ETV Bharat / sports

సోమవారం నుంచే ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌.. సానియాకు చివరి టోర్నీ ఇదే.. కళ్లన్నీ జకోవిచ్‌పైనే..

author img

By

Published : Jan 15, 2023, 7:05 AM IST

Australian Open 2023
Australian Open 2023

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సోమవారం మొదలుకానుంది. ఈ టోర్నీలో పునరాగమనం చేస్తున్న సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌పైనే అందరి దృష్టి ఉంది. మరోవైపు భారత​ బ్యాడ్మింటన్​ స్టార్ ప్లేయర్​ సానియా మీర్జా ఆడనున్న చివరి టోర్నీ ఇదే.

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు వేళైంది. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ మొదలయ్యేది సోమవారమే. అందరి దృష్టి ఈ టోర్నీలో పునరాగమనం చేస్తున్న సెర్బియా స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌పైనే! గత సీజన్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ హోదాలో బరిలో దిగాల్సిన జకోని కరోనా టీకా వేసుకోని కారణంగా అధికారులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. అంతేకాదు వీసాను కూడా రద్దు చేశారు. కానీ కరోనా ఆంక్షలు తొలగి వీసాను పునరుద్దరించడంతో అతడికి ఈసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ఆడే అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ఈ తొమ్మిదిసార్లు ఛాంపియన్‌ ఈసారి ఎలా ఆడతాడన్నది ఆసక్తికరం.

సింగిల్స్‌ తొలి రౌండ్లో కార్‌బాలెస్‌ (స్పెయిన్‌)తో పోరుతో టైటిల్‌ వేట్‌ను ఆరంభించనున్న నొవాక్‌.. నాలుగో సీడ్‌గా బరిలో దిగుతున్నాడు. మరోవైపు స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ ఈసారి డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా పోటీలో ఉన్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు (22) ఖాతాలో ఉన్న రఫా, సంఖ్యను మరింత పెంచుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. జకోవిచ్‌, నాదల్‌ భిన్న పార్శ్వాల్లో ఉండడంతో ఫైనల్‌ వరకు ఎదురుపడరు. తొలి రౌండ్లో జాక్‌ డ్రాపర్‌ (బ్రిటన్‌)తో టాప్‌సీడ్‌ నాదల్‌ తలపడనున్నాడు. ప్రపంచ నం.1 కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) గాయంతో ఈ టోర్నీకి దూరమైనా.. మూడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), అయిదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా), ఏడో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా) నుంచి జకో, రఫాకు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి.

స్వైటెక్‌కు ఎదురుందా! : మహిళల సింగిల్స్‌లో పోలెండ్‌ స్టార్‌ ఇగా స్వైటెక్‌ టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. గత సీజన్లో రెండు టైటిల్స్‌ (ఫ్రెంచ్‌ ఓపెన్‌, యుఎస్‌ ఓపెన్‌)తో జోరు మీదున్న ఆమె, ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో సెమీఫైనల్‌ వరకు వెళ్లింది. ఈసారి టాప్‌సీడ్‌గా పోటీలో ఉన్న స్వైటెక్‌ తొలి రౌండ్లో జులియా (జర్మనీ)తో తలపడనుంది. తల్లి కాబోతుండడంతో నవోమి ఒసాకా (జపాన్‌) టోర్నీ నుంచి వైదొలగడం స్వైటెక్‌కు కలిసొచ్చే అంశం. అయితే రెండో సీడ్‌ జాబెర్‌ (ట్యునీసియా), మూడో సీడ్‌ జెస్సికా పెగులా (అమెరికా), నాలుగోసీడ్‌ గార్సియా (ఫ్రాన్స్‌), ఆరో సీడ్‌ సకారి (గ్రీస్‌) కూడా గట్టి పోటీదారులే. మునుపటిలా ఫామ్‌లో లేకపోయినా క్విటోవా (చెక్‌), ముగురుజ (స్పెయిన్‌), అజరెంక (బెలారస్‌)లను కూడా తక్కువ అంచనా వేయలేం.

సానియా ఆఖరుగా..: సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో అనా డానిలీనా (కజకిస్థాన్‌)తో కలిసి బరిలో దిగుతోంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్‌ బోపన్న తోడుగా ఆమె ఆడే అవకాశముంది. రిటైర్‌కానున్న సానియా కెరీర్‌లో తనకిదే చివరి గ్రాండ్‌స్లామ్‌ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె రెండుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో టైటిళ్లు గెలిచింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో సాకేత్‌ మైనేని-యుకి బాంబ్రి జోడీగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.