'బాక్సింగ్'​తో పేదరికంపై విజేందర్​ పోరాటం

author img

By

Published : Sep 26, 2021, 3:35 PM IST

Vijender singh's inspiring story in boxing ring

విజేందర్​ సింగ్​.. ఒలింపిక్స్​ బాక్సింగ్​ విభాగంలో దేశానికి తొలి పతకం అందించిన బాక్సర్​. విజేందర్​ సృష్టించిన చరిత్ర గురించి చెప్పేందుకు ఈ ఒక్కటి చాలు. హరియాణాలో పేదరికం వెంటాడున్న ఓ గ్రామంలో పుట్టిన వ్యక్తి, బస్సు డ్రైవర్​ కుమారుడు.. ఒలింపిక్స్​లో పతకం తెస్తాడనికి ఎవరైనా ఊహించి ఉంటారా? 'మనం తలచుకుంటే సాధించలేనిది అంటు ఏదీ ఉండదు' అని నిరూపించిన విజేందర్​కు సలాం!

"ప్రపంచాన్ని మార్చే సామర్థ్యం క్రీడలకు ఉంది. స్ఫూర్తినిచ్చే శక్తి క్రీడలకు ఉంది. ప్రజలను ఒక్కటి చేసే సత్తా క్రీడలకు ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పేదరికాన్ని జయించేందుకు, అభివృద్ధి సాధించేందుకు క్రీడలు ఓ ఆయుధంగా పనికొస్తాయి" దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, దాతృత్వవేత్త నెల్సన్​ మండేలా గతంలో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ మాటలను నిజం చేస్తూ పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలకు ఎగిసిన అథ్లెట్లు ఎందరో ఉన్నారు. వారిలో భారత బాక్సర్​ విజేందర్​ సింగ్​ ముందువరుసలో ఉంటాడు. పేదరికంలో పుట్టిపెరిగినా, అతడి సంకల్పం, ఆత్మవిశ్వాసం ముందు ఏదీ నిలబడలేదు. తనని తాను నమ్ముకుని ఎన్ని కష్టాలొచ్చినా ముందుకు సాగాడు.

Vijender singh's inspiring story in boxing ring
విజేందర్​ సింగ్​ పంచ్​

డ్రైవర్ గారి​ అబ్బాయి..

హరియాణాలో కలువాస్​ గ్రామంలో 1985 అక్టోబర్​29న జన్మించాడు విజేందర్​. అతడి బాల్యం మొత్తం కటిక పేదరికంలోనే సాగింది. విజేందర్​ తండ్రి మహిపాల్​ సింగ్​ ఓ బస్సు డ్రైవర్​. విజేందర్​, అతని సోదరుడు మనోజ్​ చదువులకు డబ్బుల ఆయన బస్సు డ్రైవర్​గా ఎక్కువ సమయం పనిచేసేవారు. తండ్రి కష్టాన్ని చిన్నతనంలోనే అర్థం చేసుకున్న విజేందర్​.. పేదరికం నుంచి కుటుంబాన్ని గట్టెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అతడు ఎంచుకున్న మార్గం 'బాక్సింగ్​'

వాస్తవానికి బాక్సింగ్​లో విజేందర్​కు స్ఫూర్తి అతడి అన్న మనోజ్​. మనోజ్​ బాక్సింగ్​లో దిట్ట. 1998లో క్రీడా కోటాలో ఆర్మీలో చేరాడు మనోజ్​. ఆ తర్వాత విజేందర్​కు ఆర్థికంగా సాయం చేసి అత్యుత్తమ బాక్సర్​గా తీర్చిదిద్దాడు. ఆటపై విజేందర్​కు ఉన్న ప్రేమ, ఆటలో అతడి ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు కూడా చదువుకోమని ఒత్తిడి చేయకుండా.. ఆటవైపే వెళ్లేందుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ఓ కుటుంబం.. చదువుకుంటే మంచి జీతం వచ్చే ఉద్యోగం వస్తుందని ఆశించకుండా.. కొడుకు ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అత్యంత గొప్ప విషయం.

Vijender singh's inspiring story in boxing ring
విజేందర్​ సింగ్​ విజయం

తల్లిదండ్రులు, అన్న మనోజ్​ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు విజేందర్​. అతి కొద్ది కాలంలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొంది సీనియర్ల దృష్టిలో పడ్డాడు. 1997లో సబ్​-జూనియర్​ స్థాయిలో రజతం, 2000లో జాతీయస్థాయిలో స్వర్ణం సాధించాడు. 2003లో ఆల్​-ఇండియా యూత్​ బాక్సింగ్​ ఛాంపియన్​గా అవతరించాడు. కానీ విజేందర్​ జీవితం మలుపు తిరిగింది మాత్రం 2003 ఆఫ్రో-ఆసియాన్​ గేమ్స్​తోనే! జూనియర్​ బాక్సరే అయినప్పటికీ, ట్రయల్స్​లో పోటీ చేసి ఆఫ్రో-ఆసియాన్​ గేమ్స్​లో చోటు దక్కించుకున్న ఈ డాషింగ్​ బాక్సర్​.. ఆ పోటీల్లో ఏకంగా రజతం గెలిచి అందరి ప్రశంసలు పొందాడు.

2008 బీజింగ్​ ఒలింపిక్స్​లో కాంస్యం సాధించిన విజేందర్​ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఒలింపిక్స్​ బాక్సింగ్​ విభాగంలో దేశానికి పతం సాధించిన తొలి అథ్లెట్​గా చరిత్ర సృష్టించాడు విజేందర్​.

ఆ తర్వాత ప్రొఫెషనల్​ బాక్సింగ్​వైపు అడుగులు వేసి అక్కడా దుమ్మురేపాడు విజేందర్​. దీంతో అతడి క్రేజ్​ అమాంతం పెరిగిపోయింది.

Vijender singh's inspiring story in boxing ring
ప్రొఫెషనల్​ బాక్సింగ్​లో

బాలీవుడ్​లోనూ..

బాక్సింగ్​ తొలినాళ్లల్లో.. మోడలింగ్​ కూడా చేశాడు విజేందర్​. అలా ఖర్చుల కోసం ఇంట్లో అడగకుండా తనకు తానే సంపాదించుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత బాలీవుడ్​లోనూ దర్శనమిచ్చాడు. 2014లో ఫగ్లీ సినిమాలో నటించాడు.

2011లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ అర్చన సింగ్​ను పెళ్లి చేసుకున్నాడు విజేందర్​. వారికి ఇద్దరు కుమారులు.

అవార్డులు...

దేశంలో బాక్సింగ్​కు ఆదరణ లభించేందుకు తనవంతు పాత్ర పోషించిన విజేందర్​కు 2006లో అర్జున అవార్డుతో సత్కరించింది భారత ప్రభుత్వం. 2010లో పద్మశ్రీ అవార్డు విజేందర్​ను వరించింది.

ఓ బస్సు డ్రైవర్​ కుమారుడు.. తండ్రి ఎక్కువ సేపు పనిచేస్తే కానీ పూటగడవని పరిస్థితి.. ఇవేవీ విజేందర్​ ప్రతిభను అడ్డుకోలేకపోయాయి. కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లొచ్చని, ఒడుదొడుకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చని నిరూపించిన విజేందర్​కు సెల్యూట్​.

Vijender singh's inspiring story in boxing ring
విజేందర్​ సింగ్​

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.