ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ జట్టు.. ఫుల్​ క్లారిటీతో రోహిత్,​ ద్రవిడ్

author img

By

Published : Feb 21, 2022, 6:15 PM IST

T20 World Cup team India
T20 World Cup team India

Rahul Dravid News: ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​లో పాల్గొనే భారత జట్టుపై క్లారిటీ ఇచ్చాడు టీమ్​ఇండియా హెడ్​కోచ్​ రాహుల్​ ద్రవిడ్. ఇప్పటివరకు జట్టు కాంబినేషన్​ గురించి ఎలాంటి వ్యూహాలు లేవని చెప్పిన ద్రవిడ్​.. తనకు, కెప్టెన్​ రోహిత్​ శర్మకు దానిపై స్పష్టత ఉందని అన్నాడు.

Rahul Dravid News: గతేడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్​లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో గ్రూప్​ దశలోనే వైదొలిగింది. ఆ తర్వాత రవిశాస్త్రి నుంచి టీమ్​ఇండియా ప్రధాన కోచ్​గా బాధ్యతలు చేపట్టిన రాహుల్​ ద్రవిడ్​కు ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​ పెద్ద సవాలుగా మారింది! దీనికి ఇంకా ఎనిమిది నెలల కంటే తక్కువ సమయమే ఉంది. ఈ మెగా టోర్నీ కోసం జట్టు కూర్పునకు ఇప్పటినుంచే కసరత్తు మొదలు పెట్టింది భారత్​. ఈ క్రమంలోనే ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు కాంబినేషన్​పై తనకు కెప్టెన్​ రోహిత్​ శర్మ, టీమ్​ మేనేజ్​మెంట్​కు ఓ క్లారిటీ ఉందని అన్నాడు. ఇప్పటివరకు ఎలాంటి వ్యూహాలు లేవని స్పష్టం చేశాడు. వెస్టిండీస్​తో టీ20 సిరీస్​ను రోహిత్​ సేన క్లీన్​స్వీప్​ చేసిన అనంతరం ద్రవిడ్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.

"నాతో పాటు రోహిత్​, సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్ మధ్య సరైన అవగాహన ఉందని భావిస్తున్నాను. ఎలాంటి ప్లాన్స్​ ఉన్నాయని అనుకోను. కానీ జట్టు కూర్పు (టీ20 ప్రపంచకప్​ కోసం) గురించి చాలా క్లారిటీగా ఉన్నాం. దానిని బ్యాలెన్స్​ చేస్తున్నాం. ఇది వ్యక్తిగత పనిభారం కూడా. అయితే ప్రతిభావంతులైన ఆటగాళ్లతో ఆస్ట్రేలియాకు వెళ్లాలని భావిస్తున్నాం. ఇందుకు టాలెంట్ ఉన్న ప్రతిఒక్కరికీ వారి నైపుణ్యాలను నిరూపించుకునే అవకాశమివ్వాలని అనుకుంటున్నాం. ప్రపంచకప్​ సమయానికి వారు 15 నుంచి 20 మ్యాచ్​లు ఆడే అవకాశముంటుంది. తద్వారా వారి ప్రతిభను నిరూపించుకోవచ్చు"

- టీమ్​ఇండియా హెడ్​కోచ్​ రాహుల్​ ద్రవిడ్​

కిషన్​కు ద్రవిడ్​ మద్దతు

Ishan Kishan Rahul Dravid: ఫామ్​తో ఇబ్బంది పడుతున్న యంగ్​స్టార్​ ఇషాన్​ కిషన్​తో పాటు యువ క్రికెటర్లకు మద్దతుగా నిలిచాడు ద్రవిడ్​. "ఇషాన్ తన సామర్థ్యం, ప్రదర్శనతోనే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఎప్పుడూ ఆటగాళ్లు ఒకేలా ఉండలేరు. వారికి ఇన్ని మ్యాచ్​లే అని పరిమిత విధించకూడదు. రుతురాజ్ గైక్వాడ్ అయినా.. అవేశ్​ ఖాన్ అయినా.. వారిని ఒకే మ్యాచ్​తో అంచనా వేయలేం. మంచి ప్రదర్శనతోనే వారు ఈ స్థాయికి చేరుకున్నారు" అని ద్రవిడ్​ వ్యాఖ్యానించాడు.

సమర్థమైన ఆల్​రౌండర్​ దిశగా వెంకటేశ్​

టీమ్​ఇండియాకు ఎప్పుడూ వెంటాడుతునే సమస్య ఆల్​రౌండర్ల కొరత. సమర్థమైన ఆల్​రౌండర్​గా రాణించినట్లు కనిపించిన హర్దిక్​ పాండ్య.. వెన్నుముక చికిత్స తర్వాత​ ఫిట్​నెస్​, ఫామ్​ లేమితో జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్​, యువ క్రికెటర్​ వెంకటేశ్​ అయ్యర్​కు అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న వీరిద్దరూ రాణిస్తున్నారు. ముఖ్యంగా అయ్యర్..​ జట్టులో సమర్థమైన ఆల్​రౌండర్​​ దిశగా అడుగులు వేస్తున్నాడు. విండీస్​తో టీ20 సిరీస్​లో అటు బ్యాటు.. ఇటు బంతితోనూ ఆకట్టుకున్నాడు.

ఈ విషయమైన మాట్లాడిన ద్రవిడ్.. ఆల్​రౌండర్లు చాలా క్లిష్ట పరిస్థితుల్లో రాణించాల్సి ఉంటుందన్నాడు. ఐపీఎల్​లో కోల్​కతా తరపున ఆడిన అయ్యర్..​ ఓపెనర్​గా బ్యాటింగ్​ వచ్చేవాడని.. కానీ ఇక్కడ పరిస్థితి వేరని ద్రవిడ్​ పేర్కొన్నాడు. తొలి మూడు స్థానాల్లో కుర్రాళ్లు కుదురుకున్నారని.. అందుకే వెంకటేశ్​ను మిడిలార్డర్​లో బ్యాటింగ్​ పంపి ప్రయోగాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అలా ప్రయోగం చేసిన ప్రతిసారి.. అతడు తన ప్రదర్శనతో సత్తా చాటాడని ద్రవిడ్​​ పేర్కొన్నాడు. ఇది చాలా సంతోషకరమైన విషయన్నాడు.

ఈ మేరకే విండీస్​తో వన్డే, టీ20 సిరీస్​ల్లో టీమ్​ఇండియా ప్రయోగాలు చేసింది. ఓపెనర్​ కేఎల్​ రాహుల్​, స్టార్ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా, మహ్మద్​ షమిలకు విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ.. వారికి బదులు ఇషాన్​ కిషన్​, రుతురాజ్​ గైక్వాడ్, అవేశ్​ ఖాన్​ వంటి యంగ్​స్టార్స్​కు అవకాశాలిచ్చింది. ​

మరోవైపు ఈ నెల 24 నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్​కు టీమ్​ఇండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సిరీస్​కు జట్టును ప్రకటించిన భారత జట్టు.. యువ క్రికెటర్లకు అవకాశమిచ్చింది.

ఇదీ చూడండి: శ్రీలంకతో టీ20 సిరీస్​కు భారత స్టార్​పేసర్​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.