Wrestlers Protest: 'మా ప్రాణాలకు ముప్పు ఉంది'.. రెజ్లర్ల డిమాండ్లు ఇవే!

author img

By

Published : Jan 20, 2023, 2:36 PM IST

wrestlers demand

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టిన రెజ్లర్లు తమ డిమాండ్లను ఐఓఏ తెలిపారు. అవేంటంటే.

భారత రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన మూడో రోజు కొనసాగుతోంది. దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వినేశ్ ఫొగాట్, బజరంగ్‌ పునియా, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్‌ సహా పలువురు క్రీడాకారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అయితే ఈ కుస్తీ యోధులు.. తాజా వ్యవహారంపై కేంద్రంతో జరిపిన చర్చలు ఫలించలేదు. అయితే తాజాగా భారత ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐఓఏ)కు ఫిర్యాదు చేశారు. రెజ్లింగ్‌ సమాఖ్యలో జరుగుతున్న అవకతవకలు, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను, అవమానాలను అందులో పేర్కొన్నారు. ఇందులో తమ నాలుగు డిమాండ్లను వివరించారు.

డిమాండ్లు ఇవే..

  • లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు వెంటనే కమిటీని ఏర్పాటు చేయాలి.
  • డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు తక్షణమే రాజీనామా చేయాలి.
  • భారత రెజ్లింగ్‌ సమాఖ్యను రద్దు చేయాలి.
  • డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలు కొనసాగించేందుకు రెజ్లర్లను సంప్రదించి ఓ కొత్త కమిటీని ఏర్పాటు చేయాలి.

"యువ రెజ్లర్ల మాకు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. డబ్ల్యూఎఫ్‌ఐలో ఆర్థికపరమైన అవకతవకలు కూడా జరుగుతున్నాయి. సీనియర్‌ రెజ్లర్లకు ఒప్పందం ప్రకారం చేసుకున్న చెల్లింపులు సరిగ్గా జరగట్లేదు. ఇక, టోక్యో ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన తర్వాత వినేశ్ ఫొగాట్‌ను డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు మానసికంగా హింసించాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్లిపోయింది. జాతీయ శిబిరంలో అర్హత లేని కోచ్‌లు, ఇతర సిబ్బందిని ఆయన నియమించాడు. వాళ్లంతా కేవలం అతని అనుచరులే. ఎంతో ధైర్యం కూడగట్టుకుని మేము ఈ ఆందోళనకు దిగాం. ఇప్పుడు మా ప్రాణాల గురించి భయపడుతున్నాం. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిని తొలగించకపోతే ఎంతో మంది యువ రెజ్లర్ల కెరీర్‌లు ఇక్కడితో ముగిసిపోతాయి." అని రెజ్లర్లు తమ ఫిర్యాదులో వెల్లడించారు.

రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. తనపై వస్తోన్న లైంగిక వేధింపుల ఆరోపణలను బ్రిజ్‌ భూషణ్‌ ఖండించారు. ఇదంతా కేవలం రాజకీయ కుట్రలో భాగమే అని ఆరోపించారు. పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన వెనక ఏ రాజకీయ పార్టీ గానీ వ్యాపారవేత్త గానీ లేరని చెప్పారు. తానూ ఈ వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినట్లు వచ్చిన ప్రచారాన్ని కొట్టిపారేశారు.

రాజీనామాకు ఆదేశం.. రెజ్లర్ల ఉద్యమం ఉద్ధృతం కావడం వల్ల కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్​ స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపారు. ఇకపోతే బ్రిజ్‌ భూషణ్‌ చరణ్‌ సింగ్‌ను రెజ్లింగ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్ష పదవికి 24 గంటల్లో రాజీనామా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం అందింది.

ఇదీ చూడండి: కావ్య మారన్ క్రేజ్​.. అక్కడ కూడా ఈ ఐపీఎల్ బ్యూటీని వదలట్లేదుగా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.