, వాల్‌ పోస్టర్లు వెలిశాయి. బీజేపీ నేతలు హిమంత బిశ్వ శర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాదిత్య సింధియా వంటి పలువురు నేతలతో ఉన్న ఫ్లెక్సీలు నగరంలో వెలిశాయి. అవినీతి ఆరోపణలు ఉన్నా.. బీజేపీలో చేరగానే అన్ని మరకలు పోయాయంటూ అర్థం వచ్చేలా వీటిని ఏర్పాటు చేశారు. నిన్న కవితపై ఈడీ విచారణ సందర్భంగా ఇదే తరహాలో పోస్టర్లు వెలిశాయి. తాజాగా ఈ ఫ్లెక్సీలతో రాజకీయ వేడి రాజుకుంది.

ఇవీ చదవండి:

Last Updated :Mar 12, 2023, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.