ETV Bharat / state

Bhadrachalam: సీతారామ కల్యాణానికి 180 క్వింటాళ్ల తలంబ్రాలు

author img

By

Published : Mar 5, 2023, 8:01 PM IST

భద్రాద్రి
భద్రాద్రి

Sri Ramanavami celebrations in Bhadrachalam: భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీరామచంద్రుడినీ పెళ్లికొడుకుని చేసే వేడుక ఆసన్నమైంది. మార్చి 30న సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగనుంది. భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 180 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Sri Ramanavami celebrations in Bhadrachalam: సీతారామ కల్యాణ పనులు ఈనెల 7న పాల్గున పౌర్ణమి నాడు శ్రీకారం చుట్టునున్నారు. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రోలు, రోకలికి పూజలు చేసి పసుపు కొమ్ములు దంచి పనులు ప్రారంభిస్తారు. తదుపరి సీతారాముల కల్యాణానికి వాడే తలంబ్రాలను తయారు చేస్తారు. అదే రోజు డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలు నిర్వహించనున్నారు.

ప్రతి ఏడాది ఈ ఉత్సవాన్ని చిత్రకూట మండపంలో నిర్వహించే ఆలయ అధికారులు... ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని భావించి ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో కల్యాణానికి వాడే తలంబ్రాలు పసుపు రంగులో ఉంటాయి కానీ భద్రాద్రి రామయ్య సన్నిధిలో వాడే తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగులో ఉంటాయి.

భక్త రామదాసు కాలం నుంచి అప్పటి తానీషా ప్రభువు పంపించే బుక్కా గులాబులు, నెయ్యి, పసుపు, సుగంధ ద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేస్తారు.
తలంబ్రాలు కలిపే వేడుకలో ముత్తైదువులు అధిక సంఖ్యలో పాల్గొని తలంబ్రాలు కలవటానికి పోటీపడతారు. ఆరోజు నుంచి మార్చి 30న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి పనులు ప్రారంభించనున్నారు.

ఈసారి లక్షల సంఖ్యలో భక్తులు కళ్యాణ మహోత్సవానికి హాజరుకానున్న నేపథ్యం లో భక్తులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు 180 క్వింటాళ్ల తలంబ్రాలను తయారు చేయాలని ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణానికి వచ్చే భక్తుల అంచనాను బట్టి రెండు లక్షల వరకు లడ్డు ప్రసాదాన్ని తయారు చేయడానికి నిర్ణయించారు.

శ్రీరామ కల్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలకు ఆన్​లైన్​లో పాటు భద్రాచలం దేవస్థానం వద్ద గల వివిధ ప్రాంతాల్లో భక్తులకు నేరుగా టికెట్లను విక్రయించనున్నారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణం సన్నాహిక బ్రహ్మోత్సవాలు మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 22 నుంచి ఎప్రిల్ 5 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

అయితే ఈసారి జరిగే పట్టాభిషేకం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకమని ఈ వేడుకకు ప్రత్యేక హోమాలు, పూజలు ఉంటాయని ఆలయ వైదిక కమిటీ తెలిపింది. బ్రహ్మోత్సవాల్లో మార్చి 29 న ఎదుర్కోలు మహోత్సవం, 30న సీతారాముల కల్యాణం, 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకలు జరగనున్నాయి.
ఈనెల 22 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా 22 నుంచి ఏప్రిల్ 5 వరకు నిత్య కల్యాణ వేడుక నిలిపివేయనున్నారు. నవమికి ప్రధానంగా జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పటికే జిల్లా అధికారులతో కలెక్టర్ ఆనుదీప్ సమావేశమై ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కల్యాణ పనుల ప్రారంభ వేడుకలకు దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ హాజరుకానున్నారు.

భద్రాచలంలో సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.