ఇర్ఫాన్​, ఓజా మెరుపులు.. ఫైనల్​లో ఇండియా లెజెండ్స్​

author img

By

Published : Sep 29, 2022, 7:06 PM IST

india legends final in road safety series

రోడ్​ సేఫ్టీ వరల్డ్ సిరీస్​లో ఇండియా లెజెండ్స్​ ఫైనల్​కు ప్రవేశించింది. ఆస్ట్రేలియా లెజెండ్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్ సంగతులు..

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022 టోర్నీలో ఇండియా లెజెండ్స్ ఫైనల్​లో అడుగుపెట్టింది. గురువారం ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. నమాన్ ఓజా(90*, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇర్ఫాన్ పఠాన్(37*, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్​ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. బెన్ డంక్(46, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ షెన్ వాట్సన్(30, 6 ఫోర్లు), అలెక్స్ డూలన్(35, 5 ఫోర్లు), కామెరూన్ వైట్(30*, ఒక ఫోర్, 2 సిక్స్‌లు)పర్వాలేదనిపించారు. భారత లెజెండ్స్ బౌలర్లలో మునాఫ్ పటేల్(2/25), యూసఫ్ పటాన్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. రాహుల్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

నాలుగు బంతులు మిగిలి ఉండగానే.. అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన ఇండియా లెజెండ్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 175 పరుగులు చేసి విజయాన్నందుకుంది. నమాన్ ఓజా, ఇర్ఫాన్ పఠాన్ మినహా ఎవరూ రాణించలేదు. ఆసీస్ లెజెండ్స్ బౌలర్లలో షేన్ వాట్సన్ 2 వికెట్లు తీయగా.. జాసన్ క్రేజా, నాథన్ రియర్డన్, మెక్‌గెయిన్ తలో వికెట్ తీసారు. ఓ దశలో 125 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత లెజెండ్స్.. విజయం సాధించడం కష్టమని అంతా అనుకున్నారు. కానీ ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఈ విజయాన్ని అందుకున్నారు.

టర్నింగ్ పాయింట్.. చివరి 24 బంతుల్లో భారత్ లెజెండ్స్ విజయానికి 49 పరుగులు అవసరమవ్వగా.. ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 36 పరుగులు చేశాడు. డిర్క్ నన్నేస్ వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్(10), సురేశ్ రైనా(11), యువరాజ్ సింగ్(18), యూసఫ్ పఠాన్(1) విఫలమయ్యారు.

సురేశ్ రైనా మెరుపులు.. ఇక ఇదే మ్యాచులో సురేశ్​ రైనా మెరుపులు మెరిపించాడు. తన ఫీల్డింగ్‌ మాయాజాలాన్ని చూపాడు. 16వ ఓవర్లో ఆస్ట్రేలియా ఆటగాడు బెన్‌ డంక్‌ తన బ్యాటింగ్‌తో చెలరేగుతూ బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఫీల్డింగ్‌లో ఉన్న రైనా రెప్పపాటులో గాల్లోకి ఎగిరి బంతిని క్యాచ్‌ పట్టుకున్నాడు. ఆ ఒక్క క్యాచ్‌తో స్టేడియం మొత్తం హోరెత్తింది. కెప్టెన్‌ సచిన్‌ తెందూల్కర్‌ సహా సహచర ఆటగాళ్లు రైనాను అభినందిస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో ఇదే తరహా క్యాచులతో ఆకట్టుకున్న వీడియోలను దీనికి జత చేసి అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు. 2005లో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ ఆటగాడు చెన్నై జట్టులో ధోనీ తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరుపొందాడు. 204 మ్యాచుల్లో 5,528 పరుగులు చేసి అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

ఇదీ చూడండి: 'సచిన్​ కోసం రెండుసార్లు 500 కి.మీ సైకిల్​ మీద వెళ్లా.. కానీ..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.