US Open: ఎమ్మా రదుకాను ఆట చూడతరమా!

author img

By

Published : Sep 13, 2021, 12:31 PM IST

Emma Raducanu

యూఎస్‌ ఓపెన్ మహిళల సింగిల్స్‌ విభాగంలో విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది ఎమ్మా రదుకాను. అగ్ర క్రీడాకారిణులను మట్టికరిపించి.. ఎమ్మా తన రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే టైటిల్‌ నెగ్గింది. దీంతో 17 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో ఆమె రికార్డులపై ఓ లుక్కేద్దాం..

యూఎస్‌ ఓపెన్ మహిళల సింగిల్స్‌ విభాగంలో క్వాలిఫయర్‌గా అడుగు పెట్టి విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది ఎమ్మా రదుకాను. ఫైనల్లో కెనాడా క్రీడాకారిణి లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. 1999 తర్వాత ఇద్దరు టీనేజర్ల మధ్య సాగిన ఈ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ పోరు ఆద్యాంతం హోరాహోరీగా జరిగింది. ఫైనల్‌ చేరే క్రమంలో రదుకాను.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ బెన్సిచ్‌, సకారి లాంటి క్రీడాకారిణులను చిత్తుచేసింది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఒసాకా, కెర్బర్‌, స్వితోలినా, సబలెంకా వంటి అగ్రశ్రేణి క్రీడాకారిణులను మట్టికరిపించింది. ఈ క్రమంలోనే ఫైనల్లో 73వ ర్యాంకులో ఉన్న ఫెర్నాండెజ్‌ను ఓడించింది. దీంతో 17 ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. ఎమ్మా గురించి మరికొన్ని ఆసక్తికర విశేషాలు..

ఎమ్మా తన రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే టైటిల్‌ నెగ్గింది. అతి తక్కువ గ్రాండ్‌స్లామ్‌ల అనుభవంతో విజేతగా నిలిచిన క్రీడాకారిణిగా రికార్డు సొంతం చేసుకుంది. ఈ ఏడాది వింబుల్డన్‌లో ఆమె నాలుగో రౌండ్‌ వరకూ వెళ్లగలిగింది. తనకు ఇదే తొలి యూఎస్‌ ఓపెన్‌.

150వ ర్యాంకర్‌గా ఈ టోర్నీలో అడుగు పెట్టిన ఎమ్మా హేమాహేమీలను ఓడించింది. ఈ క్రమంలోనే 2014లో సెరెనా విలియమ్స్‌ తర్వాత ఒక్క సెట్‌ కూడా కోల్పోకుండా యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన తొలి మహిళా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.

2004లో 17 ఏళ్ల వయసులో మారియా షరపోవా వింబుల్డన్‌ టైటిల్‌ సాధించిన తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌లో విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కురాలిగా ఈ బ్రిటిష్‌ చిన్నది చరిత్ర సృష్టించింది.

ఈ విజయంతో ఎమ్మా.. ట్రోఫీతో పాటు దాదాపు రూ.18.38 కోట్లు (2.5 మిలియన్ల అమెరికా డాలర్లు) నగదు బహుమతి కూడా సొంతం చేసుకుంది. రన్నరప్‌ ఫెర్నాండెజ్‌ సుమారు రూ.9.19 కోట్లను అందుకుంది.

1977 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ గెలిచిన తొలి బ్రిటీష్‌ అమ్మాయిగా ఎమ్మా రికార్డు సృష్టించింది. 44 ఏళ్ల క్రితం ఆ దేశానికి చెందిన వర్జీనియా వేడ్‌ వింబుల్డన్‌లో విజేతగా నిలిచింది.

ఇదీ చూడండి: US Open: జకోవిచ్‌కు నిరాశ.. యూఎస్‌ ఓపెన్‌ విజేతగా మెద్వెదెవ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.