ETV Bharat / sports

వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్.. ఫైనల్‌ పోరుకు చేరువలో టీమ్ఇండియా

author img

By

Published : Feb 11, 2023, 10:44 PM IST

WTC Final : వరల్డ్​ టెస్టు ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరుకు టీమ్ఇండియా మరో అడుగు ముందుకేసింది. నాగ్‌పుర్‌ వేదికగా భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించి.. ఫైనల్​ అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది.

wtc team india
wtc team india

WTC Final : బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భారత్ బోణీ కొట్టింది. తొలి టెస్టులో మొదటి నుంచే ఆధిపత్యం కనబర్చిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరుకు మరో అడుగు ముందుకేసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్​ టేబుల్​లో.. టీమ్ఇండియా రెండో స్థానంలో నిలిచింది. దీంతో గెలుపు శాతం నాగ్‌పుర్‌ టెస్టుకు ముందు 58.93గా ఉండగా.. విజయానంతరం అది 61.67 శాతానికి పెరిగింది. ఇక ఈ పాయింట్ల పట్టికలో మొదటి ప్లేస్​లో ఉన్న ఆస్ట్రేలియా గెలుపు శాతం 75.56 నుంచి 70.83కు పడిపోయింది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచిన టీమ్‌ఇండియా.. ఈసారి ఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలంటే బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లోని మిగతా మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండింట్లో గెలవాలి. అయితే శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల డబ్ల్యూటీసీ ఫైనల్​ అవకాశాలు కూడా బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీపై ఆధారపడి ఉన్నాయి.

wtc points table
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక

ప్రస్తుతం ఈ జట్లు డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్​ టేబుల్​లో మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ, ఈ సిరీస్‌లో కంగారూ జట్టు పుంజుకుని 2-2తో విజయం సాధించి.. మరోవైపు కివీస్​తో సిరీస్‌ను శ్రీలంక 2-0తో గెలిస్తే.. భారత్‌ ఫైనల్‌ సమరానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. కాగా, ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ జట్లు ఇప్పటికే ఫైనల్‌ రేసు నుంచి తప్పుకున్నాయి.
ఇక, భారత్​-ఆస్ట్రేలియా జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో చెలరేగిపోయాడు. దీనికి తోడు అక్షర్‌ పటేల్‌, జడేజా మెరుపు ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 400 పరుగులు చేసింది. అంతకుముందు భారత స్పిన్నర్ల ధాటికి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే కుప్పకూలింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో రోహిత్‌ సేన గెలుపొందింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.