ETV Bharat / sports

Paralympics: వైకల్యాన్ని జయించి.. విశ్వ క్రీడలకు కదిలి

author img

By

Published : Aug 22, 2021, 6:44 AM IST

జపాన్ మరో విశ్వసమరానికి వేదిక కానుంది. ఇప్పటికే ఒలింపిక్స్​ను విజయవంతంగా నిర్వహించగా, ఇప్పుడు పారాలింపిక్స్ సిద్ధమైంది. చరిత్రలోనే అత్యధికంగా ఈ సారి భారత్ నుంచి 54 మంది ఈ విశ్వక్రీడల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 24న ప్రారంభమై​ 12 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.

Paralympics 2020
పారాలింపిక్స్​ 2020

చక్రాల కుర్చీలో నుంచి కదల్లేని శరీరం. నోట్లో ముద్ద పెట్టుకునేందుకు సహకరించని చేతులు.. ఉబికి వచ్చే కన్నీళ్లనూ తుడుచుకోలేని దుస్థితి! పది అడుగులు కూడా సక్రమంగా వేయలేని కాళ్లు.. పరుగులు పెట్టే అవకాశమే లేని పరిస్థితి! జాలిగా చూసే జనాలు.. అయ్యో! ఇక ఈ జీవితం ఇంతే అని మనసులో గూడుకట్టుకున్న నిరాశ.. అవాంతరాలు.. అడ్డంకులు.. అడుగడుగునా సవాళ్లు!

కానీ ఆ చక్రాల కుర్చీతోనే విజయ ప్రయాణం సాగించేందుకు.. చేతులు లేకపోయినా కొత్త చరిత్ర లిఖించేందుకు.. నడవలేని కాళ్లతో అత్యున్నత శిఖరాలకు చేరేందుకు ఈ వీరులు వస్తున్నారు. వైకల్యాలను వెనక్కినెట్టి.. అచంచల ఆత్మవిశ్వాసంతో.. అలుపెరగని పోరాటంతో.. అంతులేని కృషితో విశ్వ వేదికపై సింహ గర్జన చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విధి పెట్టిన విషమ పరీక్షలో విజేతలుగా నిలిచిన ఈ యోధులు.. ఇప్పుడు విశ్వ క్రీడల సంగ్రామాన జయకేతనం ఎగరవేసేందుకు సై అంటున్నారు. వాళ్లే.. దివ్యాంగ అథ్లెట్లు. పారాలింపిక్స్‌లో పతకాల వేటకు సన్నద్ధమయ్యారు. ఈ క్రీడల్లో ప్రాతినిథ్యం వహించనున్న ప్రతి ఒక్క పారా అథ్లెట్‌ ఓ విజేతే!

ఈసారి టోక్యోలో భారత్‌ ఎన్ని పతకాలు గెలుస్తుందనే అంచనాలను మళ్లీ మొదలెట్టాల్సిందే. పారాలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు మన పారా అథ్లెట్లు సిద్ధమయ్యారు. ఒలింపిక్స్‌కు ముందు పారా అనే పదం మాత్రమే వచ్చి చేరింది.. అంతే కానీ ఆటల్లో.. పోటీల్లో.. అథ్లెట్లు చూపించే తెగువలో.. వాళ్ల ప్రదర్శనలో ఏ మాత్రం తేడా ఉండదు. ఈ మంగళవారమే ఆరంభమయ్యే ఈ పారాలింపిక్స్‌ 12 రోజుల పాటు దివ్యాంగ అథ్లెట్ల అసాధారణమైన విన్యాసాలకు వేదికగా నిలవనున్నాయి.

మహా సేన..

పారాలింపిక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా 54 మంది భారత పారా అథ్లెట్లు ఈ క్రీడల్లో పతకాల కోసం పోటీపడనున్నారు. ఆర్చరీ, అథ్లెటిక్స్‌, బ్యాడ్మింటన్‌, కనోయింగ్‌, పవర్‌లిఫ్టింగ్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, తైక్వాండో.. ఇలా తొమ్మిది పారా క్రీడాంశాల్లో మన అథ్లెట్లు సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే కొంతమంది అథ్లెట్లు టోక్యోలోని క్రీడా గ్రామాన్ని చేరుకున్నారు. 1968లో తొలిసారి పారాలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహించిన భారత్‌.. ఇప్పటివరకూ నాలుగేసి చొప్పున స్వర్ణాలు, రజతాలు, కాంస్యాలతో కలిపి మొత్తం 12 పతకాలు సాధించింది. మధ్యలో 1976, 1980 పారాలింపిక్స్‌కు భారత్‌ దూరమైంది. దేశానికి వచ్చిన ఈ పతకాల్లో మూడు స్వర్ణాలు సహా మొత్తం 10 పతకాలు కేవలం అథ్లెటిక్స్‌లోనే రావడం విశేషం. అయిదేళ్ల కిందట రియో పారాలింపిక్స్‌లో 19 మంది అథ్లెట్లతో అయిదు క్రీడాంశాల్లో పోటీపడ్డ భారత్‌.. రెండు స్వర్ణాలు, ఒక్కో రజతం, కాంస్యం ఖాతాలో వేసుకుంది.

తగ్గేదేలే..

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సారి ఐదు స్వర్ణాలు సహా కనీసం 15 పతకాలు మన ఖాతాలో చేరుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బలమైన పారా అథ్లెట్లను బరిలో దించడమే అందుకు కారణం. పోటీపడే ప్రతి క్రీడాంశాల్లోనూ మనకు ప్రపంచ స్థాయి ఆటగాళ్లున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌ల్లోనూ ముందు వరుసలో ఉన్నారు. ముఖ్యంగా రియోలో స్వర్ణాలు పట్టేసిన తంగవేలు (హైజంప్‌ టీ42), దేవేంద్ర జజారియా (జావెలిన్‌ త్రో ఎఫ్‌46)పై మరోసారి పతక ఆశలు మెండుగా ఉన్నాయి. వీళ్లతో పాటు వరుణ్‌ సింగ్‌ (హైజంప్‌), సుందర్‌ సింగ్‌, సుమిత్‌ (జావెలిన్‌ త్రో), అరుణ (తైక్వాండో), రుబీనా (షూటింగ్‌), సుయాష్‌ (స్విమ్మింగ్‌) ఆసక్తి రేపుతున్నారు. బ్యాడ్మింటన్‌ మహిళల్లో పలక్‌ కోహ్లి, పురుషుల్లో ప్రమోద్‌ భగత్‌ కచ్చితంగా పతకాలతో తిరిగొచ్చేలా కనిపిస్తున్నారు.

ఇదీ చదవండి: 'పారాలింపిక్స్​లో భారత్​ కనీసం 15 పతకాలైనా గెలుస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.