ETV Bharat / state

పది రోజులు మృత్యువుతో పోరాటం.. ప్రాణాలొదిలిన బాలింత

author img

By

Published : Oct 28, 2021, 10:41 AM IST

ఓ మహిళ కాన్పుకోసం వచ్చి.. పది రోజులు కోమాలోకి వెళ్లి.. చివరికి ప్రాణం కోల్పోయిన ఘటన భద్రాద్రిలో చోటు చేసుకుంది. శస్త్రచికిత్స తర్వాత బాలింత ఆరోగ్యం విషమించింది. పది రోజులుగా బాధితురాలు అపస్మారక స్థితిలోనే ఉంది. బతుకుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులకు నిరాశే ఎదురైంది. పుట్టిన బాబు దక్కకపోవడం, బాలింతరాలు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

women died
కాన్పుకోసం వచ్చి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలం మర్కోడు గ్రామానికి చెందిన తాళ్లపల్లి సంతోష్- భాగ్యలక్ష్మి దంపతులు మూడో కాన్పు కోసం ఈ నెల 17న కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వెళ్లారు. కడుపులో బిడ్డ పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు... తల్లిని మాత్రమే కాపాడగలమని చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆపరేషన్‌ చేసిన తర్వాత పుట్టిన బిడ్డ చనిపోయాడని... ఆ తర్వాత బాలింత అపస్మారక స్థితిలోకి వెళ్లిందని ఆరోపించారు.

సమయం గడుస్తున్నా.. బాలింత స్పృహలోకి రాకపోవడంతో వైద్యులు పరీక్షించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం లేెెదా వరంగల్​కు తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. తొలుత బిడ్డకు మాత్రమే ప్రమాదమన్న వైద్యులు... తర్వాత తల్లి పరిస్థితి బాగాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వెంటనే భాగ్యలక్ష్మిని ఖమ్మం తరలించేందుకు 108కు సమాచారం ఇచ్చారు. 108 వాహన సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చివరకు జిల్లా అధికారులను సంప్రదించగా... సాయంత్రం 3 గంటలకు 108 వాహనం ఏర్పాటు చేశారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

పదిరోజులు పోరాడి..

పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. అక్కడ మూడు రోజులు చికిత్స అందించినా భాగ్యలక్ష్మి కోమా నుంచి బయటకు రాలేదు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్​లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు తేల్చేశారు. ఇలా పదిరోజులుగా పోరాడిన భాగ్యలక్ష్మి చివరకు విధిచేతిలో ఓడిపోయి ప్రాణం కోల్పోయింది. కొత్తగూడెం ప్రభుత్వం వైద్యుల నిర్లక్ష్యం వల్లే భాగ్యలక్ష్మి ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: కాన్పుకోసం వచ్చి.. ఎనిమిది రోజులుగా కోమాలోనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.