ETV Bharat / sports

French Open: టైటిల్​ వేటలో నాదల్​కు ఎదురుందా?

author img

By

Published : May 30, 2021, 6:31 AM IST

Updated : May 30, 2021, 8:33 AM IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌ అంటే గుర్తొచ్చేది స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదలే(Nadal). అక్కడ అతడిది మామూలు ఆధిపత్యం కాదు. ఎర్రమట్టి కోర్టు ఆ వీరుడికి సలామ్‌ కొడుతుంది. ట్రోఫీ కూడా అలవాటుగా ముద్దాడమంటూ వచ్చి ఒద్దికగా అతడి చేతుల్లో వాలిపోతుంది. ఈ టోర్నీలో ఇతర ఆటగాళ్లు పోటీపడేది రన్నరప్‌గా నిలవడం కోసమేనని అనిపించేలా సాగుతోంది అతడి జైత్రయాత్ర. ఇప్పటికే రికార్డు స్థాయిలో 13 సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ను గెలిచిన ఈ క్లే కింగ్‌ మరోసారి టైటిల్‌ వేటకు సిద్ధమయ్యాడు. ఆదివారం ఆరంభమయ్యే టోర్నీలో అతణ్ని అడ్డుకోవడం జకోవిచ్‌(novak djokovic), ఫెదరర్‌(Federer) సహా ప్రత్యర్థులకు కష్టమైన పనే. మరోవైపు మహిళల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల కరవు తీర్చుకునేందుకు సెరెనా ఆరాటపడుతోంది.

Nadal
నాదల్​

ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open) టైటిల్‌ గెలవడం ద్వారా ఫెదరర్‌ (20 టైటిళ్లు)ను వెనక్కినెట్టి పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేతగా నిలవాలనుకుంటున్న నాదల్‌ ఈ సారి మూడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. నాదల్‌తో పాటు ఫెదరర్‌, జకోవిచ్‌ కూడా ఒకే పార్శ్వంలో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ ముగ్గురిలో ఎవరో ఇద్దరూ ఫైనల్లో తలపడాలని అభిమానులు ఆశిస్తారు. కానీ ఇప్పుడు సెమీస్‌కు ముందే వీళ్ల పోరాటాలు చూసే అవకాశం కలగనుంది. నాదల్‌ తొలి రౌండ్లో 21 ఏళ్ల ఆస్ట్రేలియా కుర్రాడు అలెక్సీ పొపిరిన్‌తో తలపడనున్నాడు. ఈ ఏడాదిలో క్లే కోర్టులో కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడిన ఫెదరర్‌ నుంచి ఈ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన ఆశించే పరిస్థితులు కనిపించట్లేదు. చివరగా 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడిన అతను సెమీస్‌లో వెనుదిరిగాడు. ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్న 39 ఏళ్ల ఫెదరర్‌కు సెమీస్‌ చేరే మార్గంలో జకోవిచ్‌ అడ్డంకిగా మారే అవకాశం ఉంది. క్వార్టర్స్‌లో ఈ దిగ్గజాలు తలపడే వీలుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో విజేతగా నిలిచి సీజన్‌ను గొప్పగా ఆరంభించిన జకో ఎప్పటిలాగే దూకుడు మీదున్నాడు. అయితే ఫ్రెంచ్‌ ఓపెన్‌కు వచ్చేటప్పటికి మాత్రం అతను కూడా నాదల్‌పై పైచేయి సాధించలేకపోతున్నాడు. నిరుడు రన్నరప్‌గా నిలిచిన జకో.. కేవలం ఒక్కసారి మాత్రమే (2016లో) ఇక్కడ టైటిల్‌ నెగ్గాడు.

