ETV Bharat / sports

ఒలింపిక్స్​కి ఎగసిన తొలి మహిళా కెరటం!

author img

By

Published : Apr 10, 2021, 9:04 AM IST

అనంత జలరాశిలో పయనం.. కెరటాలకు ఎదురెళ్లే సాహసం.. సవాళ్లెన్ని ఎదురైనా తీరం చేరాలనే సంకల్పం.. ఇవే క్లిష్టమైన సెయిలింగ్‌లో నేత్రను నెం.1గా నిలిపాయి. ఒలింపిక్స్‌లో పాల్గొనే తొలి భారతీయ క్రీడాకారిణిగా కీర్తినందించాయి.

Nethra Kumaran
నేత్ర కుమారన్

అది 2009 వేసవి. తమిళనాడు సెయిలింగ్‌ అసోసియేషన్‌ 14 ఏళ్లలోపు పిల్లలకు సెయిలింగ్‌లో సమ్మర్‌ క్యాంప్‌ నిర్వహిస్తోంది. ఆ విషయం తెలిసి అందులో తమ 12 ఏళ్ల నేత్రను చేర్చాలనుకుంది వాళ్ల అమ్మ. అలా అనుకున్న ఆ క్షణం ఆమెకు తెలీదు.. తమ బిడ్డ ఈ క్రీడలో విజయాలెన్నో నమోదు చేసుకుంటుందని. సెయిలింగ్‌లో సరదాగా చేరిన ఆ అమ్మాయి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలెన్నో సాధించి ప్రస్తుతం ఒలిపింక్స్‌కి అర్హత సాధించిన తొలిమహిళా సెయిలర్‌గా అందరి దృష్టినీ తనవైపు తిప్పేసుకుంది. ఒమన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్‌లోని లేజర్‌ రేడియల్‌ క్లాస్‌ ఈవెంట్‌లో పోటీపడిన నేత్ర 21 పాయింట్లతో టాప్‌లో నిలిచి తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది.

సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి..

సరదాగా నేర్చుకోవాలనుకున్న సెయిలింగ్‌ బాగా నచ్చేసింది. ముఖ్యంగా సముద్ర కెరటాలు విపరీతంగా ఆమెను ఆకర్షించాయి. అంతే అప్పటివరకు తాను నేర్చుకుంటున్న టెన్నిస్‌, సైక్లింగ్‌, బాస్కెట్‌బాల్‌ వంటి క్రీడలన్నింటినీ పక్కన పెట్టేసింది. కళలకు సెలవిచ్చేసింది. ఓవైపు చదువు, మరోవైపు సెయిలింగ్‌.. ఇవే తన జీవిత లక్ష్యాలుగా నిర్ణయించుకుంది నేత్ర.

nethra with family
కుటుంబంతో నేత్ర

"సముద్రంలో ప్రయాణం, ఎగిసిపడే కెరటాలు.. నన్ను బాగా ఆకట్టుకున్నాయి. దీన్నే కెరీర్‌గా ఎంచుకోవాలనుకున్నా" అంటోంది నేత్ర. కానీ ఈ ఆటకు బోలెడంత శారీరక సామర్థ్యం అవసరం. మానసికంగానూ ఏకాగ్రత ముఖ్యం. వాటన్నింటిమీదా క్రమంగా పట్టు తెచ్చుకుందీ అమ్మాయి.

"నా ఆసక్తిని అమ్మానాన్నలు గుర్తించారు. అయితే ఇందులో ఉండే కష్టనష్టాలనీ వివరించారు. అవన్నీ నేను అధిగమించగలనని చెప్పా. శారీరకంగా దృఢంగా ఉండటానికి ఆహార నియమాలను పాటించడం మొదలుపెట్టా" అంటోంది నేత్ర.

కూతురి ఇష్టాన్ని గమనించిన ఆ అమ్మానాన్నలు ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ సంస్థను నిర్వహించే ఆమె తండ్రి వీసీ కుమనన్‌.. ఆమె కోసం తన విలువైన సమయాన్ని కేటాయించేవారు. అందుకే వారిని గర్వపడేలా చేస్తా అని చెబుతోంది నేత్ర. ప్రస్తుతం ఆమె చెన్నై ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో ఇంజినీరింగ్‌ రెండో ఏడాది చదువుతోంది.

పడవ పాడైంది..

ఓ పక్క చదువుకుంటూనే మరోవైపు ఒలింపిక్స్‌లో గెలవాలన్న లక్ష్యం పెట్టుకుంది. "సముద్రంలో గంటల తరబడి ప్రయాణించడం కష్టం. ఎండని తట్టుకుంటూ, కెరటాలకు ఎదురెళ్తూ బోటును నడపడానికి శారీరక సామర్థ్యం చాలా అవసరం. ఒక్కోసారి ఒంటరిగా వెళ్లాలి. అతి చిన్న బోటులో నావిగేటర్‌తో ప్రయాణించాలి. వీటిని ఛాలెంజ్‌గా తీసుకుని సామర్థ్యాలను పెంచుకున్నా. ఈ క్రమంలో ఎదురైన అడ్డంకులన్నీ అధిగమించా. ఒలింపిక్స్‌ అర్హత పోటీలకు వెళ్తున్నప్పుడు ఊహించని సమస్య ఎదురైంది. అబుదాబీ నౌకాశ్రయం నుంచి బోటును ఒమన్‌లోని ముసన్నా స్పోర్ట్స్‌ సిటీకి తరలించేటప్పుడు అది పాడైంది. విషయం తెలిసి ఏం చేయాలో తోచలేదు. పోటీలకు బోటే లేదు. దాంతో నా బృందంలోని రామమిలాన్‌ యాదవ్‌ పడవను అడిగి అందులోనే సెయిలింగ్‌ చేసి ఒలింపిక్స్‌కి ఎంపికయ్యా" అని తెలిపింది నేత్ర.

దేశం గర్వపడేలా చేస్తా..

నేత్ర తొలిసారిగా చెన్నైలో 2014లో జరిగిన అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది. తర్వాత 2018లో జరిగిన ఆసియన్‌ గేమ్స్‌, గతేడాది మియామీలో జరిగిన హెంపల్డ్‌ వరల్డ్‌ సిరీస్‌లోనూ సత్తా చాటింది. ఇందుకోసం హంగేరియన్‌ కోచ్‌ థామస్‌ ఎస్జెస్‌ వద్ద శిక్షణ తీసుకుంటోంది. "2024లో పారిస్​లో జరగబోయే పోటీల్లో అత్యుత్తమ క్రీడాకారిణులతో పోటీపడటానికి ఈ అనుభవాన్ని ఉపయోగించుకుంటా. నా విజయం దేశాన్నీ, అమ్మానాన్నల్నీ గర్వించేలా చేస్తుందన్నదే నాకు నిరంతర ప్రేరణ" అంటోన్న నేత్రకు విజయోస్తు చెబుదాం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.