ETV Bharat / state

GOVERNOR: కొండరెడ్ల అభివృద్ధి నా కల: గవర్నర్​

author img

By

Published : Apr 13, 2022, 5:57 AM IST

GOVERNOR: ఆదివాసీ, గిరిజన, కొండరెడ్లు అడవుల నుంచి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. అడవులే జీవన విధానంగా సాగుతున్న వారికి వైద్యం, విద్య, ఉపాధి మార్గాలు అందినప్పుడే నిజమైన ప్రగతి సాధిస్తారని స్పష్టం చేశారు. వారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భద్రాద్రి జిల్లాలో రెండ్రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు.

GOVERNOR: కొండరెడ్ల అభివృద్ధి నా కల: గవర్నర్​
GOVERNOR: కొండరెడ్ల అభివృద్ధి నా కల: గవర్నర్​

GOVERNOR: కొండరెడ్ల సంపూర్ణ అభివృద్ధి తన జీవిత కాల స్వప్నమని గవర్నర్‌ తమిళిసై అన్నారు. గిరిజనుల్లో గుర్తించిన పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కృషి చేస్తానని, సేవా దృక్పథంతో కూడిన కార్యక్రమాలను అమలుచేసేందుకు చెంచు, గోండుల గ్రామాలను ఎంపికచేస్తున్నానని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మారుమూల కొండరెడ్ల గిరిజన గ్రామం పూచికుంటలో మంగళవారం గవర్నర్‌ పర్యటించారు. అక్కడి అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న గోగులపూడి, పూచికుంట కమ్యూనిటీ భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యవసర సమయంలో గర్భిణులను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకుగానూ రెండు ఆటోలను అందజేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడి గర్భిణులకు వైద్యం చేశారు. గ్రామంలోని మోడల్‌ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాల విద్యార్థులతో ముచ్చటించారు. తర్వాత గ్రామంలోని ఓ కొండరెడ్ల ఇంట్లోకి వెళ్లి అక్కడి మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కొండరెడ్ల అభివృద్ధి నా కల: గవర్నర్​

‘తమ ఇళ్లు కూలే స్థితిలో ఉన్నాయని, వర్షాకాలంలో కొండపై నుంచి వరద గ్రామంపై పడుతోందని’ వారు గవర్నర్‌ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేయించాలని అభ్యర్థించారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో తమిళిసై మాట్లాడుతూ, గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన గూడేన్ని సందర్శించానని, అక్కడి ప్రజల్లో పోషకాహార లోపం ఉన్నట్లు అప్పుడే గుర్తించానన్నారు. అందుకే ఆదిమ గిరిజనుల్లో పోషకాహార లోప నివారణ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. గోగులపూడి, పూచికుంట గ్రామాల అభివృద్ధిగానూ రూ.45 లక్షల చెక్కును అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లుకు అందజేశారు. గవర్నర్‌ పర్యటనకు వచ్చిన గోగులపూడి, పూచికుంట వాసులు, ఇతర ప్రజలు, అధికారుల కోసం గ్రామంలో ప్రత్యేకంగా వంటలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ కొద్దిసేపు వంటలూ చేశారు. అందరితో కలిసి భోజనం చేశారు.

కనిపించని కీలక అధికారులు..ఎమ్మెల్యే

గవర్నర్‌ జిల్లాకు వచ్చి రెండు రోజులపాటు ఉన్నా కలెక్టర్‌, ఎస్పీ, ఐటీడీఏ పీవో వంటి అధికారులు అటువైపు చూడలేదు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావూ దూరంగానే ఉన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని గిరిజన గ్రామాలను గవర్నర్‌ దత్తత తీసుకున్నా, ఎమ్మెల్యే స్పందించకపోవడం ఏమిటని పలువురు గిరిజన సంఘాల నాయకులు విమర్శించారు.

.

గోండుల గోడు విన్నా..

కొత్తగూడెంలో రాత్రి విలేకరుల సమావేశంలోనూ గవర్నర్‌ మాట్లాడారు. ‘‘రెండు రోజుల జిల్లా పర్యటనలో అటవీ ప్రాంతంలో 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించి గోండులను కలిశాను. వారి గోడు విన్నాను. నిస్వార్థం, సున్నిత మనస్తత్వం, అమాయకత్వంతో కూడిన గిరిజన సంప్రదాయం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్య సదుపాయాలతోపాటు పౌష్టికాహార లోపాన్ని నివారించే కార్యక్రమాలపై శ్రద్ధ చూపుతా. పల్లెల్లో వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన సిబ్బంది, వైద్యులను గుర్తించి జూన్‌ 2న రాజ్‌భవన్‌లో సత్కరిస్తానని’’ వివరించారు. ప్రొటోకాల్‌ విషయాన్ని విలేకర్లు ప్రస్తావించగా ‘‘వివాదం ఏమీ లేదని’’ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రొటోకాల్‌ కంటే జనం చూపించిన అభిమానం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. అనంతరం గవర్నర్‌ అశ్వాపురం సమీపంలోని భారజల ప్లాంటును సందర్శించారు.

అనంతరం రైలు మార్గంలో ఇవాళ తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఇవీ చూడండి:

123 మంది గిరిజన గర్భిణులకు గవర్నర్‌ సీమంతం

విద్యార్థులకు గుడ్​న్యూస్​.. ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.