ETV Bharat / sports

రోహిత్​ భయ్యా దూకుడు లోపించిందా..?

author img

By

Published : Sep 5, 2022, 4:09 PM IST

Updated : Sep 5, 2022, 4:20 PM IST

ఆసియా కప్​లో టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్​ శర్మ దూకుడుగా ఆడట్లేదని క్రికెట్​ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరుపై ఓ లుక్కేద్దాం.

Rohithsharma Vs pakisthan record
రోహిత్ శర్మ పాకిస్థాన్​

Rohithsharma Vs pakisthan record పది మ్యాచ్‌లు.. 110 రన్స్‌.. ఇవేవో లోయర్ ఆర్డర్‌ బ్యాటర్‌ గణాంకాలు కాదు.. టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ పాకిస్థాన్‌పై సాధించిన పరుగులు. అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు శతకాలు బాదిన క్రికెటర్‌ రోహిత్ శర్మ.. అలాంటి ఆటగాడు పాక్‌ మీద మాత్రం భారీ ఇన్నింగ్స్‌లు ఆడటంలో మాత్రం విఫలమయ్యాడు. 2007లో తొలిసారి పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన 30 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. అదీనూ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆరోస్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 16 బంతుల్లోనే సాధించాడు. ఇప్పటి వరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే పాక్‌పై రెండంకెల స్కోరు నమోదు చేశాడు. వాటిల్లో ఈ ఆసియా కప్‌లోనే రెండుసార్లు (12, 28) డబుల్‌ డిజిట్‌ స్కోరు సాధించాడు.

కోహ్లీ అదరగొడ్డుతుంటే.. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడి దాదాపు నెలరోజులపాటు ఆటకు దూరమై తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ అదరగొట్టేస్తున్నాడు. అయితే టీ20ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడే రోహిత్ మాత్రం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన స్థాయి ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు. గత పది టీ20ల్లో కేవలం ఒకే హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. అదీనూ వెస్టిండీస్‌ (67) మీద కావడం విశేషం. ఆరంభంలో దూకుడుగానే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న రోహిత్.. అనవసర షాట్‌కు యత్నించి పెవిలియన్‌కు చేరుతున్నాడు. నిన్న పాక్‌తో మ్యాచ్‌లోనూ ఇలానే దూకుడుగా రెండు సిక్స్‌లు, ఫోర్‌తో 20 బంతుల్లోనే 28 పరుగులు సాధించాడు. అయితే పాక్‌ స్పిన్నర్‌ షాదాబ్‌ బౌలింగ్‌లో చెత్త షాట్‌ కొట్టి ఔటయ్యాడు.

ముందుంది టీ20 ప్రపంచకప్‌ ఇంకా 40 రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఆలోపు భారత్ మరో ఐదారు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలదు. రోహిత్ ఫామ్‌ను అందుకోవడానికి ఎక్కువ సమయం లేదు. ప్రస్తుతం ఆసియా కప్‌ సూపర్‌-4లో భారత్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మంగళవారం శ్రీలంకతో తలపడనుంది. అనంతరం గురువారం అఫ్గాన్‌తో మ్యాచ్‌ ఉంటుంది. ఈ రెండింట్లోనూ విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుకునే అవకాశం ఉంది. అప్పుడు ఇంకో మ్యాచ్‌ను భారత్ ఆడొచ్చు. ఈ టోర్నీ ముగిసిన తర్వాత.. టీ20 ప్రపంచకప్‌ వచ్చేలోపు టీమ్‌ఇండియా కేవలం మరో మూడు టీ20లను మాత్రమే ఆడుతుంది. సెప్టెంబర్‌ 20 నుంచి 25 వరకు ఆస్ట్రేలియాలో భారత్‌ పర్యటించనుంది. ఇక ఆ తర్వాత నేరుగా ప్రపంచకప్‌ బరిలోకి దిగాల్సిందే. గత పొట్టి కప్‌ టోర్నీలో గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్న భారత్‌.. ఈసారి మాత్రం అలాంటి ప్రదర్శనను పునరావృతం చేయకూడదని బలంగా భావిస్తోంది. అలా జరగాలంటే ఓపెనర్‌ కమ్‌ కెప్టెన్‌ అయిన రోహిత్ శర్మ ఫామ్‌ను అందుకోవాల్సిందే.

కెప్టెన్‌గానూ దూకుడు లోపించిందా..? అత్యుత్తమ టీమ్‌ను నడిపించడం పెద్ద కష్టమేమీ కాదు. యువకులతో కూడిన జట్టును ఒత్తిడి సమయంలోనూ అద్భుత ప్రదర్శన ఇచ్చేలా చేయడమే సారథిగా పెనుసవాల్‌. కొన్నిసార్లు కెప్టెన్‌ డేరింగ్‌ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే రోహిత్ శర్మ మాత్రం డిఫెన్సివ్‌గా ఉంటాడని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను తీసుకుంటే.. హార్దిక్‌ పాండ్య, యుజ్వేంద్ర చాహల్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. పార్ట్‌టైమ్‌ బౌలర్‌ దీపక్‌ హుడాను వాడుకోవడంలో విఫలమైనట్లు కనిపించాడు. ఇంతకుముందు దీపక్‌ హుడా బౌలింగ్‌కు వచ్చినప్పుడు వికెట్‌ తీసి బ్రేక్‌ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు అతడి సేవలను వినియోగించుకోలేదు. దీంతో పాక్‌ బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో భారత బౌలింగ్‌పై దాడిని కొనసాగించారు. ఇదే పరిస్థితుల్లో ధోనీ, విరాట్ ఉంటే తప్పనిసరిగా కొత్త బౌలర్‌తో ప్రయోగం చేసేందుకు మొగ్గు చూపేవారని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రోహిత్‌ సారథిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్‌ వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను సొంతం చేసుకుంది. అయితే తొలిసారి కెప్టెన్‌గా ఆసియా కప్‌ బరిలోకి దిగిన రోహిత్ దూకుడైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషిస్తున్నారు.

* 24, 31, 11, 64, 0, 11, 33, 12, 21, 28.. ఇవీ రోహిత్ శర్మ టీ20ల్లో గత పది ఇన్నింగ్స్‌ల్లో చేసిన పరుగులు

* అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గత పది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ చేసిన మొత్తం పరుగులు 235..

ఇదీ చూడండి: పాక్​ చేతిలో టీమ్​ఇండియా ఓటమికి కారణాలివే

Last Updated : Sep 5, 2022, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.