ETV Bharat / sports

IPL 2022: చెన్నై జట్టులోకి ఆ ఆటగాళ్లు మళ్లీ వస్తారా?

author img

By

Published : Feb 3, 2022, 6:46 PM IST

dhoni raina
ధోనీ ఐపీఎల్

IPL CSK: ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ తేదీ దగ్గరపడుతున్న కొద్ది అన్ని జట్ల కంటే చెన్నైపైనే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే వదులుకున్న క్రికెటర్లను మళ్లీ తీసుకుంటుందా లేదా అని?

Dhoni CSK: ఐపీఎల్‌లో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్ ఒకటి. ఏ ఆటగాడైనా ఆ జట్టులో కనీసం ఒక్కసారైనా ఉండాలనుకుంటాడు. అందుకు ప్రధాన కారణం కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ. అతడు ఎవరినైనా నమ్మాడంటే ఇక ఆ ఆటగాడికి తిరుగుండదు. వాళ్లను అన్ని విధాలుగా ప్రోత్సహించి మ్యాచ్‌ విన్నర్లుగా తీర్చిదిద్దుతాడు. దీంతో ఎవరైనా చెన్నై జట్టులో తప్పక ఉండాలని అనుకుంటారు. అయితే, ఈ సారి మెగా వేలం నిర్వహిస్తున్న నేపథ్యంలో ధోనీ సైతం పలువురు ముఖ్యమైన ఆటగాళ్లను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో వారిప్పుడు వేలంలో పాల్గొంటున్నారు. ఒకవేళ చెన్నై వదిలేసిన ఆటగాళ్లలో మళ్లీ తీసుకోవాలనుకుంటే అందులో ఎవరున్నారో ఓ లుక్కేసి తెలుసుకుందాం..

ధోనీ-రైనా దోస్తీ సాగేనా?

suresh raina
సురేశ్ రైనా

చెన్నై జట్టులో ధోనీ (4,746) కన్నా సురేశ్‌ రైనా (5,528)నే బ్యాట్స్‌మన్‌గా ఎక్కువ విజయవంతమయ్యాడు. వీళ్లిద్దరూ 2008 నుంచే (2016, 17 మినహా) సీఎస్కేలో కొనసాగుతున్నా.. ఈ సారి మెగా వేలం నిర్వహిస్తుండటం వల్ల చెన్నై టీమ్‌ తొలిసారి రైనాను వదిలేసింది. ఇన్నేళ్లూ అద్భుతంగా ఆడి ఆ జట్టుకు ఒంటి చేత్తో విజయాలు అందించిన ఈ ఉత్తర్‌ప్రదేశ్‌ బ్యాట్స్‌మన్‌ గతేడాది మాత్రమే ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు అంతకుముందు ఏడాది వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌ ఆడకపోయినా.. అప్పుడు జట్టు యజమాని ఎన్‌.శ్రీనివాసన్‌తో విభేదాలొచ్చాయనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే రైనాను వదులుకోవడం ఆసక్తిగా మారింది. ఈ విషయాలు పక్కనపెడితే ఐపీఎల్‌లో రైనా ట్యాప్‌ బ్యాట్స్‌మెన్​లో ఒకడు‌. కోహ్లీ (6,283), ధావన్‌ (5,784), రోహిత్‌ (5,611) తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. దీంతో మహీ తిరిగి వేలంలో రైనాను కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా.

లార్డ్‌ శార్దూల్​పై నమ్మకం ఉందా?

dhoni shardhul thakur
ధోనీ- శార్దుల్ ఠాకుర్

శార్దూల్‌ ఠాకూర్‌ కొంత కాలంగా చెన్నై జట్టులో కీలకంగా మారిన పేస్‌ ఆల్‌రౌండర్‌. అటు ఐపీఎల్‌లో ఇటు టీమ్‌ఇండియాలో రాణిస్తూ ఆపద్బాంధవుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో ప్రధాన పేసర్లు టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపి శుభారంభాలు అందిస్తే మధ్యలో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో ఠాకూర్‌ది అందెవేసిన చేయి. మ్యాచ్‌ మధ్యలో బౌలింగ్‌కు రావడం.. చకచకా వికెట్లు తీయడం.. ప్రత్యర్థిని ఇరకాటంలో నెట్టడం శార్దూల్‌కు అలవాటైన పని. ఈ క్రమంలోనే నాలుగేళ్లలో చెన్నై జట్టులోని కీలక ఆటగాళ్లలో ఒకడిగా రాణిస్తున్నాడు. మొదట్లో పంజాబ్‌, దిల్లీ, పుణె జట్లకు ఆడిన లార్డ్‌ శార్దూల్‌ 2018 నుంచి వరుసగా చెన్నై జట్టులోనే కొనసాగుతున్నాడు. అయితే, ఈసారి ఆ జట్టు వదిలేయడం వల్ల వేలంలో పాల్గొంటున్నాడు. కానీ చెన్నై జట్టు గురువారం చేసిన ఓట్వీట్.. అతడిని తిరిగి కొనుగోలు చేస్తారనే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. ఈ నాలుగేళ్లలో శార్దూల్‌ బ్యాటింగ్‌ పరంగా రాణించకపోయినా బౌలింగ్‌లో 55 వికెట్లు సాధించడం విశేషం. దీంతో చెన్నై మిడిల్‌ ఆర్డర్‌ కోసమైనా ఈ లార్డ్‌ను ఎంపిక చేసుకునే వీలుంది.

శుభారంభం అంటే దీపక్‌ ఉండాల్సిందే!

deepak chahar
దీపక్ చాహర్

చెన్నై గత నాలుగేళ్లలో 2020 ఏడాది మినహా ప్రతిసారీ రాణించింది. అందుకు ప్రధాన కారణాల్లో దీపక్‌ చాహర్‌ ఒకడు. ఆదిలోనే కొత్త బంతితో వికెట్లు తీయడం. తొలి స్పెల్‌లో ప్రత్యర్థి టాప్‌ఆర్డర్‌ను దెబ్బ తీయడం అతడికి తేలికైపోయింది. ఏ జట్టు అయినా.. బ్యాట్స్‌మెన్‌ ఎంతటివాడైనా వికెట్లే లక్ష్యంగా బౌలింగ్‌ చేస్తాడు. ఈ క్రమంలోనే గత నాలుగేళ్లలో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడి 58 వికెట్లు పడగొట్టాడు. దీంతో చెన్నై ప్రధాన పేసర్‌గా ఎదిగాడు. కానీ, మెగా వేలంలో నేపథ్యంలో ఇలాంటి మేటి బౌలర్‌ను కూడా ధోనీ వదులుకోవాల్సి వచ్చింది. మరోవైపు చాహర్‌ ఇటీవలి కాలంలో బ్యాటింగ్‌లోనూ విజృంభిస్తున్నాడు. గతేడాది శ్రీలంక పర్యటనలో ఒక అర్ధశతకం, ఇటీవల దక్షిణాఫ్రికాలో మరో అర్ధ శతకం సాధించాడు. అది కూడా ధనాధన్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టడం విశేషం. దీంతో దీపక్‌ తనలోని మరో కోణాన్ని సైతం చెన్నై టీమ్‌కు పరిచయం చేశాడు. ఒకవేళ ఇతర జట్లు దీపక్‌ కోసం పోటీపడకపోతే ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ను కచ్చితంగా తిరిగి కొనుగోలు చేసే అవకాశం లేకపోలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.