Nadal
నాదల్​

కుర్రాళ్లు మెరిసేనా!:

నాదల్‌ సహా ఈ దిగ్గజ త్రయానికి సవాలు విసిరేందుకు మరోవైపు కుర్రాళ్లూ సిద్ధమయ్యారు. నాలుగో సీడ్‌ థీమ్‌తో పాటు జ్వెరెవ్‌, సిట్సిపాస్‌, మెద్వెదెవ్‌ ఆసక్తి కలిగిస్తున్నారు. ఆ ముగ్గురు దిగ్గజాలు ఒకే పార్శ్వంలో ఉండడంతో ఈ సారి ఫైనల్‌ చేరి.. టైటిల్‌ గెలిచేందుకు ఈ కుర్రాళ్లకు మంచి అవకాశం ఉంది. ఆరో సీడ్‌ జ్వెరెవ్‌ తన గత నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో మూడింట్లో కనీసం క్వార్టర్స్‌ వరకూ చేరాడు. ఇటీవల మాడ్రిడ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న అతను.. ఆ క్రమంలో నాదల్‌ను ఓడించడం విశేషం. మరోవైపు నిరుడు యుఎస్‌ ఓపెన్‌ తుదిపోరులో జ్వెరెవ్‌ను ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆస్ట్రియా ఆటగాడు థీమ్‌.. అప్పటి నుంచి అంచనాల మేర రాణించలేకపోతున్నాడు. అయిదో సీడ్‌ సిట్సిపాస్‌కు కాస్త తేలికైన డ్రానే ఎదురైంది. సెమీస్‌ చేరే క్రమంలో సిట్సిపాస్‌కు పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు.

djokovic
జకోవిచ్​, బార్టీ

క్యాన్సర్‌ నుంచి కోలుకున్న కార్లా సూరెజ్‌ (స్పెయిన్‌) ఫ్రెంచ్‌ ఓపెన్‌ బరిలో నిలిచింది. గతేడాది ఫిబ్రవరి తర్వాత ఆమె ఓ టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లోని ఫిలిప్‌ ఛాట్రియర్‌ కోర్టులో తొలిసారి రాత్రి పూట మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరితే చాలు నాదల్‌కు ఇక తిరుగుండదు. ఇప్పటివరకూ 13 సార్లు సెమీస్‌ ఆడిన అతను.. ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఫైనల్లోనూ అదే దూకుడు కొనసాగించి 13 సార్లూ విజేతగా నిలిచాడు. ఇప్పటివరకూ 16 సార్లు ఈ టోర్నీ బరిలో దిగిన అతను మూడు సార్లు మాత్రమే వట్టిచేతులతో వెనుదిరిగాడు. వరుసగా గత నాలుగు ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీల్లోనూ అతనే ఛాంపియన్‌.

నాదల్‌, ఫెదరర్‌ చెరో 20 టైటిళ్లతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల్లో సమానంగా అగ్రస్థానంలో ఉన్నారు. జకోవిచ్‌ 18 టైటిళ్లతో వాళ్ల వెనక రెండో స్థానంలో ఉన్నాడు.

అక్కడ హోరాహోరీ..

పురుషుల సింగిల్స్‌తో పోలిస్తే మహిళల సింగిల్స్‌ మరింత పోటాపోటీగా సాగడం ఖాయమనిపిస్తోంది. మార్గరెట్‌ కోర్ట్‌ (24 టైటిళ్లు) అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును సమం చేసేందుకు ఒక్క టైటిల్‌ దూరంలో ఉన్న 39 ఏళ్ల సెరెనా విలియమ్స్‌ ఈ టోర్నీలోనైనా ఆ ఘనత అందుకుంటుందేమో చూడాలి. ఆమెకు కఠిన పోటీ తప్పేలా లేదు. ప్రపంచ నం.1 ఆష్లీ బార్టీ, జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాక, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇగా స్వైటక్‌తో పాటు 17 ఏళ్ల కోకో గాఫ్‌, సబాలెంకా, స్వితోలిన, కెనిన్‌, హలెప్‌ టైటిల్‌ రేసులో ఉన్నారు. పోలెండ్‌ టీనేజర్‌ స్వైటక్‌ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉంది. 2019లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌ నెగ్గిన బార్టీ ఈ సారి పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. మరోసారి టైటిల్‌ గెలవాలని ఈ టాప్‌సీడ్‌ పట్టుదలగా ఉంది.

ఇదీ చూడండి పసిడికి అడుగు దూరంలో భారత బాక్సర్లు

Last Updated : May 30, 2021, 8:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.