ETV Bharat / state

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం

author img

By

Published : Mar 14, 2021, 10:37 PM IST

Updated : Mar 14, 2021, 10:45 PM IST

graduates mlc polling in khammam district
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం

పట్టభద్రుల చైతన్యం వెల్లివిరిసింది. విద్యావంతులు ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. మండుటెండలను లెక్కచేయకుండా గంటల తరబడి వరుసలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ పట్టభద్రులు ఓటుకు దూరంగా ఉంటారనే అపవాదును చెరిపేశారు. ఖమ్మం జిల్లాలో 74.35 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 73.37 శాతం పోలింగ్ నమోదైంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా మండల, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్​ కేంద్రాలకు భారీగా తరలొచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబయిలో ఉద్యోగం చేస్తున్నవారు.. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలో భాగంగా ఇళ్ల వద్ద ఉంటున్నారు. వారందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉభయ జిల్లాల్లోనూ ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు కష్టాలు తప్పలేదు. అడుగడుగునా పోలీసు ఆంక్షలు ఎదురవటంతో పలుచోట్ల పట్టభద్రులంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రేమేందర్​ రెడ్డిపై దాడి!

ఖమ్మం ఎస్​ఆర్​అండ్​బీజీఎన్​ఆర్ కళాశాల పోలింగ్ కేంద్రం సమీపంలో తన అనుచరులతో కలిసి ఉన్న కాంగ్రెస్ నాయకుడు మిక్కిలినేని నరేందర్​ను రెండో పట్టణ పోలీసులు స్టేషన్​కు తీసుకెళ్లడం వివాదానికి దారితీసింది. నరేందర్​ను స్టేషన్​కు తీసుకెళ్లారన్న సమాచారంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఇతర నేతలంతా పోలీస్ స్టేషన్​కు వేళ్లారు. ఏసీపీ ఆంజనేయులు, ఇతర పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు నరేందర్​ను స్టేషన్ నుంచి బయటకు పంపటంతో వివాదం సద్దుమణిగింది. మహబుబాబాద్‌ జిల్లా నెల్లికుదురులో జరిగిన దాడిలో గాయపడ్డ భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డిని ఆ పార్టీ నాయకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డబ్బులు పంచుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించగా తెరాస కార్యకర్తలు తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ప్రేమేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనపై దాడిని భాజపా నేతలు తీవ్రంగా ఖండించారు.

డబ్బులు పంపిణీ

ఇల్లందు సింగరేణి సీఈఆర్ క్లబ్​లో అధికార పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. అక్కడి నుంచి ఓటర్లను పంపించేశారు. చెరువుకట్ట మామాడి తోటలో గ్రామాల నుంచి వచ్చే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుండగా పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు.

టెండర్ ఓటు

ఇల్లందు సింగరేణి ఉన్నత పాఠశాలలో ఓటు వేసేందుకు వచ్చిన మహిళకు చుక్కెదురైంది. అప్పటికే మహిళ ఓటు వేరే మహిళ వేసినట్లు అధికారులు గుర్తించారు. పోలింగ్ అధికారుల దృష్టికి విషయం తీసుకెళ్లడంతో ఆమెకు టెండర్ ఓటు వేసే అవకాశం కల్పించారు. భద్రాచలంలో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతుండగానే ఓటర్లకు డబ్బుల పంపిణీ సాగింది. ఓ నిత్యాన్నదాన సత్రం వద్ద బారులు తీరిన ఓటర్లు.. రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిళాల కోసం పడిగాపులు పడ్డారు. డబ్బులు ఇచ్చిన తర్వాతే వెళ్లి ఓటేశారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలోనూ డబ్బుల పంపిణీ జోరుగా సాగింది. మణుగూరులో తెరాస-ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టణంలో పోలింగ్ కేంద్రానికి ఎదురుగానే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంది.

వ్యక్తిపై కేసు

పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయాలని, ఓటర్లను ప్రలోభపెడుతున్నారంటూ కాంగ్రెస్, భాజపా, సీపీఐ, తెదేపా, సీపీఎం, ఎన్డీ నాయకులు ఆందోళన చేశారు. క్యాంపు కార్యాలయం మూసేయాలని లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బూర్గంపాడులో ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయగా ఓ వ్యక్తిపై కేసు నమోదైంది.

ఇదీ చదవండి: ఒకే కుటుంబంలో 14 మందికి కరోనా

Last Updated :Mar 14, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.