ETV Bharat / sports

రెండో టెస్టుకు రోహిత్ రెడీ.. మరి తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారో?

author img

By

Published : Dec 17, 2022, 7:42 AM IST

Rohit Sharma Injury update : బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన రోహిత్‌ శర్మ.. డిసెంబరు 22 నుంచి బంగ్లాతో ప్రారంభంకానున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. త్వరలోనే రోహిత్‌ బంగ్లాదేశ్‌ చేరుకొని జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Rohit Sharma
రోహిత్ శర్మ

Rohit Sharma Injury update : బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తుండగా టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బొటన వేలికి గాయమైంది. చికిత్స కోసం అతడు భారత్‌కు రావడం వల్ల బంగ్లాతో మూడో వన్డే, తొలి టెస్టుకు దూరమయ్యాడు. డిసెంబరు 22 నుంచి బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు రోహిత్‌ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో టెస్టు ప్రారంభం అయ్యే నాటికి అతడు గాయం నుంచి కోలుకుంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం. త్వరలోనే రోహిత్‌ బంగ్లాదేశ్‌ చేరుకొని జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెండో టెస్టు కోసం కెప్టెన్‌ రోహిత్ తిరిగి జట్టులో చేరితే తుది జట్టులో ఎవరిని తప్పిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తొలి టెస్టులో బ్యాటింగ్‌ విభాగంలో టాప్‌ ఆర్డర్‌లో వైస్‌ కెప్టెన్‌ కేఎల్, రాహుల్‌ మినహా మిగతా ఆటగాళ్లు రాణించారు. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదగా.. వన్‌డౌన్‌ బ్యాటర్ ఛెతేశ్వర్‌ పూజారా తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో (102) శతకం బాదాడు. దీంతో వీరిద్దరూ తుది జట్టులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. రిషభ్ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కూడా మంచి ప్రదర్శనే కనబరచడం వల్ల వారిని తప్పించే అవకాశం కనపడటం లేదు. బ్యాటర్‌గా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమవడం, గత కొంతకాలంగానూ మెరుగైన ప్రదర్శనలు చేయకపోవడంతో కేఎల్‌ రాహుల్‌ స్థానానికే ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్‌ని తప్పిస్తే రోహిత్‌కి ఓపెనింగ్‌ జోడీగా గిల్‌ని పంపే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.