పొంగులేటి రాజకీయ అడుగులపై సర్వత్రా ఆసక్తి

author img

By

Published : Jan 10, 2023, 12:03 PM IST

Ponguleti Srinivasa Reddy

Ponguleti Srinivasa Reddy news : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అడుగులపై తీవ్ర చర్చ నడుస్తోంది. పొంగులేటి పార్టీ మారుతున్నారనే ఊహాగానాలు ఊపందుకుంటున్న వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ పినపాక నియోజకవర్గంలో జరగనున్న ఈ సమావేశంలో ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Ponguleti Srinivasa Reddy news : ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఓవైపు ఈ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతుండగా.. మరోవైపు నేటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ అడుగులపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

Ponguleti Srinivasa Reddy update : నేటి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఆత్మీయ సమావేశాలు జరగనున్నాయి. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని పొంగులేటి నిర్ణయించారు. నేడు పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మొదటి సమ్మేళనం జరగనుంది. ఆత్మీయ భేటీకి భారీగా జన సమీకరణకు పొంగులేటి వర్గం ఏర్పాట్లు చేస్తోంది.

పొంగులేటి ప్రసంగంపై ఆసక్తి.. ఈ ఆత్మీయ భేటీలో పొంగులేటి ప్రసంగంపై సర్వత్రా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు నిన్న ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం కేసీఆర్ భేటీలో పొంగులేటి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈనెల 18న జరగనున్న ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ కూడా ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

నగరం నడిబొడ్డున ఆ కండువా కప్పుకుంటా.. మరోవైపు సోమవారం రోజున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరరావు ఇంటి వద్ద కార్యకర్తలతో పొంగులేటి కాసేపు ముచ్చటించారు. ఒక వేళ బీఆర్ఎస్‌ను వీడాల్సి వస్తే దిల్లీలోనో, అమెరికాలోనో దొంగచాటుగా కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఖమ్మం నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకొంటానని తెలిపారు. ‘ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు తాను బీఆర్‌ఎస్‌ను వీడుతున్నానని మీడియానే ప్రచారం చేస్తోందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.