ETV Bharat / sports

పతకాల్లో అగ్రస్థానం దక్కేది ఎవరికి?

author img

By

Published : Aug 7, 2021, 7:14 AM IST

tokyo olympic medals list
టోక్యోలో పతకాల పట్టిక

ఒలింపిక్స్‌ అంటే అమెరికాదే ఆధిపత్యం. ఎప్పుడు జరిగినా అత్యధిక పతకాల రేసులో అగ్రస్థానం కోసం మిగతా జట్లన్నింటికీ అమెరికాతోనే పోటీ. ఈసారి కూడా సీన్‌ మారలేదు. కాకపోతే ఆఖరికి అమెరికా నంబర్‌వన్‌ స్థానంలో ఉంటుందా అన్నదే అనుమానంగా మారింది. పతకాల పట్టికలో 36 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉన్న చైనా ఆ జట్టుకు షాకిచ్చేలానే కనిపిస్తోంది. చివరి రెండు రోజుల్లో 47 క్రీడాంశాల్లో పతక విజేతలెవరో తేలే అవకాశం ఉండటం వల్ల.. అగ్రపీఠం కోసం ఈ రెండు దేశాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకు 28 సార్లు ఒలింపిక్స్‌ విజయవంతంగా ముగియగా.. అందులో 17 సార్లు అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌ (7) రెండో స్థానంలో ఉంది. ఫ్రాన్స్‌, బ్రిటన్‌, జర్మనీ, చైనా.. ఒక్కో ఒలింపిక్స్‌లో అత్యధిక పసిడి పతకాలు సాధించాయి. ఈసారి అంతా అమెరికాదే అగ్రస్థానం అని భావించారు. కానీ చైనా నుంచి కఠిన సవాలు ఎదురవుతోంది. శుక్రవారం నాటికి 36 స్వర్ణాలు, 26 రజతాలు, 17 కాంస్యాలతో కలిసి మొత్తం 79 పతకాలతో చైనా మొదటి స్థానంలో ఉంది. 31 బంగారు, 36 వెండి, 31 కంచు పతకాలు కలిపి అమెరికా మొత్తం 98 పతకాలతో రెండో స్థానంలో ఉంది. అత్యధిక పతకాల పరంగా చూసుకుంటే అమెరికానే ముందు వరుసలో ఉన్నప్పటికీ.. స్వర్ణాల సంఖ్యపైనే అగ్రస్థానం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే పసిడి పతకాల సంఖ్యలో రెండు దేశాల మధ్య తేడా అయిదే.

అవే దెబ్బకొట్టాయి..

టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రధానంగా స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌, జిమ్నాస్టిక్స్‌లో ఎదురు దెబ్బలు తగిలాయి. అథ్లెటిక్స్‌ ట్రాక్‌ విభాగంలో ఆ దేశ అథ్లెట్లతో పాటు రిలే జట్లూ విఫలమయ్యాయి. గత రియో క్రీడల్లో అథ్లెటిక్స్‌లో ఆ దేశానికి 13 స్వర్ణాలు రాగా.. టోక్యోలో మాత్రం ఇప్పటివరకూ 5 బంగారు పతకాలే దక్కాయి. ఇక గత కొన్ని ఒలింపిక్స్‌ల్లో దిగ్గజ స్విమ్మర్‌ ఫెల్ఫ్స్‌ పసిడి మోత మోగించడంతో కొలనులో అమెరికాకు తిరుగులేకుండా పోయింది. కానీ అతను ఈతకు దూరం కావడం, అంచనాలు పెట్టుకున్న కొంతమంది స్విమ్మర్లూ రాణించకపోవడం టోక్యోలో ప్రభావం చూపింది. 2016 ఒలింపిక్స్‌లో ఏకంగా 16 స్వర్ణాలతో అప్పుడు దేశానికి అత్యధిక పతకాలు అందించిన క్రీడగా స్విమ్మింగ్‌ నిలిచింది. కానీ ఈ సారి మాత్రం కొలనులో అమెరికాకు ఆస్ట్రేలియా (9 స్వర్ణాలు) అడ్డుకట్ట వేసింది. టోక్యో స్విమ్మింగ్‌లో అమెరికాకు 11 బంగారు పతకాలే దక్కాయి. రియోలో జిమ్నాస్టిక్స్‌లో ఆ దేశానికి 4 స్వర్ణాలు రాగా.. ఈ సారి రెండు మాత్రమే ఖాతాలో చేరాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న సిమోన్‌ బైల్స్‌ 'ట్విస్టీస్‌' అనే మానసిక అనారోగ్యంతో కేవలం ఒక్క వ్యక్తిగత విభాగం ఫైనల్లోనే పోటీపడడం ఆ దేశాన్ని దెబ్బతీసింది.

అవే లాభం..

స్వదేశంలో నిర్వహించిన 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చైనా.. దేశం వెలుపల తొలిసారి ఆ ఘనత సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. టోక్యోలో డైవింగ్‌లో ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న డ్రాగన్‌ దేశం ఆరు స్వర్ణాలు ఖాతాలో వేసుకుంది. టేబుల్‌ టెన్నిస్‌లో గత ఒలింపిక్స్‌ ప్రదర్శనను పునరావృతం చేస్తూ 4 బంగారు పతకాలు గెలిచింది. జిమ్నాస్టిక్స్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ల్లో స్వర్ణాల సంఖ్యను అమాంతం పెంచేసుకుంది. రియో జిమ్నాస్టిక్స్‌లో ఒక్క పసిడి కూడా నెగ్గని చైనా.. ఇప్పుడు ఏకంగా నాలుగింటిని సొంతం చేసుకుంది. గత క్రీడలతో పోలిస్తే ఈ సారి అదనంగా షూటింగ్‌లో మూడు, వెయిట్‌లిఫ్టింగ్‌లో రెండు బంగారు పతకాలను అందుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాల అథ్లెట్లందరూ సాధన చేసేందుకు ఇబ్బందులు పడుతుంటే.. వైరస్‌ వ్యాప్తికి కారణమైన చైనా మాత్రం ముందుగానే దాని నుంచి బయటపడడంతో అక్కడి అథ్లెట్ల ప్రాక్టీస్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. పతకమంటే పసిడి గెలవడమే అని తమ ఆటగాళ్ల మనసులో చైనా బలంగా నాటడమూ ఆ దేశ ఆధిపత్యానికి మరో కారణం.

ఇదీ చదవండి:చరిత్ర తిరగరాయడానికి అడుగు దూరంలో భారత గోల్ఫర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.