ETV Bharat / sports

కళ్లన్నీ కేఎల్‌ రాహుల్ మీదే, తిరిగి ఫామ్​లోకి వస్తాడా

author img

By

Published : Aug 16, 2022, 6:53 AM IST

kl rahul stats
kl rahul stats

జింబాబ్వేతో టీమ్‌ఇండియా మూడు వన్డేలు ఆడుతుంది. గురువారం తొలి మ్యాచ్‌. ఇప్పటికే ఈ సిరీస్‌ కోసం భారత జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఓ వైపు పసికూన లాంటి ప్రత్యర్థి.. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌, కోహ్లి, పంత్‌, శ్రేయస్‌, బుమ్రా, షమి లాంటి ఆటగాళ్లు లేరు. ఈ సిరీస్‌ ప్రాధాన్యం అంతంతమాత్రమే కానీ ఇప్పటినుంచే ఈ మ్యాచ్‌ల గురించి చర్చ మొదలైంది. అందుకు కారణం కేఎల్‌ రాహుల్‌. ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో గత కొంతకాలంగా జట్టుకు దూరమైన అతను జింబాబ్వేలో ఏం చేస్తాడు తిరిగి లయ అందుకుంటాడా అతనికి ఏ స్థానం సరిపోతుంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

kl rahul career: 2016లో జింబాబ్వే పర్యటనలోనే వన్డేల్లో అడుగుపెట్టిన కేఎల్‌ రాహుల్‌.. తన తొలి మ్యాచ్‌లోనే శతకం బాదేశాడు. వన్డే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత అతను కెప్టెన్‌గా తిరిగి ఆ దేశానికి వెళ్లాడు. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు అతని ముందు ఎన్నో సవాళ్లున్నాయి. అప్పుడు ఓపెనర్‌గా దిగిన అతను.. ఈ సారి బ్యాటింగ్‌ లైనప్‌లో తన స్థానంపై సందిగ్ధతతో ఉన్నాడు. ఈ సారి కూడా ఓపెనర్‌గానే ఆడడం ఖాయమనిపిస్తున్నప్పటికీ.. ప్రస్తుత పరిణామాలు అతనికి పరీక్ష పెడుతున్నాయి. ఈ నెల 27న యూఏఈలో ఆసియా కప్‌ ఆరంభమవుతుంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ మొదలవుతుంది. ఈ టోర్నీలకు ముందు రాహుల్‌ తిరిగి ఫామ్‌ అందుకోవడం తనతో పాటు జట్టుకూ చాలా అవసరం.

ఆరు నెలలుగా..: వివిధ కారణాల వల్ల రాహుల్‌ టీమ్‌ఇండియాకు ఆరు నెలలుగా దూరంగా ఉన్నాడు. చివరగా అతను ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో వన్డే ఆడాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను నడిపించాడు. కానీ దీని తర్వాత స్పోర్ట్స్‌ హెర్నియా కారణంగా అతను మైదానానికి దూరమయ్యాడు. హెర్నియా శస్త్రచికిత్స నుంచి కోలుకుని వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడేలా కనిపించాడు. కానీ కరోనా సోకడంతో అది సాధ్యం కాలేదు. దీంతో జింబాబ్వేతో సిరీస్‌కు ముందు ప్రకటించిన జట్టులోనూ అతనికి చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు ఫిట్‌నెస్‌ నిరూపించుకోవడం వల్ల.. ఆసియా కప్‌నకు ముందు మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండాలని ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. ధావన్‌ నుంచి కెప్టెన్సీ పగ్గాలూ రాహుల్‌కు అప్పగించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ రెండు టెస్టులు, నాలుగు వన్డేలు మాత్రమే ఆడిన అతను.. జింబాబ్వేతో సిరీస్‌లో తిరిగి లయ అందుకుని పరుగులు చేయాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. అతను ఫామ్‌లోకి వస్తే జట్టు మరింత పటిష్టంగా మారుతుంది. అందుకు ఈ సిరీస్‌ అతడికి సరైన అవకాశం.

.

స్పష్టత లేదు..: రాహుల్‌కు బ్యాటింగ్‌ ఆర్డర్లో ఓ నిర్దిష్టమైన స్థానం లేకపోవడమూ సమస్యగా మారింది. ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన అతను.. జట్టు అవసరాలను బట్టి స్థానాలు మారుతున్నాడు. వన్డేల్లో తొలి ప్రాధాన్య ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌ జట్టులో ఉన్నప్పుడు అతను మిడిలార్డర్‌లో ఆడుతున్నాడు. 2019 జనవరి నుంచి 29 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అతను 14 సార్లు మాత్రమే ఓపెనింగ్‌ చేశాడు. 9 సార్లు అయిదో స్థానంలో వచ్చాడు. పూర్తిస్థాయి జట్టు బరిలో దిగినప్పుడు అతనెక్కువగా మిడిలార్డర్‌కే పరిమితమవుతున్నాడు. అయితే ఏ స్థానంలో ఆడినా పరుగులు చేస్తుండడంతో ఇబ్బంది లేకుండా పోయింది. పైన పేర్కొన్న 29 ఇన్నింగ్స్‌ల్లో అతను 63.71 సగటుతో పరుగులు సాధించాడు. పంత్‌, హార్దిక్‌తో కలిసి అతను బలమైన మిడిలార్డర్‌ను ఏర్పరుస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో భారత్‌ పొట్టి ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన నేపథ్యంలో అతణ్ని ఓపెనర్‌గా ఆడిస్తారా? లేదా మిడిలార్డర్‌లోనే ఉంచుతారా? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్లో తరచూ మార్పులు జరుగుతున్నాయి. విజయాలు దక్కుతున్నాయి కాబట్టి ఆ ప్రభావం ఎక్కువగా కనిపించడం లేదు. కానీ ప్రపంచకప్‌నకు ముందే జట్టు తుది కూర్పుపై ఓ స్పష్టతకు రావాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జింబాబ్వేతో వన్డే సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు బదులు రాహుల్‌నే ఓపెనర్‌గా పంపిస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విండీస్‌తో సిరీస్‌లో ఓపెనర్‌గా గిల్‌ (3 మ్యాచ్‌ల్లో 205 పరుగులు) రాణించాడు. అలాంటిది ఇప్పుడు రాహుల్‌ కోసం గిల్‌ను మూడో స్థానంలో ఆడించొచ్చు. రాహుల్‌ను మిడిలార్డర్‌కే పరిమితం చేస్తే మంచిదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి జింబాబ్వే సిరీస్‌లో అతను ఏ స్థానంలో ఆడతాడో? ఎలాంటి ప్రదర్శన చేస్తాడో? చూడాలి.

ఇవీ చదవండి: ఆసియా కప్​లో తిరుగులేని రోహిత్​ శర్మ, సచిన్ రికార్డును బ్రేక్​ చేస్తాడా

ధోనీ షాకింగ్​ నిర్ణయానికి అప్పుడే రెండేళ్లు, మరోసారి రిటైర్మెంట్‌ టైమ్‌ వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.