ETV Bharat / state

Bharat Bandh Today: కేంద్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోన్న సమ్మె

author img

By

Published : Mar 28, 2022, 9:35 AM IST

Updated : Mar 28, 2022, 3:21 PM IST

Singareni and RTC employees participating in Bharat Bandh Today
Singareni and RTC employees participating in Bharat Bandh Today

Bharat Bandh Today: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ..... జాతీయ కార్మికసంఘాల పిలుపుమేరకు రాష్ట్రంలో సమ్మె సాగుతోంది. రెండు రోజుల నిరసనలో భాగంగా తొలిరోజు ర్యాలీలు, ఆందోళనలతో హోరెత్తించారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల నిరసనతో గనులు బోసిపోయాయి.

Bharat Bandh Today: దేశవ్యాప్త రెండు రోజుల కార్మిక సమ్మెలో భాగంగా రాష్ట్రంలో.. కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హైదరాబాద్‌లో ఎల్​ఐసీ సౌత్‌ సెంట్రల్‌ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన తెలిపారు. 32లక్షల కోట్ల నికర ఆస్తులున్న జీవితాబీమా సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రచేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. ‍కుత్భుల్లాపూర్‌లో జరిగిన సమ్మెకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ సంఘీభావం తెలిపారు. సంగారెడ్డి పటాన్‌చెరులో రాస్తారోకో ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పాల్గొన్నారు. జహీరాబాద్‌లో కార్మికులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బోరబండలో జీహెచ్​ఎంసీ సిబ్బంది ర్యాలీ చేశారు. పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

బోసిపోయిన సింగరేణి..: కార్మికుల సమ్మెతో సింగరేణిలో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసర సిబ్బంది మినహా కార్మికులెవరూ విధులకు హాజరుకాలేదు. భూపాలపల్లి, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌, రామగుండం ఏరియాల్లో సంస్థ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ జరగనివ్వబోమని కార్మికులు స్పష్టం చేశారు. సమ్మెతో సింగరేణి వ్యాప్తంగా సుమారు 32కోట్ల నష్టం వాటిల్లుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాల్లోనూ సమ్మె ప్రభావం..: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ సమ్మె ప్రభావం కనిపించింది. ఖమ్మంలో బస్‌ డిపో ఎదుట బైఠాయించి సీపీఎం నాయకులు నిరసన తెలిపారు. భద్రాచలంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. వైరా నియోజకవర్గంలోని పలు మండలాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. కరీంనగర్‌లో నిరసన ప్రదర్శన చేశారు. కార్మికులను బానిసలుగా మార్చేలా కేంద్ర చట్టాలు ఉన్నాయంటూ రాష్ట్రవ్యాప్తంగా సంఘాలు నిరసనలు తెలిపాయి. రేపు కూడా ఆందోళనలు కొనసాగనున్నాయి. కేంద్రం దిగిరాకుంటే మరింత ఉద్ధృతంగా పోరాడతామని కార్మిక సంఘాలు హెచ్చరించాయి.

ఇదీ చూడండి: మళ్లీ పెరిగిన చమురు ధరలు.. వారం రోజుల్లో ఆరో సారి

Last Updated :Mar 28, 2022, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.