ETV Bharat / sports

French Open: రెండో రౌండ్​కు నాదల్​, బార్టీ

author img

By

Published : Jun 2, 2021, 8:11 AM IST

Updated : Jun 2, 2021, 8:17 AM IST

ఒకవైపు సెట్‌ పోయింది.. మరోవైపు గాయం ఇబ్బంది పెడుతోంది! ప్రత్యర్థి జోరు మీదుంది! ఈ క్లిష్ట స్థితిలోనూ టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ(Ashleigh Barty) గట్టెక్కింది. పట్టుదలతో ఆడి ఫ్రెంచ్‌ ఓపెన్లో(French Open) తొలి రౌండ్‌ దాటింది. మరోవైపు 24వ టైటిల్‌పై గురిపెట్టిన అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ శుభారంభం చేయగా.. క్లే వీరుడు రఫెల్‌ నాదల్‌(Rafael Nadal) రెండో రౌండ్‌కు చేరాడు.

Ash Barty, Rafael Nadal Bag Wins, French Open
French Open: రెండో రౌండ్​కు చేరిన నాదల్​, బార్టీ

ఆస్ట్రేలియా తార బార్టీ(Ashleigh Barty) గట్టెక్కింది.. ఫ్రెంచ్‌ ఓపెన్లో(French Open)రెండో రౌండ్‌ చేరేందుకు ఈ ప్రపంచ నంబర్‌వన్‌ మూడు సెట్లు ఆడాల్సి వచ్చింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో బార్టీ 6-4, 3-6, 6-2తో అమెరికా అమ్మాయి బెర్నార్డా పెరాపై గెలిచింది. పెద్దగా ఇబ్బంది పడకుండానే తొలి సెట్‌ను గెలిచిన బార్టీ రెండో సెట్లో తడబడింది. మోకాలి గాయం బాధిస్తుండడం వల్ల కోర్టులో కదలడానికి చాలా ఇబ్బంది పడింది.

కాలికి కట్టు కట్టుకుని ఆడిన ఆమె 3-6తో సెట్‌ కోల్పోయింది. మూడో సెట్లో తీవ్ర ఒత్తిడిలో ఆడిన బార్టీ నెమ్మదిగా పుంజుకుంది. ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 4-2తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత అదే జోరుతో తర్వాత రెండు గేమ్‌లు కూడా సొంతం చేసుకుని సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది.

2019లో ఈ టోర్నీలో టైటిల్‌ గెలిచిన బార్టీ.. గతేడాది టోర్నీకి దూరమైంది. అయిదో సీడ్‌ స్వితోలినా కూడా ముందంజ వేసింది. ఆమె 6-2, 7-5తో బాబెల్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించింది. మ్లదనోవిచ్‌ (ఫ్రాన్స్‌), సకారి (గ్రీస్‌) కూడా తొలి రౌండ్‌ అధిగమించారు. మ్లదనోవిచ్‌ 6-4, 6-0తో సిమిద్లోవా (స్లోవేకియా)ను ఓడించగా.. సకారి 6-4, 6-1తో జవాస్కా (ఉక్రెయిన్‌)పై నెగ్గింది. అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ రెండో రౌండ్‌ చేరింది.

ఏడో సీడ్‌ సెరెనా 7-6 (8/6), 6-2తో ఇరినా బెగు (రొమేనియా)పై గెలిచింది. మరోవైపు అమెరికా స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌, ముగురుజ (స్పెయిన్‌) ఓడిపోయారు. తొలి రౌండ్లో వీనస్‌ 3-6, 1-6తో అలెగ్జాండ్రోవా (రష్యా) చేతిలో చిత్తు కాగా.. పన్నెండో సీడ్‌ ముగురుజ 1-6, 4-6తో మార్టా (ఉక్రెయిన్‌) చేతిలో ఓడింది. పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది.

రఫాకు ప్రతిఘటన..

14వ ఫ్రెంచ్‌ ఓపెన్‌పై గురిపెట్టిన క్లే కింగ్‌ రఫెల్‌ నాదల్‌(Rafael Nadal) రెండో రౌండ్‌ చేరాడు. తొలి రౌండ్లో ప్రత్యర్థి నుంచి అతడికి ప్రతిఘటన ఎదురైంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో మూడో సీడ్‌ నాదల్‌ 6-3, 6-2, 7-6 (7/3)తో అలెక్సీ పాప్రిన్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. తొలి రెండు సెట్లను సులభంగానే నెగ్గిన రఫాకు.. మూడో సెట్లో పాప్రిన్‌ పరీక్ష పెట్టాడు. ఒక దశలో 5-2తో సెట్‌ గెలిచేలా కనిపించాడు. కానీ తన శైలిలో పుంజుకున్న నాదల్‌.. సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించి విజయాన్ని అందుకున్నాడు.

మరోవైపు రష్యా కుర్రాడు రుబ్‌లెవ్‌కు షాక్‌ తగిలింది. ఈ ఏడో సీడ్‌ 3-6, 6-7 (6/8), 6-4, 6-3, 4-6తో స్ట్రాఫ్‌ (జర్మనీ) చేతిలో కంగుతిన్నాడు. మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌), ష్వార్జ్‌మాన్‌ (అర్జెంటీనా), కరాత్సెవ్‌ (రష్యా, డిమెనార్‌ (ఆస్ట్రేలియా) కూడా రెండో రౌండ్‌ చేరారు. పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న ముందంజ వేశాడు. తొలి రౌండ్లో బోపన్న-ఫ్రాంకో (క్రొయేషియా) జోడీ 6-4, 6-2తో బెంజిమన్‌ (జర్మనీ)-బాసిల్‌ష్వెలి (జార్జియా) జంటను ఓడించింది.

ఇదీ చూడండి: French Open: ఒసాకా వైదొలగడానికి కారణమిదేనా?

Last Updated :Jun 2, 2021, 8:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.