ETV Bharat / sports

ఫైనల్​లో తెలుగు తేజం బాక్సర్​ నిఖత్​.. కామన్వెల్త్​కు చాను

author img

By

Published : Feb 26, 2022, 7:01 AM IST

meerabai
మీరాబాయి

స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీ ఫైనల్​లోకి అడుగుపెట్టింది తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌. కాగా, ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి తొలి రజతం అందించిన చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను.. ఇప్పుడు కొత్త విభాగంలో కామన్వెల్త్‌ క్రీడలకు అర్హత సాధించింది.

Boxer Nikhat: స్ట్రాంజా స్మారక బాక్సింగ్‌ టోర్నీలో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పతకం ఖాయం చేసిన ఈ 25 ఏళ్ల అమ్మాయి.. దాన్ని పసిడిగా మార్చే దిశగా సాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం మహిళల 52 కేజీల విభాగం సెమీస్‌లో నిఖత్‌ 4-1 తేడాతో బుసె నాజ్‌ కకియోగ్లు (టర్కీ)పై విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన ప్రత్యర్థిపై ఈ పోరులో నిఖత్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. పంచ్‌లతో విరుచుకుపడింది. ప్రత్యర్థికి ఊహకు అందని రీతిలో ముష్టిఘాతాలు కురిపించింది. 48 కేజీల విభాగంలో నీతు కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో ఉక్రెయిన్‌ బాక్సర్‌ హన్నా ఒఖోతాను ఆమె చిత్తుచిత్తుగా ఓడించింది. నీతు ధాటికి తాళలేని ప్రత్యర్థి రెండో రౌండ్లోనే కుప్పకూలిపోయింది. మరోవైపు యూత్‌ ప్రపంచ ఛాంపియన్‌ అరుంధతి చౌదరీ (70 కేజీలు), పర్వీన్‌ (63 కేజీలు)కు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్‌లో అరుంధతి 1-4తో ఒలింపిక్‌ ఛాంపియన్‌ బుసెనాజ్‌ సుర్మెనెలి (టర్కీ) చేతిలో ఓడింది. పర్వీన్‌ 2-3తో నటాలియా (రష్యా) చేతిలో పోరాడి పరాజయం పాలైంది.

కామన్వెల్త్​కు చాను

Mirabai Chanu Commonwealth Games 2022: ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో దేశానికి తొలి రజతం అందించి చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను.. ఇప్పుడు కొత్త విభాగంలో కామన్వెల్త్‌ క్రీడలకు అర్హత సాధించింది. టోక్యోలో 49 కేజీల విభాగంలో ఆమె వెండి పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 55 కేజీల విభాగంలో బరిలో దిగిన తొలి పోటీల్లోనే ఆమె సత్తాచాటింది. సింగపూర్‌ అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నీలో స్వర్ణం సాధించి.. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్‌ క్రీడల బెర్తు ఖరారు చేసుకుంది. ఆమె మొత్తం 191 కేజీల (స్నాచ్‌లో 86, క్లీన్‌ అండ్‌ జర్క్‌లో 105) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. జెస్సికా (ఆస్ట్రేలియా- 167 కేజీలు), కసాండ్రా (మలేసియా- 165 కేజీలు) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మరోవైపు కామన్వెల్త్‌ ర్యాంకింగ్స్‌ ఆధారంగా 49 కేజీల విభాగంలోనూ 27 ఏళ్ల చాను ఈ కామన్వెల్త్‌ క్రీడలకు అర్హత సాధించింది. కానీ భారత పతక అవకాశాలను మెరుగుపర్చే క్రమంలో ఆమె కేవలం కొత్తగా ఎంచుకున్న 55 కేజీల విభాగంలోనే పోటీపడే అవకాశం ఉంది.

భారత జోడీకి రజతం

ప్రపంచ పారా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత జోడీ శ్యామ్‌ సుందర్‌ స్వామి-జ్యోతి బలియాన్‌ రజతం గెలుచుకున్నారు. మిక్స్‌డ్‌ పెయిర్‌ విభాగం ఫైనల్లో శ్యామ్‌-జ్యోతి 148-150తో బెయిర్‌ షిగయెవ్‌-తతియానా (రష్యా) చేతిలో పోరాడి ఓడారు. ఈ పోరులో అర్ధభాగం ముగిసే సరికి 78-76తో ఆధిక్యంలో నిలిచిన భారత జంట.. ద్వితీయార్ధంలో తడబడి స్వర్ణాన్ని చేజార్చుకుంది. అంతకుముందు సెమీస్‌లో శ్యామ్‌-జ్యోతి 151-145తో జూలీ-థియరీ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. గతేడాది ఇదే వేదికలో విద్యతో కలిసి శ్యామ్‌.. పారా ఆర్చరీ ప్రపంచ ర్యాంకింగ్‌ టోర్నీలో రజతం గెలిచాడు.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా జోరు.. ఈ మ్యాచ్​ గెలిస్తే సిరీస్​ మనదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.