ETV Bharat / sports

కోహ్లీ vs అండర్సన్‌.. ఇదే చివరి పోరు! ఇప్పటివరకు పైచేయి అతడిదేనా?

author img

By

Published : Jun 30, 2022, 6:05 PM IST

ఇంగ్లాండ్​తో కీలక మ్యాచ్​కు సిద్ధమైంది టీమ్​ఇండియా. రీషెడ్యూల్​ టెస్టు శుక్రవారమే ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర పోరు కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. అదే విరాట్ కోహ్లీ వర్సెస్ జేమ్స్ అండర్సన్. దశాబ్ద కాలంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చిన ఈ స్టార్ ఆటగాళ్లు తలపడే చివరి మ్యాచ్​ ఇదే అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇప్పటివరకు వీరి మధ్య పోరు ఎలా సాగిందో చూసేయండి.

virat kohli vs james anderson
virat kohli vs james anderson head to head

అతడు పరుగుల రారాజు అయితే.. ఇతడు వికెట్ల వీరుడు. అతడు చూడచక్కని డ్రైవ్‌ షాట్లు ఆడితే.. ఇతడు బెంబేలెత్తించే బంతులేస్తాడు. అతడు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిస్తే.. ఇతడు ఇంగ్లాండ్‌ బౌలింగ్‌కే వన్నె తెస్తాడు. వాళ్లిద్దరే విరాట్‌ కోహ్లీ, జేమ్స్‌ అండర్సన్‌. దశాబ్దకాలంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తుండగా.. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ తలపడేది ఇదే చివరి మ్యాచ్‌ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో ఇప్పటివరకు ఎవరి ఆధిపత్యం ఎలా సాగిందో ఓ లుక్కేద్దాం.

virat kohli vs james anderson
అండర్సన్-కోహ్లీ

ఆరంభమైందిలా..: తొలిసారి విరాట్‌, అండర్సన్ టెస్టుల్లో పోటీ పడింది 2012లో. అప్పుడు ఇంగ్లాండ్‌ భారత పర్యటనకు వచ్చినప్పుడు తొలిసారి అండర్సన్‌ కింగ్‌ కోహ్లీని ఔట్‌ చేశాడు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరిగిన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ (6) పరుగులకే పెవిలియన్‌ చేరాడు. అండర్సన్‌ వేసిన బంతి బ్యాట్‌ అంచున తాకుతూ వెళ్లి స్లిప్‌లో ఉన్న గ్రేమ్‌ శ్వాన్‌ చేతుల్లో పడింది. ఔట్‌సైడ్‌ స్వింగ్‌ వేసిన బంతితో ఇంగ్లాండ్‌ పేసర్‌ బోల్తా కొట్టించాడు. అప్పటి నుంచి మొదలైంది ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు. ఇది జరిగి దశాబ్దకాలం కావస్తున్నా ఇంకా కొనసాగుతోంది.

virat kohli vs james anderson
విరాట్ కోహ్లీ

అండర్సన్‌ చావుదెబ్బ..: కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చాక తొలిసారి విఫలమైంది 2014 ఇంగ్లాండ్‌ పర్యటనలో. ఆ సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 134 పరుగులే చేశాడు. ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. ఆ పర్యటనలో మానసికంగానూ కుంగిపోయాడు. మరీ ముఖ్యంగా అండర్సన్‌ బౌలింగ్‌లో నాలుగు సార్లు పెవిలియన్‌ చేరడం చర్చనీయాంశమైంది. అన్నీ ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ బంతులకే ఔటవ్వడం మరింత గమనార్హం. పేస్‌ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై అండర్సన్‌ ఔట్‌ స్వింగర్‌ బంతులేసి విరాట్‌పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాడు. దీంతో ఈ సిరీస్‌ కోహ్లీ కెరీర్‌లోనే ఓ పీడకలలా మారిపోయింది. తర్వాత దాన్నుంచి బయటపడటానికి బాగానే కష్టపడ్డాడు.

