ETV Bharat / state

ETV Bharath Effect: చేవెళ్ల ఎంపీ సాయం.. తీరింది రైతు కష్టం..

author img

By

Published : Jun 16, 2021, 4:56 PM IST

ఈనాడు-ఈటీవీ భారత్​(ETV Bharath Effect)లో వచ్చిన కథనంపై స్పందించిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాడెద్దు లేక కన్న కొడుకుతో పొలం దున్నిన కోవ అభిమాన్‌కు ఎద్దును కొనిచ్చారు.

mp ranjith reddy
ఎంపీ రంజిత్​ రెడ్డి, ఆదిలాబాద్​

ఆదిలాబాద్​ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్​కు చెందిన ఆదివాసీ రైతు కోవ అభిమాన్​కు ఆరెకరాల పొలం ఉంది. ఖరీఫ్ పనులు వేగవంతం కావటంతో తనకున్న ఎద్దులతో పొలాన్ని దున్నుతుండగా.... ఆదివారం అనారోగ్యంతో ఓ ఎద్దు చనిపోయింది. మరో ఎద్దును కొనుగోలు చేయాలంటే.... కనీసం రూ.40 వేలు ఖర్చుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. సొమ్ము లేకపోవటంతో పాటు వర్షాల పడే సమయం దాటిపోకుండా పొలాన్ని దున్నాలనుకున్న అభిమాన్‌.... ఉన్న ఒక్క ఎద్దుతోపాటు మరోవైపు తన కుమారుడు సాయినాథ్‌ను కాడిలా మార్చి పొలం దున్నాడు. ఇదే విషయమై ఈటీవీ భారత్​లో కన్న కొడుకే కాడెద్దయ్యాడు.. తండ్రి కష్టాన్ని ఒడ్డు దాటించాడు..! అనే కథనం వచ్చింది. ఈ కథనం చూసిన ఎంపీ రంజిత్‌ రెడ్డి(chevella mp) వారికి ఎద్దు కొనివ్వటానికి ముందుకొచ్చారు.

స్థానిక పశువైద్యుడు డాక్టర్ సతీష్‌ ఇంద్రవెల్లిలో జరిగిన పశువుల సంతలో ఒక చురుకైన ఎద్దు కొనుగోలు చేసి ఆ రైతు కుటుంబానికి అందజేశారు. ఎంపీ... "గూగుల్ పే" ద్వారా పంపిన 40 వేల రూపాయలు వెచ్చించి ఎద్దు కొనుగోలు చేసిన పశు వైద్యుడు.. అభిమాన్​ ఇంటికి వెళ్లి అందజేయటంతో ఆ రైతు కుటుంబం సంతోషంతో తబ్బిబ్బైంది. ఎంపీ రంజిత్‌రెడ్డికి రైతు అభిమాన్, కొడుకు సాయినాథ్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చదవండి: Chevella mp: అన్నదాత దీనగాధపై ఎంపీ స్పందన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.