ETV Bharat / sports

Vinesh Phogat: 'ఇంకా ఓటమి బాధలోనే.. ఇక రెజ్లింగ్ కష్టమే'

author img

By

Published : Aug 13, 2021, 4:23 PM IST

Updated : Aug 13, 2021, 4:50 PM IST

భారత స్టార్ మహిళ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. టోక్యో ఓటమి వల్ల ఇంకా బాధలోనే ఉన్నానని తెలిపింది. ఒంటరిగానే సమయాన్ని గడుపుతున్నానని చెప్పిన ఈమె.. ఒలింపిక్స్​లో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చింది.

vinesh phogat
వినేశ్ ఫొగాట్

టోక్యో ఒలింపిక్స్​లో తనపై వచ్చిన ఆరోపణల గురించి మహిళా స్టార్ రెజ్లర్​ వినేశ్ ఫొగాట్ స్పందించింది. సహచర అథ్లెట్లతో కలిసి ఉండకపోవడానికి గల కారణాలు వెల్లడించింది.

ఏడాది కాలంలో రెండుసార్లు కొవిడ్​ బారిన పడిన కారణంగానే.. ఒలింపిక్స్​లో సహచరులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వినేశ్​ వివరించింది. ఒలింపిక్స్​కు ముందు ప్రాక్టీస్​ కోసం హంగేరీ వెళ్లిన ఆమె.. ఈవెంట్​ సమయానికి టోక్యో చేరుకుంది. కొవిడ్​ నుంచి కోలుకున్నా తర్వాత తనకు జీర్ణ సంబంధ సమస్యలు వచ్చాయని, తన వల్ల తోటి అథ్లెట్లు ఇబ్బంది పడకూడదనే అలా వ్యవహరించినట్లు స్పష్టం చేసింది. గతేడాది ఆగస్టులో తొలిసారి కరోనా బారిన పడింది వినేశ్​. ఈ ఏడాది కజకిస్థాన్​ ఆల్మటీ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్​షిప్స్​ తర్వాత ఆమెకు మరోసారి కొవిడ్​ సోకింది.

Vinesh Phogat Explains Why She Did Not Stay with Indian Team at Tokyo Olympics
రెజ్లర్​ వినేశ్ ఫొగాట్

"ఇప్పటికే నేను రెండుసార్లు కొవిడ్ బారిన పడ్డాను. పైగా హంగేరీ నుంచి టోక్యోకు చేరుకున్నాను. వచ్చే క్రమంలో నాకు వైరస్​ సంక్రమిస్తే అది తోటి వాళ్లకు సోకే అవకాశం ఉంది. అప్పటికే భారత అథ్లెట్లు వారం రోజుల పాటు ప్రతిరోజు కొవిడ్​ టెస్టు చేయించుకుంటున్నారు. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదనే రెండు మూడు రోజుల వరకు వారితో కలవకూడదని నిర్ణయించుకున్నాను. తర్వాత వారితో ఉండాలనుకున్నాను. అప్పటికే సీమాతో ప్రాక్టీస్​లో కూడా పాల్గొన్నాను" అని వినేశ్ చెప్పింది.

ప్రాక్టీస్​ కోసం భారత ప్రభుత్వం వెచ్చించిన నిధులను దుర్వినియోగం చేశాడని తన కోచ్ వోల్లర్​ అకోస్​​పై భారత రెజ్లింగ్ సమాఖ్య చేసిన ఆరోపణలపైనా వినేశ్​ స్పందించింది. అతడు అలాంటి వాడు కాదని తెలిపింది. ఒలింపిక్స్​లో పతకం కోసం అతడు చాలా కష్టపడ్డాడని పేర్కొంది. వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశాడని స్పష్టం చేసింది. తాను క్వార్టర్స్​లో ఓడిన అనంతరం అతడు చాలా ఏడ్చాడని వినేశ్​ చెప్పుకొచ్చింది.

Vinesh Phogat Explains Why She Did Not Stay with Indian Team at Tokyo Olympics
క్వార్టర్స్​లో ప్రత్యర్థి సోఫియాతో తలపడుతూ..

"తనపై వచ్చిన ఆరోపణలతో మానసిక క్షోభను అనుభవించానని వినేశ్​ వెల్లడించింది. ఇంకా ఆ బాధ నుంచి బయటపడలేదు. సరిగా నిద్ర కూడా పోవట్లేదు. ఒంటరిగా గడుపుతున్నాను. తిరిగి పోటీల్లో ఇప్పట్లో పాల్గొనలేను. నాకు తెలిసి మళ్లీ నేను ఈ ఆటలో కనిపించకపోవచ్చు" అని వినేశ్ తెలిపింది.

Vinesh Phogat Explains Why She Did Not Stay with Indian Team at Tokyo Olympics
ఓటమి అనంతరం నిరాశలో వినేశ్

టోక్యో ఒలింపిక్స్​లో మూడు విషయాల్లో అమర్యాదగా ప్రవర్తించిందనే కారణంతో వినేశ్​ను రెజ్లింగ్​ నుంచి తాత్కాలికంగా నిషేధించింది భారత రెజ్లింగ్​ సమాఖ్య. సహచరులతో కలిసి గదిలో ఉండటానికి నిరాకరించడమే కాకుండా పోటీలో పాల్గొన్నప్పుడు అధికారిక స్పాన్సర్స్​ ఇచ్చిన జెర్సీని ధరించలేదని వివరణ ఇచ్చింది.​ దీనిపై బదులు ఇవ్వడానికి ఆగస్టు 16 వరకు గడువు విధించింది. కానీ, అంతకంటే ముందే వినేశ్​ వివరణ ఇచ్చింది.

ఇదీ చదవండి: KUNJA RAJITHA : పట్టు విడువక.. ప్రపంచం వైపు పరుగు తీస్తూ...

Last Updated : Aug 13, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.