virat kohli vs james anderson
అండర్సన్

విరాట్‌ విశ్వరూపం..: అయితే, ఇంగ్లాండ్‌తో తర్వాత జరిగిన రెండు సిరీస్‌ల్లోనూ విరాట్‌.. అండర్సన్‌కు వికెట్‌ ఇవ్వకపోవడం చెప్పుకోదగ్గ విశేషం. 2014లో తన వైఫల్యాల నుంచి మంచి పాఠాలే నేర్చుకున్న అతడు.. ఇంగ్లాండ్‌ పేసర్‌ను ఎలా ఎదుర్కోవాలనేదానిపైనా ప్రత్యేక దృష్టిసారించాడు. దీంతో 2016 ఆ జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు విరాట్‌ రెచ్చిపోయాడు. ఆ సిరీస్‌లో ఒక శతకం, ఒక ద్విశతకంతో మొత్తం 655 పరుగులు చేశాడు. అలాగే 2018లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు రెండు శతకాలతో మొత్తం 593 పరుగులు చేశాడు. ఈ రెండు సిరీస్‌ల్లోనూ మొత్తం కలిపి 10 మ్యాచ్‌లు జరగ్గా.. అండర్సన్‌ 8 మ్యాచ్‌లు ఆడాడు. అయినా, ఒక్కసారి కూడా విరాట్‌ను ఔట్‌ చేయలేకపోయాడు.

virat kohli vs james anderson
విరాట్

కోహ్లీకి అవకాశం..: ఇక గతేడాది ఇదే సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఇద్దరూ చెరి సమానంగా నిలిచినట్లు అనిపించింది. అప్పటికే కోహ్లీ ఫామ్‌లో లేకపోయినా ఇంగ్లాండ్‌ గడ్డపై రెండు అర్ధశతకాలతో నామమాత్రంగానైనా రాణించాడు. అయితే, అండర్సన్‌.. తొలి, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా ఈ సిరీస్‌లో విరాట్‌ 218 పరుగులు చేశాడు. ఇక ఇప్పుడు జరిగే ఐదో టెస్టులో ఎవరు పైచేయి సాధిస్తారన్నదే ఆసక్తిగా మారింది. ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏమిటంటే కోహ్లీ చివరిసారి ఇదే ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో శతకంతో మెరిశాడు. 2018లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో.. కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు చేశాడు. దీంతో మొత్తంగా 200 పరుగులు చేశాడు. దీంతో అది కోహ్లీకి సానుకూల విషయంగా మారింది. ఇప్పుడు అలాంటి ప్రదర్శన పునరావృతం చేస్తే అభిమానులకు కనులపండగే.

virat kohli vs james anderson
కోహ్లీ

ఇద్దరూ ఇప్పుడెలా ఉన్నారు..: సహజంగా ఏ టెస్టు సిరీస్‌కైనా ఆయా జట్ల అభిమానులు ఏ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఆధిపత్య పోరు బాగుంటుందనే విషయంపై చర్చిస్తారు. అలాగే ఇప్పుడు కూడా కోహ్లీ, అండర్సన్‌ల పోరు ఎలా ఉంటుందనే విషయంపై మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఇంగ్లాండ్‌ పేసర్‌ వయసు 39 ఏళ్లు ఉండగా.. కోహ్లీ వయసు 33. అయితే, అండర్సన్‌ ఇప్పటికీ వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ తరఫున రాణిస్తున్నాడు. కాకపోతే ఈ మధ్య పనిభారం తగ్గించుకునేందుకు మధ్యలో విరామాలు తీసుకుంటున్నాడు. మరోవైపు కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేకున్నా వయసు రీత్యా ఇంకొంత కాలం క్రికెట్‌ ఆడే సత్తా ఉంది. కానీ.. ఈ మ్యాచ్‌ తర్వాత టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య మరో టెస్టు సిరీస్‌ జరగాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటికి అండర్సన్‌ ఫిట్‌నెస్‌తో ఉండి జట్టులో కొనసాగడం దాదాపు అసాధ్యం. దీంతో విరాట్‌ కోహ్లీతో అతడికి ఇదే చివరి టెస్టు కానుందని స్పష్టంగా అర్థమవుతోంది.

virat kohli vs james anderson
.

అండర్సన్‌ బౌలింగ్‌లో కోహ్లీ గణాంకాలు..

ఇదీ చూడండి: IND VS ENG: కథ మారింది.. ఎవరెలా ఆడతారో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.