Jyothi Surekha Archery: రికార్డులు కొల్లగొట్టడం 'విల్లు'తో పెట్టిన విద్య!

author img

By

Published : Sep 26, 2021, 9:14 AM IST

Who is Jyothi Surekha Vennam? 10 things to know about India's star archer

టోర్నీ ఏదైనా.. పోటీలు ఎక్కడైనా.. జ్యోతి సురేఖ బరిలో(Jyothi Surekha Archery) దిగిందంటే కచ్చితంగా పతకం సాధించే తిరిగి వస్తుందనే నమ్మకం! చరిత్ర సృష్టించడం ఆమెకు అలవాటు. రికార్డులు బద్దలు కొట్టడం ఆమెకు విల్లుతో పెట్టిన విద్య.

టోర్నీలో గొప్పగా రాణించి.. మరో ఛాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన క్రీడాకారులున్నారు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి ఉసూరుమనించిన ప్లేయర్లూ ఉన్నారు. కానీ సురేఖ(Jyothi Surekha Archery) మాత్రం నిలకడకు మారుపేరుగా సాగుతోంది. అడుగుపెట్టిన ప్రతి టోర్నీలోనూ గొప్ప ప్రదర్శన కనబరుస్తోంది. విజయ కాంక్షను కొనసాగిస్తూ.. ఏకాగ్రత, పట్టుదలతో ఫలితాలు సాధిస్తోంది. ఆమె చిన్నప్పటి నుంచీ అంతే. బాల్యంలోనే ఆటలన్నా, సాహసాలన్నా ఇష్టం పెంచుకున్న సురేఖ.. నాలుగేళ్ల 11 నెలల వయసులోనే కృష్ణా నదిలో అడ్డంగా 5 కిలోమీటర్లు ఈది లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది.

11 ఏళ్ల వయసులో తొలిసారి విల్లు చేతబట్టి అంచలంచెలుగా ఎదిగి ఇప్పుడు దేశంలోనే అగ్రశ్రేణి కాంపౌండ్‌ ఆర్చర్‌గా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటుతోంది. కాంపౌండ్‌ ఆర్చరీలో మహిళల వ్యక్తిగత, జట్టు, మిక్స్‌డ్‌ విభాగాల్లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదిలోపు స్థానాలను సొంతం చేసుకున్న ఏకైక ఆర్చర్‌గా సురేఖ నిలిచింది. జాతీయ రికార్డు ఆమె పేరు మీదే ఉంది. 2017 ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో జట్టు రజతాన్ని అందుకున్న ఆమె.. 2019లో జట్టుతో పాటు వ్యక్తిగత కాంస్యాన్ని సొంతం చేసుకుంది.

ఆ నిరాశను దాటి..

తొలి దశ కరోనా కారణంగా గతేడాది దేశంలో లాక్‌డౌన్‌ విధించడం వల్ల సురేఖ తొమ్మిది నెలల పాటు ఇంటికే పరిమితమైంది. ఆ సమయంలో ఏకాగ్రత పెంచుకోవడం కోసం ధ్యానంపై ఎక్కువగా దృష్టి పెట్టింది. ప్రభుత్వం సడలింపులు ఇవ్వడం వల్ల ఓ వ్యవసాయ క్షేత్రంలో తిరిగి సాధన మొదలెట్టింది. మునుపటి స్థాయికి చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించింది. రోజుకు ఆరేడు గంటల పాటు ప్రాక్టీస్‌ చేసేది. జనవరిలో సెలక్షన్స్‌ ట్రయల్స్‌లో పాల్గొంది. కఠిన క్వారంటైన్‌, తరచూ కరోనా నిర్ధారణ పరీక్షల వల్ల ఇబ్బంది పడ్డప్పటికీ ఆటపై ఇష్టంతో భరించింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో గాటెమాలాలో ప్రపంచకప్‌ పోటీల కోసం విమానాశ్రయానికి వెళ్తున్న ఆర్చర్ల బస్సును అర్ధరాత్రి నడిరోడ్డుపై అర్ధంతరంగా ఆపేశారు. ఓ కోచ్‌కు తప్పుడు పాజిటివ్‌ ఫలితంతో కాంపౌండ్‌ ఆర్చర్లను టోర్నీకి పంపించలేదు. అందులో సురేఖ కూడా ఉంది. జాతీయ శిబిరానికి కూడా అనుమతించకపోవడం వల్ల అర్ధరాత్రి ఆమె దిల్లీ నుంచి బయల్దేరి విజయవాడ చేరుకుంది. ఈ సంఘటనతో ఆమె నిరాశకు గురైంది.

రెండు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆడే అవకాశం కోల్పోయినందుకు బాధ పడింది. కానీ దాని నుంచి త్వరగానే కోలుకున్నప్పటికీ పారిస్‌ ప్రపంచకప్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. కానీ ఆ తప్పుల నుంచి త్వరగానే పాఠాలు నేర్చుకుని మరింత మెరుగైంది. ఇప్పుడు ఒకే ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు పతకాలు సాధించిన తొలి భారత ఆర్చర్‌గా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మూడు విభాగాల్లోనూ(వ్యక్తిగత, జట్టు, మిక్స్‌డ్‌) పతకాలు గెలిచిన ఏకైక భారత ఆర్చర్‌గా కొనసాగుతోంది. అయితే ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో రాణిస్తున్న ఆమెకు.. ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం ఇప్పటికైతే లేదు. అందులో ఆమె పోటీపడే కాంపౌండ్‌ విభాగం లేకపోవడమే అందుకు కారణం.

ఇదీ చూడండి.. ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్​షిప్​లో భారత్​కు రెండు రజతాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.