ETV Bharat / sports

జైలులో సుశీల్​ 'వీఐపీ' డిమాండ్!

author img

By

Published : Jul 4, 2021, 1:20 PM IST

మల్లయోధుడు సాగర్​ రానా హత్య కేసు నిందితుడు, స్టార్ రెజ్లర్​ సుశీల్ కుమార్ తీహార్ జైలు అధికారులకు లేఖ రాశాడు. తనకు టీవీ కావాలని అందులో డిమాండ్​ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్​కు సంబంధించి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపాడు.

sushil kumar, indian star wrestler
సుశీల్ కుమార్, భారత స్టార్ రెజ్లర్

మల్లయోధుడు సాగర్​ రానా(Sagar Rana) హత్య కేసు నిందితుడు, స్టార్ రెజ్లర్​ సుశీల్ కుమార్(Sushil Kumar) తీహార్ జైలు (Tihar Jail)లో తనకు టీవీ కావాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై అక్కడి అధికారులకు లేఖ రాశాడు. ప్రపంచవ్యాప్తంగా రెజ్లింగ్​కు సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.

దిల్లీలోని ఛత్రశాల్​ స్టేడియం(Chhatrasal stadium) దాడి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సుశీల్​ కుమార్.. జులై 9 వరకు తీహార్​ జైలులో జ్యూడిషియల్​ కస్టడీలో ఉండనున్నాడు. హత్య, కిడ్నాప్​ సంబంధిత సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదైంది.

ఇంతకుముందు కూడా..

గతంలోనూ భోజనశాలలో పెట్టే తిండితో సంతృప్తి చెందలేదు సుశీల్. రెజ్లింగ్‌లో కొనసాగుతున్న తనకు ప్రత్యేక ఆహారం కావాలంటూ కోర్టుకు విన్నవించాడు. ప్రొటీన్‌ మిల్క్‌షేక్‌, బలాన్నిచ్చే కొన్ని మాత్రలతో పాటు వ్యాయామ పరికరాలు కూడా తనకు అందించే ఏర్పాటు చేయాలని పేర్కొన్నాడు. దృఢమైన శరీరాకృతిని నిలుపుకోవాలంటే ప్రస్తుతం ఇచ్చేవి సరిపోవని.. ఇంకా బలమైన ఆహారం తీసుకోవడం సహా వ్యాయామం చేయాల్సిందే అని, కాబట్టి తనకు అవసరమైనవి అందజేయాలని అతను కోరాడు.

అసలేం జరిగింది?

దిల్లీ ఛత్రశాల్ మైదానంలో మే 4వ తేదీ అర్ధరాత్రి సుశీల్‌, ఆయన బృందం హాకీ బ్యాట్లు, క్రికెట్‌ బ్యాట్లతో తమపై దాడి చేసిందని క్షతగాత్రుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో సుశీల్‌ అక్కడే ఉన్నారని చెప్పారు. వారి కార్లలో హాకీ బ్యాట్లు, క్రికెట్‌ బ్యాట్లు ఉన్నాయని వెల్లడించారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఐదుకార్లు ఆపి ఉన్నాయి. వాటిల్లో ఉన్న ఒక స్కార్పియో కారులో తూటాలు నింపి ఉన్న డబుల్‌ బ్యారెల్‌ గన్‌, మూడు కార్ట్రిడ్జ్‌లు దొరికాయి. ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నారు. వారిలో సాగర్‌ చికిత్స పొందుతూ మరణించాడు. సుశీల్‌ బృందం చేసిన దాడిలో సోను మోనల్‌, అమిత్‌ కుమార్‌ అనే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.

​సుశీల్ కాంట్రాక్టు రద్దు..

హత్య కేసు ఆరోపణలతో రెజ్లర్ సుశీల్ సెంట్రల్​ కాంట్రాక్టును రద్దు చేసింది భారత రెజ్లింగ్ సమాఖ్య. సుశీల్​తో పాటు పూజా ధండాను కాంట్రాక్టు నుంచి తప్పించారు. వీరిద్దరికీ 2019లో సెంట్రల్​ కాంట్రాక్టులు దక్కాయి. అనంతరం వీరు ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. సుశీల్​ను భారతీయ రైల్వే శాఖ కూడా సస్పెండ్ చేసింది. మరో ప్రకటన చేసేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర రైల్వే స్పష్టం చేసింది. నార్తర్న్​ రైల్వేలో సీనియర్​ కమర్షియల్​ మేనేజర్​గా పని చేస్తున్నాడు సుశీల్.

ఇదీ చదవండి: Sushil kumar: సుశీల్​తో పోలీసుల సెల్ఫీ.. విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.