ETV Bharat / state

Tiger Roaming in Tekulapally: వీడని పులి.. రోడ్లపై, పంట పొలాల్లో సంచారం.!

author img

By

Published : Nov 24, 2021, 2:23 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం పరిధిలో పులి సంచారం(Tiger Roaming in Tekulapally).. స్థానికులను కలవరపెడుతోంది. పంట పొలాల్లో పులి తిరుగుతున్నట్లు గుర్తించిన రైతులు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. అడవుల్లోనే కాకుండా పొలాల్లో పులి కదలికలు ఉండటంతో ఎప్పుడు ఏమవుతుందో తెలియక స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

Tiger Roaming in Tekulapally
టేకులపల్లిలో పులి కలకలం

Tiger Roaming in Tekulapally: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనుకోని అతిథిగా వచ్చిన పులి.. ఐదు రోజులుగా అటవీశాఖ అధికారులను, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లందు మండలాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పాల్వంచ నుంచి టేకులపల్లి మండలంలోకి ప్రవేశించిన పులి.. అనంతరం ఇల్లందు మండలం పరిధిలోని అటవీ ప్రాంతంలో తన కదలికలను చూపించింది. రెండుసార్లు టేకులపల్లి మండలంలో ప్రత్యక్షంగా కనిపించిన పులి మంగళవారం.. ఎక్కడ ఉందో తెలియక అటవీశాఖ అధికారులు అయోమయంలో పడ్డారు. స్వయంగా డీఎఫ్ఓ రంజిత్ నాయక్.. అటవీ శాఖ అధికారులు సిబ్బందితో కలిపి గాలింపు చేపట్టినా పులి ఏ దిశగా వెళుతోందో గుర్తించలేకపోయారు. పూర్తిస్థాయిలో కెమెరాలు లేకపోవడం వల్ల పులి కదలికలు తెలుసుకోవడం కష్టతరంగా మారింది.

రోడ్లపై, పంట పొలాల్లో సంచారం

భయాందోళనలో స్థానికులు

పంటపొలాల్లో పులి సంచరిస్తున్నట్లు రైతులు తెలిపారు. హనుమాతండా, లచ్చతండా పొలాల్లో పులి(Tiger Roaming in Yellandu) పాదముద్రలు గుర్తించారు. కొన్ని రోజుల క్రితం టేకులపల్లి అటవీశాఖ పరిధిలో పులి రోడ్డు దాటుతుండగా వాహనదారులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం పెద్దమ్మతల్లి గుట్ట- ఆంజనేయపాలెం అటవీప్రాంతంలో మేకల కాపరులు గమనించి అధికారులకు సమాచారం అందించారు. పులి తిరుగుతుందని నిర్ధరించిన పోలీసులు... సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆవాసం దిశగా?

అనుకూల వాతావరణం లేక తీవ్రంగా నడిచిన పులి.. దట్టమైన అటవీమార్గానికి చేరడంతో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలారు, పాతర్లగడ్డ అడవి దట్టంగా ఉండటం, నీటి సౌకర్యం, అడవి దున్నలు, అడవి పందులు అందుబాటులో ఉండటం అనుకూల అంశంగా పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే పొలాల్లో సంచరించిన పులి(Tiger roaming in bhadradri district) టేకులపల్లి, ఇల్లందు మండలాల పరిధిలో తన ఉనికిని చాటుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవైపు జంతువుల గణన చేస్తున్న అటవీ శాఖ.. పులి(tiger roaming in bhadradri district) కదలికతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అది ఏ ప్రాంతానికి వెళ్తుందో నిత్య పర్యవేక్షణ చేస్తూ వస్తున్నారు. ఒకవైపు సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తూ పులికి సైతం ఎటువంటి హాని జరగకుండా క్షేమంగా వెళ్లాలని కోరుకుంటున్నారు. మొదట్లో ముందుకే సాగిన పులి ఇప్పుడు వివిధ మార్గాల్లో సంచరిస్తూ ఉండటం అటవీ శాఖకు, స్థానిక గ్రామాల ప్రజలు, రైతులకు ఆందోళన కలిగిస్తోంది. అడవుల్లోనే కాకుండా పొలాల్లో పులి కదలికలు ఉండటంతో ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

పులిసంచారంతో టేకులపల్లి మండలంలోని గ్రామాల్లో భయాందోళన నెలకొంది. దీంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు, సిబ్బంది.... ప్రజలెవరూ అడవుల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు. పశువులు, జీవాలపై పులి దాడిచేస్తే తాము పరిహారం చెల్లిస్తామని... ఎవరు కూడా పులికి హాని చేసే చర్యలకు పాల్పడవద్దని సూచిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ అడవి మార్గంలో వెళ్లొద్దని.. ఒక్కొక్కరుగా బయటకు వెళ్లవద్దని సూచించారు. పశువుల కాపర్లు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఇదీ చదవండి: Tiger Roaming in Yellandu: ఇల్లందులో పులి కలకలం.. మూడు రోజులుగా ముప్పుతిప్పలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.