ETV Bharat / state

నేటి నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు

author img

By

Published : Apr 2, 2022, 5:38 AM IST

Updated : Apr 2, 2022, 6:44 AM IST

thiru kalyaana brahmothsavaalu
thiru kalyaana brahmothsavaalu

Thirukalyana brahmotsavam: భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాల సందడి మొదలైంది. నేటి నుంచి ఈనెల 16 వరకు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో 9న ఎదుర్కోలు, 10న కల్యాణం, 11న పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

Thirukalyana brahmotsavam: భద్రాద్రి పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఘడియలు దగ్గర పడ్డాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్ల నుంచి సీతారాముల కళ్యాణం, ముక్కోటి ఏకాదశి వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. అయితే కరోనా ప్రభావం తగ్గడంతో భక్తుల మధ్య రామయ్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి ఈనెల 16 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాలు సహా దేశనలుమూలల నుంచి భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు సేదతీరేందుకు చలువ పందిళ్లు, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు.

సర్వాంగ సుందరంగా..: నేటి నుంచి రామయ్య బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. తొలిరోజు నూతన సంవత్సర వేడుకలతో తిరువీధి సేవలు ప్రారంభమవుతాయి. ఆరో తేదీన అంకురార్పణ అనంతరం అభిషేకం, ధ్వజపట లేఖనం, ధ్వజపటం ఆవిష్కరణ జరుగుతాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలు అయినా ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 11న మహా పట్టాభిషేకాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి కల్యాణం నిర్వహించే మిథిలా మండపం వద్ద భక్తుల కోసం ప్రత్యేక సెక్టార్​లను ఏర్పాటు చేస్తున్నారు.

తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత..: సీతారాముల కల్యాణ మహోత్సవంలో వినియోగించే తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా రోజువారి నిత్య కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలు పసుపురంగులో ఉంటాయి. అయితే ఏడాదికోసారి నిర్వహించే కల్యాణ మహోత్సవాల్లో మాత్రం తలంబ్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. భద్రాద్రిలో ఈ తలంబ్రాలను ప్రత్యేకంగా తయారు చేస్తారు. బియ్యంలో పసుపు, కుంకుమ, నెయ్యి, బుక్కా, గులాములు, సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేస్తారు. ఇలా తలంబ్రాలను తయారుచేయడం భక్త రామదాసు కాలం నుంచి ఆచారంగా వస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భక్తులు.. వడ్లను గోటితో వలిచి సీతారాముల కల్యాణంలో వినియోగించేందుకు భద్రాచలం తీసుకువస్తున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, వరంగల్, కరీంనగర్, కొత్తగూడెం, మణుగూరు, హైదరాబాద్​లోని భక్తులు గోటితో వలిచిన వడ్లను స్వామివారికి సమర్పిస్తున్నారు.

వేడుకల కోసం 3 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. 175 క్వింటాళ్ల తలంబ్రాలు తయారు చేశారు. 60 కౌంటర్లలో వీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఇవి కాకుండా 2.5 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను ఆర్టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా బుక్‌ చేసుకున్న వారికి పంపిస్తారు. నేరుగా కౌంటర్లలోనూ విక్రయించనున్నారు.

శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జిల్లా కలెక్టర్​ అనుదీప్​ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. మిథిలా ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లును అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులందరికీ అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు.

ఇదీచూడండి: Ugadi 2022: ఉగాడి పచ్చడి షడ్రుచుల్లో దాగున్న ఆరోగ్యం!

Last Updated :Apr 2, 2022, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.